అక్రమార్కులకు దడ పుట్టించాలి:కమలాసన్‌ రెడ్డి

Criminal Activists Should Careful Said Kamal Hasan Reddy - Sakshi

కమిషనర్‌ విబి కమల్‌హాసన్‌ రెడ్డి

సాక్షి, కరీంనగర్‌ : అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించాలని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమల్‌హాసన్‌ రెడ్డి టాస్క్‌ఫోర్స్‌ విభాగం పోలీసులను ఆదేశించారు. కరీంనగర్‌ కమిషనరేట్‌లో శుక్రవారం విబి కమల్‌హాసన్‌ రెడ్డి టాస్క్‌ఫోర్స్‌ , షీ బృందాల పోలీసు విభాగాలతో సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, కల్తీ విత్తనాలు, ఆహార పదార్థాలపై దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్‌ విభాగం పోలీసులు అంకితభావంతో పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. ఉత్తమ పనితీరును కనబరిచిన పోలీసులకు రివార్డులు అందజేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌ తరహాలో కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

పోకిరీలకు వణుకు పుట్టాలి..
ప్రేమ పేరిట విద్యార్థులను, మహిళలను వేధించే  పోకిరీలకు వణుకు పుట్టించేలా  పనిచేయాలని  కమిషనర్‌ కమల్‌హాసన్‌ రెడ్డి  షీ బృందాల పోలీసులను ఆదేశించారు. పోకిరీల ఆగడాలను అరికట్టేందుకు వారిపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదూ చేస్తామని తెలిపారు. ముఖ్యంగా షీ బృందాలు తమ పనితీరుతో మహిళలకు భద్రత పట్ల భరోసా కల్పించాలని పేర్కొన్నారు. ప్రేమ పేరుతో వేధిస్తున్న పోకిరీలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చే విద్యార్థినులు, మహిళల పేర్లను గోప్యంగా ఉంచుతామని హామి ఇచ్చారు.ఈ సమావేశానికి అడిషనల్‌ డీసీపీ(లా అండ్‌ ఆర్డర్‌) ఎస్‌.శ్రీనివాస్‌, ఎసిసి శోభన్‌ కుమార్‌, మహిళా పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ దామోదర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top