చరిత్ర సృష్టించిన ఆ రికార్డుకు 17 ఏళ్లు! | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 14 2018 5:48 PM

 VVS Laxman And Rahul Dravid Scripted A Historic Test Comeback Ever At The Eden Garden - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఇదే రోజు భారత క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతం చోటుచేసుకుంది.  గెలవడం అసాధ్యమని భావించిన మ్యాచ్‌ను హైదరాబాదీ స్టైలీష్‌ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, టీమిండియా వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌లు(376 పరుగుల) అద్భుత భాగస్వామ్యంతో సుసాధ్యం చేశారు. ఈ మ్యాచ్‌ భారత క్రికెట్‌ చరిత్రలోనే ఓ మైలు రాయిగా నిలిచిపోయింది. ఈ రికార్డుకు 17ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆ నాటి మ్యాచ్‌ విశేషాలు     

‘నాజీవితంలో మరిచిపోలేని మ్యాచ్‌.. అసాధ్యం కానీ మ్యాచ్‌ను వీవీఎస్‌ లక్ష్మణ్‌, ద్రవిడ్‌లు అద్భుత ఇన్నింగ్స్‌తో సుసాధ్యం చేశారు. క్రికెట్‌ చరిత్రలో ఇది ఓ గొప్ప ప్రదర్శన’ అని ఆనాటి కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తన ఆత్మకథ ‘ఎ సెంచరీ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌’లో ప్రస్తావించారు.  

హర్భజన్‌ హ్యాట్రిక్‌
అది 2001 మార్చి 14 కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా  445 పరుగులు చేసింది. భారత స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ సాధించి 7 వికెట్లతో చెలరేగాడు. అయినా ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ పరుగులు రాబట్టారు. అప్పటి ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌వా(110), హెడెన్‌ (97), లాంగర్‌లు 58తో రాణించడంతో భారీ స్కోర్‌ నమోదు చేసింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 171 ఆలౌట్‌
గంగూలీ సారథ్యంలోని భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. హైదరాబాదీ స్టైలీష్‌ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ (59) మినహా మిగతా బ్యాట్స్‌మన్‌ అంతా చేతులెత్తేసారు. దీంతో భారత్‌ కేవలం 171 పరుగులకే కుప్పకూలింది.  తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 274 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను మళ్లీ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ తరుణంలో మ్యాచ్‌ను ఏకపక్షంగా ఆసీస్‌ గెలుస్తోందని భావించారు.

అయితే అందరి అంచనాలను తలికిందులు చేస్తూ వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌లు చెలరేగారు. ఏకంగా ఐదో వికెట్‌కు 376 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.  టెస్టుల్లో అత్యధిక స్కోరును లక్ష్మణ్‌ (281) సాధించగా ద్రవిడ్‌(180) పరుగులు చేయడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను 657 /7 వద్ద డిక్లెర్‌ ఇచ్చింది. దీంతో ఆసీస్‌కు దిమ్మతిరిగింది.

చెలరేగిన బజ్జీ, సచిన్‌
383 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ను టర్బోనేటర్‌ బజ్జీ దెబ్బకొట్టాడు. ఏకంగా 6 వికెట్లతో  ఆసీస్‌ పతనాన్ని శాసించగా.. సచిన్‌ టెండూల్కర్‌ మూడు వికెట్లు పడగొట్టడంతో ఆతిథ్య జట్టు 212 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో భారత్‌ అనూహ్యంగా 171 పరుగులతో తేడాతో భారీ విజయం సాధించింది. కాకతాళీయమో ఏమో కానీ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఆలౌట్‌ అయిన (171) స్కోర్‌ తేడాతోనే విజయం సాధించడం విశేషం.

ఈ మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ బీసీసీఐ, వీవీఎస్‌ లక్ష్మణ్‌లు ట్విటర్‌లో ప్రస్తావించారు. ‘ మనల్ని మనం నిరూపించుకోవాడనికి ఎదో ఒక రోజు అవకాశం వస్తుంది. అలాంటి రోజే నాకు17 ఏళ్ల క్రితం వచ్చింది. దేశ సేవ కోసం వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. ఈ అవకాశం నా ఒక్కడికే కాదు ద్రవిడ్‌, సచిన్‌, హర్భజన్‌లతో జట్టు మొత్తానికి వచ్చింది’ అని లక్ష్మణ్‌ ట్వీట్‌ చేశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement