ఈ ఏడాది లేనట్టే! | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది లేనట్టే!

Published Tue, Jan 30 2018 7:50 AM

Shruti Haasan had a special birthday bash with rumoured beau Michael Corsale - Sakshi

తమిళసినిమా: నా పెళ్లి ఈ ఏడాది ఉండదని నటి శ్రుతీహాసన్‌ అంటున్నారు. శ్రుతిని తెరపై చూసి రెండేళ్లు దాటింది. చివరగా తెలుగులో పవన్‌కల్యాణ్‌తో నటించిన కాటమరాయుడు చిత్రం శ్రుతీహాసన్‌ను నిరాశపరచింది. అనంతరం తమిళంలో సంఘమిత్ర చిత్రం నుంచి వైదొలగడం పెద్ద వివాదానికే దారి తీసింది. తన తండ్రితో కలిసి తొలిసారిగా నటించిన శభాష్‌నాయుడు చిత్రం మధ్యలోనే నిలిచిపోయింది. వరుసగా శ్రుతీహాసన్‌కు ఎదురు దెబ్బలు తగిలినా, డోంట్‌ కేర్‌ అన్నట్లుగా తన బాయ్‌ఫ్రెండ్‌తో జాలీగా ఎంజాయ్‌ చేసేస్తున్నారు.

లండన్‌కు చెందిన మైఖెల్‌ కోర్సల్‌తో ఈ బ్యూటీ చాలాకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య చెన్నైలో జరిగిన నటుడు ఆదవ్‌ కన్నదాసన్‌ పెళ్లి వేడుకలో శ్రుతి తన బాయ్‌ఫ్రెండ్‌తో సందడి చేసిన విషయం తెలిసిందే. అదే వేడుకలో ఈమె తండ్రి కమలహాసన్‌ కూడా పాల్గొనడం విశేషం. ఆ తరువాత తల్లి సారికకు తన భాయ్‌ఫ్రెండ్‌ను శ్రుతి పరిచయం చేశారు. దీంతో ఈ ప్రేమ జంట పెళ్లికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ కారణంగానే శ్రుతి కొత్త చిత్రాలను అంగీకరించడం లేదనే టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఇలాంటి ప్రచారానికి స్పందించిన శ్రుతీహసన్‌ తాను ఈ ఏడాది పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నటనపైనే తన దృష్టి అని, త్వరలోనే కొత్త చిత్రంలో నటించనున్నానని చెప్పారు. ఇలాఉండగా ఈ బ్యూటీ ఆదివారం తన పుట్టిన రోజును లాస్‌ఏంజల్స్‌లో అక్కడి స్నేహితులతో జరుపుకుని అందరిని ఆశ్చర్యపరచారు.

Advertisement
Advertisement