కంచె కాటేసింది.. | Sakshi
Sakshi News home page

కంచె కాటేసింది..

Published Sun, Oct 26 2014 12:55 AM

2 farmers died with power shock

కరెంటు షాక్‌తో ఇద్దరు రైతుల మృతి

బసంత్‌నగర్ (కరీంనగర్): ఆరుగాలం కష్టించి పండించిన పంటను అడవిపందుల బారినుంచి కాపాడుకునేందుకు పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ వైరు ఆ ఇద్దరు రైతుల పాలిట మృత్యుపాశమైంది. ప్రమాదవశాత్తు కరెంటు షాక్‌కు గురై ఒకరు, అతడిని రక్షించే ప్రయత్నంలో మరొకరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం పూట్నూర్ గ్రామానికి చెందిన కొండపలకల చిన్నరాజయ్య (65), చొప్పదండి శ్రీనివాస్(35) ఇద్దరు కౌలు రైతులు. గ్రామంలో భూమి సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్న రాజయ్యకు చెందిన పంట కోతదశకు చేరుకోవడంతో దానిని అడవిపందుల బారినుంచి రక్షించుకునేందుకు పొలం చుట్టూ విద్యుత్ వైరుతో కంచె ఏర్పాటు చేశాడు. శనివారం ఉదయం వ్యవసాయ పనుల్లో భాగంగా పొలం వద్దకు వెళ్లిన రాజయ్య కరెంటు వైరు సంగతి మరిచిపోయి పొలంలోకి దిగాడు.  వైరు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. అదే సమయంలో అక్కడే గడ్డికోస్తున్న పక్క పొలానికి చెందిన రైతు చొప్పదండి శ్రీనివాస్, అతని భార్య లలిత రాజయ్య కిందపడడాన్ని గమనించారు. వెంటనే శ్రీనివాస్ పరిగెత్తుకుంటూ వెళ్లి రాజయ్యను రక్షించేందుకు తన చేతిలోని కొడవలితో విద్యుత్ వైర్‌ను లాగే ప్రయత్నం చేయగా, షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. వీరిద్దరిని గమనించిన మరో రైతు లాల్‌మహ్మద్, శ్రీనివాస్ భార్య లలిత గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోని గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే రెండు నిండు ప్రాణాలు కరెంటు కాటుకు బలికావడం విషాదాన్ని నింపింది.

ఐదుగురు రైతుల ఆత్మహత్య

సాక్షి, నెట్‌వర్క్: వర్షాభావ పరిస్థితులతో.. పంటలు దెబ్బతిని పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితి లేకపోవడంతో వేర్వేరుచోట్ల ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.  కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం లింగంపేటకు చెందిన చిన్న దేవయ్య(48) భూమిని కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేస్తున్నాడు. వాతావరణం అనుకూలించక ఈ సారి పంటంతా ఎండిపోయింది. అప్పులు తీర్చలేనని మనస్తాపం చెంది క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా మధిర మండలం రొంపిమళ్లకు చెందిన పత్తి రైతు మొగిలి నాగేశ్వరరావు (30) పంటకు చేసిన అప్పులు తీర్చలేనని ఆందోళనకు గురై.. శనివారం పురుగుమందు తాగాడు. నల్లగొండ జిల్లా నసర్లపల్లికి చెందిన లక్ష్మయ్య(50) సాగుకోసం రూ. 2 లక్షలు అప్పు చేశాడు. పంట దిగుబడి ఆశాజనకంగా లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. నార్కట్‌పల్లి మండలం ఔరవాణినికి చెందిన రామకృష్ణారెడ్డి (46), మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇర్కోడ్‌కు చెందిన మారెడ్డి ఎల్లారెడ్డి (35) వ్యవసాయ అవసరాలకు అప్పు చేసి రుణదాతల నుంచి ఒత్తిళ్లు రావడంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.కాగా, నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలంలోని సజ్జన్‌పల్లికి చెందిన పర్వయ్య (39) ఎండినపంటను చూసి గుండెఆగి మృతి చెందాడు. వరి పొలానికి నీరందక.. ఎండిపోయిన పంటను చూసి పర్వయ్య గుండెపోటుతో కుప్పకూలాడని కుటుంబసభ్యులు  చెప్పారు.
 

Advertisement
Advertisement