నేను చాలా బద్ధకస్తుడిని!  | Sakshi
Sakshi News home page

నేను చాలా బద్ధకస్తుడిని! 

Published Wed, Mar 14 2018 1:14 AM

Virat Kohli recognises the need to manage his workload - Sakshi

న్యూఢిల్లీ: మైదానంలో విరాట్‌ కోహ్లి చురుకుదనం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కు కొత్త అర్థం చెప్పిన ఆటగాడతను. అయితే ఆటకు దూరంగా ఉన్న సమయంలో మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంటానని అతడు చెబుతున్నాడు. ఏదైనా పని లేకపోతే తనంత బద్ధకస్తుడు మరొకరు ఉండరని కోహ్లి వెల్లడించడం విశేషం. మంగళవారం జరిగిన ఒక ప్రచార కార్యక్రమంలో కోహ్లి తన ఇష్టాయిష్టాల గురించి ఆసక్తికర సంగతులు పంచుకున్నాడు.  

చిరాకు తెప్పించేలా... 
చేయాల్సిన పనేమీ లేనప్పుడు ఒకే చోట నేను గంటల కొద్దీ కూర్చుండిపోతాను. మైదానంలో ఎంత చురుగ్గా ఉన్నా, ఇంట్లో మొద్దులా ఉండిపోతా. నా ఈ ప్రవర్తన ఇతరులకు చిరాకు తెప్పించేలా ఉంటుంది. నేను ఎంత బద్ధకస్తుడినో దీన్ని బట్టి చెప్పవచ్చు. ప్రస్తుతం లభించిన విరామాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటం లేదు. ఫలితాల గురించి మాత్రం తెలుసుకుంటున్నాను.  

అతడు అసాధ్యానికి సవాల్‌ విసురుతున్నాడు... 
ఇటీవలే స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ ఆటోబయోగ్రఫీ చదివాను. స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ నా ఫేవరెట్‌ ప్లేయర్‌. ఫెడరర్‌ అద్భుతంగా, అందంగా ఆడతాడు. తనకు ఒక మంచి కుటుంబం ఉంది. ప్రాధాన్యతలేమిటో బాగా తెలుసు. జనాల వ్యాఖ్యలు, విమర్శల గురించి పట్టించుకోకుండా తనకంటూ సమయాన్ని కేటాయిస్తాడు. 36 ఏళ్ల వయసులో అలవోకగా గ్రాండ్‌స్లామ్‌లు గెలిచేస్తున్నాడు. అసాధ్యం అనే మాటనే అతడు సవాల్‌ చేస్తున్నాడు. నిజంగా రోజర్‌ అంటే చాలా గౌరవం. 

బయోపిక్‌ బాగుండదేమో... 
నా బయోపిక్‌ తీస్తే అది ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. నా జీవితం సరిగ్గా ఎలా సాగిందో అది అలాగే ఉండాలి. నిజంగా తీస్తే గనక ఒక కొత్త నటుడు ఎవరైనా నా పాత్రను సమర్థంగా పోషించాల్సి ఉంటుంది. చేతి గడియారాన్ని బహుమతిగా ఇవ్వాలనుకుంటే చహల్‌కు ఇస్తాను. ఎందుకంటే అతను ప్రతీసారి ఆలస్యంగా వస్తాడు.

రాయల్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా మజుందార్‌ 
జైపూర్‌: దేశవాళీ మాజీ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ అమోల్‌ మజుందార్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. హెడ్‌ కోచ్‌ ప్యాడీ ఆప్టన్, బౌలింగ్‌ కోచ్‌ సాయిరాజ్‌ బహుతులేలతో కలిసి అతడు పనిచేయనున్నాడు. మజుందార్‌ (ముంబై) 171 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడి 48.13 సగటుతో 11,167 పరుగులు చేశాడు.

Advertisement
Advertisement