మూడేళ్ల తరువాత పునరాగమనం | Sakshi
Sakshi News home page

మూడేళ్ల తరువాత పునరాగమనం

Published Thu, Jan 11 2018 4:18 PM

Surprise recall for Cameron White after three year - Sakshi

మెల్‌బోర్న్‌:దాదాపు మూడేళ్ల తరువాత ఆస్ట్రేలియా సీనియర్‌ ఆటగాడు కామెరాన్‌ వైట్‌ పునరాగమనం చేయబోతున్నాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం నుంచి ఆరంభమయ్యే ఐదు వన్డేల సిరీస్‌లో కామెరాన్‌కు చోటు కల్పిస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధం కావాలని కామెరాన్‌కు కబురు అందింది. 2015, జనవరి 23న ఆసీస్‌ తరపున చివరసారి కనిపించిన కామెరాన్‌.. సుదీర్ఘ విరామం తరువాత తాజాగా చోటు దక్కించుకోవడం విశేషం. గాయం కారణంగా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు దూరమైన క్రిస్‌ లిన్‌ స్థానంలో 34 ఏళ్ల కామెరాన్‌కు అవకాశం దక్కింది. ఆసీస్‌ తరపున కామెరాన్‌ 88 వన్డేలు ఆడాడు.


కామెరాన్‌కు అవకాశం ఇవ్వడానికి అతని ప్రస్తుత ఫామ్‌ను పరిగణలోకి తీసుకున్నమని సీఏ సెలక్టర్‌ ట్రావెర్‌ హాన్స్‌ తెలిపారు.. గత కొంతకాలంగా దేశవాళీ లీగ్‌ మ్యాచ్‌ల్లో అద్భుతమైన గణాంకాలను నమోదు చేయడమే అతని ఎంపికకు ప్రధాన కారణమన్నారు. ప్రధానంగా బిగ్‌బాష్‌ లీగ్ ‌(బీబీఎల్‌)లో అత్యధిక స్కోర్లను సాధించిన ఆటగాళ్లలో కామెరాన్‌ ఒకడని పేర్కొన్నారు. సీనియర్‌ క్రికెటరే కాకుండా మంచి ఫీల్డరైన కామెరాన్‌ అనుభవం ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కలిసొస్తుందని ట్రావెర్‌ అభిప్రాయపడ్డారు.
 

Advertisement
Advertisement