అసలు కట్టప్ప ఏమన్నాడు?

అసలు కట్టప్ప ఏమన్నాడు?


న్యూఢిల్లీ: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న ఇంతకాలం ప్రేక్షకుల మదిని తొలుస్తూ వచ్చింది. ఆ స్థానంలో కట్టప్ప కన్నడిగులకు క్షమాపణ చెబుతారా, లేదా ? అన్న ప్రశ్న ఆక్రమించింది.  చెప్పినా దుమారం రేపిన వివాదం సమసిపోతుందా? సినిమా సకాలంలో విడుదలవుతుందా? అని బాహుబలి అభిమానుల్లో ఆందోళన అంకురించింది. బాహుబలి దర్శకుడు రాజమౌలి సోషల్‌ మీడియా ద్వారా కట్టప్ప తరఫు బేషరుతుగా కన్నడిగులకు క్షమాపణలు చెప్పారు.


ఆ మరుసటి రోజే, అంటే శుక్రవారం కట్టప్ప పాత్రధారి, తమిళనటుడు సత్యరాజ్‌ కూడా కన్నడిగులకు క్షమాపణలు చెప్పారు. ఎప్పుడో చేసిన తన వ్యాఖ్యలు కన్నడిగులను నొప్పించి ఉంటే అందుకు క్షమాపణులు చెబుతున్నానని చెప్పారు. ఈ నెల 28వ తేదీన విడుదల కావాల్సిన బాహుబలి–2 చిత్రం విడుదలను అడ్డుకోరాదని వేడుకున్నారు.ఇంతకు కన్నడిగులను అవమానించేలా సత్యరాజ్‌ ఏమన్నారు? ఎప్పుడన్నారు? అన్న ప్రశ్నలు కూడా సినిమా ప్రేక్షకులకు కలుగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య 800 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్న కావేరీ నదీ పంపకాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో వివాదం నెలకొన్న విషయం తెల్సిందే. ఇరు రాష్ట్రాల నటులు ఎన్నో ఏళ్లుగా వారి వారి ప్రభుత్వాల వైఖరీలకు మద్దతుగా ప్రజాందోళనలకు మద్దతిస్తున్నారు. ధర్నాలు, బైఠాయింపుల్లో కూడా పొల్గొంటున్నారు. 2008లో చెన్నైలో నిర్వహించిన ఓ ధర్నా కార్యక్రమంలో రజనీకాంత్, కమల్‌ హాసన్‌ లాంటి నటులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో సత్యరాజ్‌ మాట్లాడుతూ ‘కుక్కలు ఉచ్చపోస్తుంటే మౌనం వహించే మానులా తమిళప్రజలు ఉండరాదు’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు మండిపడ్డాయి.కాలక్రమంలో ఈ మాటలు ఇరు రాష్ట్రాల ప్రజలు మరచిపోయారు. బహూశ సత్యరాజ్‌ కూడా మరచిపోయి ఉంటారు. బాహుబలి–2 విడుదలను పురస్కరించుకొని కొందరు నాడు సత్యరాజ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ఏప్రిల్‌ 28న విడుదలవుతున్న బాహుబలిని అడ్డుకోవడంతోపాటు మొత్తం బెంగళూరు బంద్‌కు వటల్‌ నాగరాజ్‌ నాయకత్వంలోని ‘కన్నడ చలవలి వటల్‌ పక్ష’ సంఘం పిలుపునిచ్చింది.


అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు  బేషరుతుగా సత్యరాజ్‌ క్షమాపణలు చెబితేగానీ విడుదలను అనుమతించమని నాగరాజ్‌ హెచ్చరించారు. దానికి కన్నడి చలనచిత్ర వాణిజ్య మండలి కూడా మద్దతు పలికింది. సత్యరాజ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు చేసినవా, ఎప్పుడో చేసినవా అన్న అంశంతో తమకు సంబంధం లేదని, ఆ వ్యాఖ్యలు కర్ణాటకను, కన్నడిగులను అవమానపరిచే విధంగా ఉన్నాయని మండలి వ్యాఖ్యానించింది. గతంలో నాగరాజ్‌ను పెద్ద కమెడియన్‌ అంటూ కూడా సత్యరాజ్‌ ఎద్దేవ చేశారు.ఈ నేపథ్యంలోనే సత్యరాజ్‌ క్షమాపణల పత్రాన్ని చదవి దాన్ని వీడియోతీసి మీడియాలకు విడుదల చేశారు. కన్నడ సంఘాలు సత్యరాజ్‌ను బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని కోరితే క్షమాపణలు చెప్పిన సత్యరాజ్‌ చివరలో తాను తమిళ ప్రజల పోరాటానికి ఎప్పుడూ అండగా నిలబడతానని కూడా చెప్పారు. మరి ఇంతటితో వివాదం సమసిపోతుందా, లేదా చూడాలి. వివాదానికి తెరపడకపోతే వాస్తవానికి సత్యరాజ్‌కు వచ్చే నష్టమేమి లేదు. 45 కోట్ల రూపాయలకుపైగా డబ్బులుపెట్టి చిత్రం హక్కులుకొన్ని కన్నడ డిస్ట్రిబ్యూటర్లే నష్టపోతారు.

Back to Top