‘సెంచరీ’ స్నాచర్ అరెస్టు | Sakshi
Sakshi News home page

‘సెంచరీ’ స్నాచర్ అరెస్టు

Published Sun, Nov 23 2014 3:10 AM

'Century' Snatcher arrested

హైదరాబాద్: 124 దొంగతనాలు... నాలుగు సార్లు జైలు... ఇదీ అబ్దుల్లా(28) చోరచరిత్ర... స్నాచింగ్‌లలో సెంచరీ పూర్తి చేసిన ఈ ఘరానా దొంగ చివరికి పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ అమీర్‌పేటలోని కనకదుర్గ గుడి సమీపంలో దొంగతనానికి పథకం పన్నాడని తెలుసుకున్న పోలీసులు పక్కా వ్యూహంతో శనివారం అబ్దుల్లాను పట్టుకున్నారు. అతడి నుంచి రూ. 20 లక్షల విలువ చేసే 77.65 తులాల బంగారు ఆభరణాలు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడి పూర్తి వివరాలను వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. ఆసిఫ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ ఫైసల్ షా అలీ జాబ్రీ అలియాస్ అబ్దుల్లా (28) ఒంటరిగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుని ద్విచక్రవాహనంపై వెళుతూ స్నాచింగ్‌లకు పాల్పడుతుంటాడు. ఇప్పటివరకు సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో 102 దొంగతనాలకు పాల్పడ్డాడు. నాలుగు సార్లు జైలుకు కూడా వెళ్లాడు.

చివరిసారిగా ఈ ఏడాది మార్చి 6న జైలు శిక్ష పూర్తి చేసుకుని బయటికి వచ్చాడు. అయినా తన దారి మార్చుకోలేదు. విడుదలైన తర్వాత ఎనిమిది నెలల్లోనే పంజాగుట్ట, బంజారాహిల్స్,గోల్కొండ, టప్పాచబుత్ర, లంగర్‌హౌస్,రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్‌ల పరిధిలో 22 స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. చివరికి అమీర్‌పేటలో పోలీసులకు చిక్కాడు. విలేకరుల సమావేశంలో అదనపు డీసీపీ కె.ఆర్.నాగరాజు, ఆసీఫ్‌నగర్ ఏసీపీ డి.శ్రీనివాస్, పంజాగుట్ట ఏసీపీ ఎం.వెంకటేశ్వర్లు, ఎస్‌ఆర్ నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రవికుమార్, ఎస్‌ఐ ఎస్.రవికుమార్ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement