బాబు అవినీతే పోలవరానికి శాపం

YS Jaganmohan Reddy fires on CM Chandrababu at Nallajerla - Sakshi

నల్లజర్ల సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఆగ్రహం 

ఎన్నికలప్పుడే ఆయనకు ప్రాజెక్టులు గుర్తుకొస్తాయి 

పునాది రాళ్లు వేయడం.. మరచిపోవడం అలవాటే 

మూడు పునాదిరాళ్లు.. మూడు కథలంటూ ఇక్కడి రైతులు చెబుతున్నారు 

ముఖ్యమంత్రే దళారీ నాయకుడైతే పంటలకు ధరలెలా వస్తాయి? 

హామీలన్నీ నెరవేర్చానని కొత్త నాటకాలు 

ఇలాంటి నాయకుడిని నమ్మొద్దని ప్రతిపక్ష నేత పిలుపు 

నీరు – చెట్టు.. గ్రామాలకు గ్రామాలనే దోచేసే కార్యక్రమం అది. మట్టి తవ్వుతారు.. డబ్బులు తీసుకుంటారు. అదే మట్టిని అమ్మి మళ్లీ సొమ్ము చేసుకుంటారు. ఇదే నియోజకవర్గంలోని దూబచర్లలో  ఊరచెరువు చూసినా, దేవరపల్లి ఎర్నగూడెం చెరువును చూసినా ఇదే పరిస్థితి. నల్లజర్ల, పోలవరంలో అయితే చెరువులు తవ్వకుండానే బిల్లులు తీసుకుంటున్నారంటే అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది.   

రూ.87,612 కోట్ల రైతు రుణాలన్నీ బేషరుతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. రుణ మాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. పైగా రైతులందరికీ రుణాలు మాఫీ చేసేశాడట. రైతులు కేరింతలు కొడుతున్నారట. ఆయన గారి ఎల్లో మీడియా పేపర్లలో పతాక శీర్షికలతో వార్తలు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా విశాఖపట్నం సమ్మిట్‌లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెబుతాడు. ఇలా ఆయన ఎల్లో మీడియాలో రాయించుకుంటాడు. 40 లక్షల ఉద్యోగాలు మీకెక్కడైనా కన్పించాయా?       
– వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ఎన్నికలప్పుడే చంద్రబాబుకు ప్రాజెక్టులు గుర్తుకు వస్తాయని, పునాదిరాళ్లు వేయడం.. మరచిపోవడం ఆయనకు అలవాటేనని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు పనులు కుంటుపడడానికి చంద్రబాబు అవినీతి, బినామీ కాంట్రాక్టర్లే కారణమని ఆరోపించారు. రైతుల గురించి పట్టించుకోవాల్సిన ముఖ్యమంత్రే పెద్ద దళారీ అయితే పంటలకు గిట్టుబాటు ధరలు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలు మాఫియా ముఠాలుగా తయారై దివ్యాంగులకూ పింఛన్లు తీసేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 165వ రోజు శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని     నల్లజర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండానే చేసినట్టు, రైతులందరూ ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతున్నట్టు అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

ఇలాగైతే పోలవరం ఎప్పటికి పూర్తయ్యేను? 
‘‘కుక్కర్‌లో బియ్యం ఉడుకుతున్నట్టు ఉష్ణోగ్రతలు మండిపోతున్నా ఈ నియోజకవర్గ ప్రజలు నాతో భుజం భుజం కలిపి అడుగులో అడుగు వేశారు. ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పటి నుంచి అన్నదాతలు అనేక మంది వారి సమస్యలను విన్నవించారు. పోలవరం పూర్తయితే మా నియోజకవర్గం కూడా సస్యశ్యామలమవుతుందన్నా అంటూ వైఎస్సార్‌ హయాంను గుర్తు చేసుకున్నారు. దశాబ్దాలుగా చాలా మంది ముఖ్యమంత్రులైనా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా అడుగులు వేసింది వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక్కరేనన్నా అని చెప్పారు. వైఎస్‌ హయాంలో పోలవరం కుడికాలువ పనులు 90 శాతం, ఎడమ కాలువ పనులు 60 శాతం పూర్తయ్యాయి. నాన్నగారి హయాంలో పరుగులు తీసిన ఈ ప్రాజెక్టు పనులు నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. ‘ఇదే ప్రాజెక్టులో 36 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి కావాల్సి ఉంటే నాలుగేళ్లుగా కేవలం 6 లక్షల మీటర్ల పనులే పూర్యయ్యాయన్నా.. ఇలాగైతే ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందన్నా?’ అని ఈ ప్రాంత వాసులు ప్రశ్నిస్తున్నారు.

పక్కనున్న తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో రోజుకు 22 వేల క్యూబిక్‌ మీటర్ల పనులు జరుగుతుంటే ఇక్కడ రోజుకు 3 వేల క్యూబిక్‌ మీటర్ల పనులు కూడా జరగడం లేదని రైతులు చెబుతున్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను కేంద్రం తీసుకోవాల్సి ఉంటే ఈయన్ను (చంద్రబాబు) ఎవరు తీసుకోమన్నారన్నా? అని ప్రశ్నిస్తున్నారు. తానే పూర్తి చేస్తానని చంద్రబాబు ఈ ప్రాజెక్టును తీసుకున్న తర్వాత అదంతా అవినీతి మయం అయింది. పనులు జరగడం లేదు. అడ్డగోలుగా రేట్లు పెంచుతున్నారు. మూడేళ్లుగా క్రూడాయిల్‌ ధర, ఇనుము, అల్యూమినియం, సిమెంట్‌ ధర తగ్గినా, ఇసుక ఫ్రీగా దొరుకుతున్నా చంద్రబాబు మాత్రం కాంట్రాక్టర్లకు రేట్లు రోజురోజుకూ పెంచుతున్నారు. బీనామీలకు నామినేషన్‌ పద్ధతిపై కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. సాక్షాత్తు చంద్రబాబు క్యాబినెట్‌లోని యనమల రామకృష్ణుడి వియ్యంకుడు సబ్‌ కాంట్రాక్టర్‌గా నామినేట్‌ అయ్యారు. ఇంత దారుణంగా అవినీతి జరుగుతోంది కాబట్టే కేంద్రం కూడా నిధులు ఇవ్వకుండా అడ్డుతగులుతోందన్న అభిప్రాయాన్ని రైతన్నలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి వరం లాంటి ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి చంద్రబాబు అవినీతే కా>రణమని, ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రం అంతా బాగుపడుతుందని తెలిసినా కూడా విచ్చల విడి అవినీతితో ప్రాజెక్టు నత్తనడక నడుస్తున్నందుకు నిజంగా బాధ అనిపిస్తోంది. 
 
మూడు ప్రాజెక్టులకూ గ్రహణం 
చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఇదే పరిస్థితి అని రైతులు వాపోతున్నారు. చంద్రబాబుకు ఎన్నికలప్పుడే రైతులు గుర్తుకొస్తారు.. ప్రాజెక్టులు గుర్తుకు వస్తాయన్నా.. ఎన్నికలకు ముందు ఒక టెంకాయ, ఒక శంకుస్థాపన.. ఆ తర్వాత వాటిని మరచిపోవడం మామూలేనన్నా అంటూ 3 రాళ్లు, 3 ప్రాజెక్టుల కథను నాకు చెప్పారు. గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిద్రపోయిన చంద్రబాబు ఎన్నికలకు ముందు తాడిపూడి ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేసి ఆ తర్వాత పట్టించుకోలేదు. నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యాక రూ.240 కోట్లతో 95 శాతం ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తే నేటికీ మిగిలిన 5 శాతం పిల్లకాలువ పనులు పూర్తి కాని దుస్థితి. దీంతో 2.10 లక్షల ఎకరాలకు నీరు అందించాల్సిన ఆ ప్రాజెక్టు ఇప్పటికీ 60 వేల ఎకరాలకూ నీరివ్వని పరిస్థితన్నా అని రైతులు చెప్పినప్పుడు నిజంగా బాధేసింది. అదే మాదిరిగా కొవ్వాడ కాలువపై ఎల్‌ఎన్‌డీ పేట వద్ద రిజర్వాయర్‌కు 2003లో చంద్రబాబు శంకుస్థాపన చేసి మరచిపోతే వైఎస్‌ రాజశేఖరరెడ్డి పూర్తి చేశారు. దీంతో గోపాలపురం నియోజకవర్గంలో సుమారు 30 వేల ఎకరాలకు పోలవరం, కొయ్యలగూడెం ప్రాంతాలలో 1.25 లక్షల ఎకరాలకు నీరు అందుతోందని చెబుతా ఉన్నారు. ఇక మూడోది ద్వారకా తిరుమల మండలం సీహెచ్‌పోతేపల్లి వద్ద గిరియమ్మ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేసి ఆ తర్వాత పట్టించుకోలేదని రైతులు చెప్పారు. ఈ ప్రాజెక్టునూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పూర్తి చేసి 7 వేల ఎకరాలకు నీరు ఇచ్చేలా చేశారు. 2010లో ట్రెయల్‌ రన్‌ చేసినా కూడా ఇప్పటికీ చిన్నచిన్న పనులు పూర్తి కాక నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. ఇటువంటి పాలన చూస్తుంటే బాధనిపిస్తోంది.  
 
స్వరాష్ట్రంలో తక్కువ, తెలంగాణలో ఎక్కువ  
ఈ ప్రాంతంలో పామాయిల్‌ రైతులు ఎక్కువ. సుమారు 2 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ తోటల్ని పెంచుతారు. ఇక్కడే పెదవేగిలో ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ రికవరీ రేటు నిర్ధారిస్తారు. ఏపీలో రికవరీ నిర్ధారణలో అవకతవకల వల్ల పక్కనే ఉన్న తెలంగాణలోని అశ్వారావుపేటలో కంటే తక్కువ రేటు మన రైతులకు వస్తోంది. రికవరీ శాతంలో తేడా వల్ల ఇలా జరుగుతోందని రైతులు చెబుతున్నారు. తెలంగాణలో 16.4 శాతం రికవరీకి రూ.10,200 వస్తుంటే ఆంధ్రాలో 18.4 శాతం రికవరీకి రూ.9,200 వస్తోంది. రూ.1000 తేడా ఉన్నా పట్టించుకున్న వారే లేరు. పొగాకు రైతులదీ ఇదే పరిస్థితి. ఈ ప్రాంతంలోని గోపాలపురం, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ప్రాంతాలలో దాదాపు 52 వేల ఎకరాల్లో పొగాకు సాగవుతుంది. ఈ ఏడాది సగటు రేటు మాత్రం కిలోకు రూ.145 దాటడం లేదు. అదే పక్కనున్న కర్ణాటకలో కిలో రూ.175 – 180 మధ్య పలుకుతోంది. చంద్రబాబు మాత్రం పట్టించుకోడు.

2015 జూలైలో దేవరపల్లిలో, జంగారెడ్డిగూడెంలో, ప్రకాశం జిల్లా టంగుటూరులో ఇదే పరిస్థితి. జగన్‌ వచ్చి ధర్నా చేస్తే తప్ప ధరలు పెరగడం లేదు. దెందులూరులో మొన్న రైతు సదస్సు జరిగినప్పుడు ఓ రైతు వచ్చి ఓ విషయం చెప్పాడు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రి కావడానికి ముందు పొగాకు ధర కిలో రూ.190 ఉంటే ఆయన ప్రమాణ స్వీకారం చేశాక అది రూ.76కు పడిపోయింది. నాన్నగారి హయాంలో ఓసారి ఇదే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన రూ.500 కోట్లతో ఎస్టీసీని రంగంలోకి దింపి పొగాకును కొనుగోలు చేయించడం ప్రారంభించడంతో రేటు రూ.110 నుంచి 200 దాకా వెళ్లిందని చెప్పాడు. ఇవాళ నాన్నగారి మాదిరిగా రైతుల పక్షాన ఆలోచించే పరిస్థితి లేదన్నప్పుడు బాధ కలిగింది. పొగాకు అమ్ముకోలేకపోతున్నామని, కనీసం తమ వద్ద ఉన్న పొగాకు బ్యారన్ల పర్మిట్లు తీసుకుని పది లక్షల రూపాయల నష్టపరిహారం ఇమ్మని రైతులు అడిగినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వరి, మొక్కజొన్న.. ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. చంద్రబాబు తన హెరిటేజ్‌ సంస్థ కోసం రైతులను నిలువునా ముంచేస్తున్నారు. పంటల్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, నీట్‌గా ప్యాకింగ్‌ చేసి మూడింతల  లాభలకు అమ్ముకుంటున్నారు. చంద్రబాబే దళారుల నాయకుడిగా వ్యవహరిస్తుంటే రైతులకు గిట్టుబాటు ధర ఎలా వస్తుంది?  
 
ఈ పెద్దమనిషి అప్పుడేం చెప్పాడు? 
నాలుగేళ్ల క్రితం చంద్రబాబు వేసిన డ్రామాలు, టీవీల్లో ప్రకటనలు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. టీవీలో ఓ ప్రకటన వస్తుంది. అందులో ఓ అక్క మెడలో మంగళసూత్రాన్ని ఒక చేయి లాక్కెళ్లిపోతాఉంటే పక్కనుంచి మరో చెయ్యి వచ్చి పట్టుకుంటుంది. వెంటనే ఆయనొస్తున్నాడు అంటారు.. నాలుగేళ్లు అయిపోయింది. ఇప్పుడేం జరుగుతోందో మీకు తెలుసు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం మీ ఇంటికి రాలేదు కానీ వేలం నోటీసులు మాత్రం వస్తున్నాయి. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. జాబు రావాలి అంటే బాబు రావాలన్నాడు. ఉద్యోగం, లేదా ఉపాధి ఇవ్వలేకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నాలుగేళ్లు అయిపోయింది. చంద్రబాబు ఇటువైపు వస్తే 48 నెలలకు రూ.2వేలు చొప్పున రూ.96వేలు ఇవ్వాలని గట్టిగా నిలదీసి అడగండి. ప్రత్యేక హోదాపైనా డ్రామాలు ఆడతాడు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల చివరి రోజున రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు దిగారు.

టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి దీక్షకు కూర్చుని ఉంటే దేశం మొత్తం చర్చనీయాంశం అయ్యేది. కేంద్రం దిగి వచ్చేది. అలా చేయలేదు. హోరా హోరీ యుద్ధం జరుగుతోంది. యుద్ధంలో సిపాయి గన్‌ పేల్చాడు. బుల్లెట్‌ బయటకు రాలేదు. ఎందుకంటే అది నకిలీ బుల్లెట్‌. ఆంధ్రరాష్ట్రమనే సిపాయి ప్రత్యేక హోదా అనే తుపాకీ పేల్చితే వెఎస్సార్‌సీపీ ఎంపీల గుళ్లు మాత్రమే బయటకు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి చెందినవి నకిలీ బుల్లెట్లు కాబట్టి బయటకు రాలేదు. మరోవైపు ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాడుతున్నట్టు ఆయనకు సంబంధించిన పేపర్లలో, టీవీల్లో బిల్డప్‌. ఆయన పుట్టింది ఏప్రిల్‌ (4వ నెల) 20వ తేదీ. అంటే 420. చేస్తున్నవి కూడా 420 పనులే. ఒక పూట నిరాహార దీక్షకు రూ.30 కోట్లు ఖర్చు చేశారు. ఆయన దీక్షను ఎల్లో మీడియాలో మీరు చూసే ఉంటారు. చంద్రబాబు బాబా మాదిరిగా కూర్చొని ఉంటాడు. వచ్చిన వాళ్లందరూ ఆయన కాళ్ల వద్ద నమస్కారం పెట్టుకుంటూ పోతారు. అక్కడ ఎన్టీరామారావు పాత్రతో ఒక డూప్‌ను తీసుకొచ్చారు. పదవి కోసం, అధికారం కోసం వెన్నుపోటు పోడిచి ఎన్టీరామారావు చావుకు కారణమైన చంద్రబాబు.. నిస్సిగ్గుగా ఎన్టీఆర్‌ డూప్‌తో ఆశీర్వాదం తీసుకుంటారు. కొంగ జపం, దొంగ జపం.  
 
అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటాను 
నాలుగేళ్ల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం ఏ ఒక్కరిని వదిలి పెట్టకుండా మోసాలు, అబద్దాలతో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించి గొప్పగా చూపించాడు. ఆ తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేశారు. జనం కొడతారని ఇప్పుడు మేనిఫెస్టోను వెబ్‌సైట్‌లో కన్పించకుండా చేశాడు. ఇంతగా మోసం చేసిన చంద్రబాబును పొరపాటున క్షమిస్తే మీ అందరి దగ్గరకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తాడు. అన్నీ చేయాలకున్నా.. కేంద్రం చేయనీయలేదు అంటాడు. ఆ తర్వాత అన్నీ చేసేశాను అంటాడు. ఇవన్నీ మీరు నమ్మరని ప్రతి ఇంటికి కేజీ బంగారం, బోనస్‌గా బెంజ్‌ కారు ఇస్తామనంటారు. ఇదీ నమ్మరని తెలిసి.. ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బులు పెడతాడు. తీసుకోండి. రూ.5 వేలు కావాలని గుంజండి. అదంతా మన దబ్బే. మన జేబుల్లోంచి దోచేసిందే. కానీ మీ మనస్సాక్షి ప్రకారం ఓటేయండి. అబద్ధాలు చెప్పేవారిని, మోసం చేసేవాళ్లను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకురావాలి. ఈ వ్యవస్థలో మార్పు కోసం మీ ముందుకు వచ్చిన మీ బిడ్డను ఆశీర్వదించండి. అండగా నిలవండి. మనందరి ప్రభుత్వ రాగానే ఎన్నికల తేదీ నాటికి డ్వాక్రా అక్కచెల్లెమ్మల (పొదుపు సంఘాల) అప్పు ఎంత ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా వారి చేతికే ఇస్తాం. సున్నా వడ్డీకి రుణాలు ఇప్పిస్తాం. ప్రతి పేద వాడికీ ఇల్లు కట్టిస్తాం. ఆ ఇంటిని మహిళల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇంటిని తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి రూ.30 వేలు, రూ.40 వేలు పావలా వడ్డీకి అప్పు తీసుకునేలా ఏర్పాటు చేస్తాం’’ అని జగన్‌ అన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top