అతడు త్వరగా నేర్చుకునే రకం | Sakshi
Sakshi News home page

అతడు త్వరగా నేర్చుకునే రకం

Published Sun, Apr 22 2018 1:18 AM

sunil gavaskar match analysis - Sakshi

సీజన్‌లో తొలి విజయం అందుకున్న ముంబై ఇండియన్స్‌ నాలుగు రోజుల అనంతరం మళ్లీ సమరోత్సాహంతో బరిలో దిగుతోంది. ఈసారి వారి ప్రత్యర్థి రాజస్తాన్‌ రాయల్స్‌. ఆ జట్టులో ప్రారంభం నాటి ఊపు లేదు. ఇలాంటి ఒడిదొడుకులే టోర్నీని ఆసక్తికరంగా మారుస్తాయి. మ్యాచ్‌ రోజు ఫలితం ఎలా ఉంటుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫామ్‌లోకి రావడంతో ముంబై గత మ్యాచ్‌లో బెంగళూరుకు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. బంతిని అవలీలగా, నమ్మశక్యం కాని రీతిలో స్టాండ్స్‌లోకి కొట్టే రోహిత్‌కు అడ్డుకట్ట వేయడం అసాధ్యమే. అతడు జోరు మీదుంటే కొన్ని మంచి షాట్లను చూడగలం. ఎవిన్‌ లూయీస్‌ అద్భుత ఆరంభాలు ఇస్తున్నా, ముంబైకి ఫినిషర్ల అవసరం చాలా ఉంది. వారి కెప్టెన్‌ గ్రహించాల్సిన అంశం ఇదే. పొలార్డ్‌తో పాటు పాండ్యా సోదరులు హార్దిక్, కృనాల్‌ పెద్ద ఇన్నింగ్స్‌ బాకీ ఉన్నారు. ఇషాన్‌ కిషన్‌ ఫిట్‌గా లేకుంటే కృనాల్‌ ముందుగా బ్యాటింగ్‌కు రావాలి. బెంగళూరుపై కొంత ఇబ్బంది పడినా మయాంక్‌ మార్కండే తొందరగానే కుదురుకున్నాడు. ఫీల్డింగ్‌ పరిమితులు తొలగాక అతడు మరోసారి కీలకంగా మారగలడు. బుమ్రా గాడిన పడే ప్రయత్నంలో ఉండగా, ముస్తఫిజుర్‌ రెండేళ్ల క్రితం నాటి స్థాయిలో లేడు. 

వాట్సన్‌ శతకంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తనదైన శైలిలో గెలుపు దారిలోకి వచ్చింది. ఆదివారం సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌పైనా ఇదే విధంగా ఆడగలమని ఆశాభావంతో ఉంది. గేల్‌ దెబ్బతో తొలి ఓటమిని మూటగట్టుకున్న సన్‌రైజర్స్‌... తమ కీలక ఆటగాడు శిఖర్‌ ధావన్‌ ఫిట్‌నెస్‌ సాధించాలని కోరుకుంటోంది. దూకుడుగా ఆడే అతడు ఫామ్‌లో ఉన్నాడు. లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ తప్పుల నుంచి త్వరగా నేర్చుకునే రకం. గేల్‌ సునామీ నుంచి తేరుకుని తను మరింత బలంగా వస్తాడు. ఇప్పుడు మళ్లీ మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలుస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారమే కెప్టెన్లు తుది జట్టును ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంది.  

Advertisement
Advertisement