మే 7 వరకు కంటైన్మెంట్‌ జోన్లు | Sakshi
Sakshi News home page

మే 7 వరకు కంటైన్మెంట్‌ జోన్లు

Published Mon, Apr 20 2020 9:06 AM

Containment Zones Continued May Seventh in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నెల రోజులుగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దీనికి తోడు ఏప్రిల్‌ 24 నుంచి రంజాన్‌ మాసం రాబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కంటైన్మెంట్‌ జోన్లను ఎత్తేస్తే...ఇప్పటి వరకు పడ్డకష్టమంతా వృథా అవుతుంది. ఈ నేపథ్యంలోనే ...ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్‌ పూర్తిగా అదుపులోకి రావాలంటే మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్‌ 20 నుంచి కేసులు తగ్గిన కొన్ని కంటైన్మెంట్‌ జోన్లలో పలు నిబంధనలు సడలించనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారు..వారికి సన్నిహితంగా మెలిగిన కుటంబ సభ్యుల క్వారంటైన్‌ గడువు ఇప్పటికే ముగిసింది. ఎలాంటి కాంటాక్ట్‌ హిస్టరీ లేని వారిలోనే కాదు...జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కూడా లేని వారిలో కరోనా వైరస్‌ వెలుగు చూస్తున్నాయి.

ప్రాంతాల వారిగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్యను బట్టి ప్రభుత్వం కంటైన్మెంట్‌ జోన్లను విభజించింది. ఇలా గ్రేటర్‌లో 146పైగా క్లస్టర్లను ఏర్పాటు చేసింది. పాజిటివ్‌ కేసు నమోదైన ఇంటికి అటు, ఇటు వంద మీటర్ల పరిధిలో ఉన్న నివాసాలను ఈ క్లస్టర్ల పరిధిలోకి తెచ్చింది. సుమారు 75 వేల మంది ఈ క్లస్టర్‌ క్వారంటైన్‌లో ఉన్నట్లు అంచనా. వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి విస్తరించకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో రాకపోకలను నిషేధించింది. అటు వైపుగా వెళ్లే దారులన్నీ మూసివేసింది. లోపలి వారిని బయటికి రాకుండా, బయటి వారిని లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. నిత్యావసరాలు, ఆహారం, మందులు, ఇతర అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ఆయా శాఖల అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసి సమన్వయం చేస్తుంది. అయినప్పటికీ కేసుల సంఖ్య తగ్గక పోగా మరింత పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లోని వారు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. వీరిని నియంత్రించడం ప్రభుత్వానికి కష్టం అవుతుంది. అంతే కాదు కేసుల సంఖ్య కూడా మరింత పెరుగుతుంది. అందువల్ల ఆయా కంటైన్మెంట్‌ క్లస్టర్లలో మరికొంత కాలం లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.  

Advertisement
Advertisement