ఎవరి మీద కోర్టుకు పోతావు? | YS Jaganmohan Reddy fires on cm chandrababu | Sakshi
Sakshi News home page

ఎవరి మీద కోర్టుకు పోతావు?

Published Mon, Jan 22 2018 1:00 AM | Last Updated on Fri, Jul 6 2018 2:54 PM

YS Jaganmohan Reddy fires on cm chandrababu - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి విచారణ నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు కోర్టుకు పోతానంటూ కొత్త మోసానికి తెర లేపారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. నాలుగేళ్లు సాగిలపడి ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయనగా ప్రత్యేక హోదా ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని నిలదీశారు. కేంద్రంలో మీ మంత్రులు కొనసాగుతుంటే ఎవరిపై కోర్టుకు పోతావని ప్రశ్నించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 67వ రోజు ఆదివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కృషితో వచ్చిన ప్రతిష్టాత్మక మన్నవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయించడం లేదని చంద్రబాబును నిగ్గదీశారు. తమ ప్రభుత్వం వస్తే భావిభారత పౌరులు ఎందాక చదువుకుంటే అంతవరకు ఉచితంగా చదివిస్తానని భరోసా ఇచ్చారు. పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికీ రూ.15 వేలు ఇస్తామని తెలిపారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

నల్లధనాన్ని దాచుకునేందుకు ఎక్కడికి పోతారో తెలుసా?
చంద్రబాబు నాయుడు తాను సంపాదించిన నల్లధనాన్ని దాచుకునేందుకు ఏటా ఎక్కడికి పోతారో తెలుసా? స్విట్జర్లాండ్‌కు. అంతే కాదు సింగపూర్, చైనా, రష్యా, జపాన్‌కు కూడా పోతా ఉంటాడు. అది కూడా మామూలు విమానాల్లో కాదు.. ప్రైవేటు విమానాల్లో. కానీ మన్నవరం ప్రాజెక్టు మాత్రం పూర్తికాదు. అక్కడెక్కడికో పోవడం ఎందుకు? కేంద్రంలో నీ మంత్రులు ఉన్నారు కదా? వారికి చెప్పి ఈ ప్రాజెక్టుకు నిధులు తీసుకువచ్చి పూర్తి చేయిస్తే 6,100 మందికి ఉద్యోగాలు వస్తాయి కదా? సింగపూర్‌కు పోతాడు.. ఆ దేశం మాదిరి ఆంధ్రప్రదేశ్‌ను చేస్తానంటాడు. చైనా పోతాడు.. అక్కడి మాదిరే ఆంధ్రా అంటాడు. జపాన్‌కు పోతే జపాన్‌లా చేస్తానంటాడు. ఇంకా నయం.. సముద్రాన్నే తీసుకువచ్చి చిత్తూరు జిల్లాలో పెడతాననలేదు ఈ పెద్దమనిషి.

కేసు వేస్తారట.. ఎవరి మీద?
నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన ఈ పెద్దమనిషికి ఇప్పుడు గుర్తుకువచ్చింది ఆ విషయం. తనపై ఉన్న ఓటుకు కోట్లు కేసు విచారణకు రాకుండా తప్పించుకునేందుకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి, కేంద్రం ముందు సాగిలపడిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు కోర్టుకు పోతాడట. ఈ నాలుగేళ్లు ఏమి చేసినట్టు? ఏడాదిలో ఎన్నికలున్నాయనగా మళ్లీ మోసానికి తెర తీశాడు. కేంద్రంలో ఆయన పార్టీ మనుషులు మంత్రులుగా ఉన్నారు.. వాళ్ల మీద వేస్తాడా? అన్యాయంగా, అక్రమంగా సంపాయించిన అవినీతి సొమ్ముతో నల్లధనం సూట్‌ కేసులతో ఎంఎల్‌ఏలను కొనుగోలు చేస్తూ అడ్డంగా ఆడియో, వీడియో టేపులలో దొరికిపోయినా ఈ పెద్దమనిషి రాజీనా మా చేయడు.. దగ్గరుండి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తాడు. ఇంతగా వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్న వ్యక్తి బహుశా ఎక్కడా ఉండడేమో. ఎవర్ని దగా చేస్తున్నారు? ప్రజలను మభ్య పెట్టేందుకే ఈ ఎత్తుగడలు. ఇదే కాదు.. తన ప్రచారం కోసం తాను హీరోగా ఉండాలనుకుని తీసిన పుష్కరాల షూటింగ్‌లో తొక్కిసలాట జరిగి 29 మంది అమాయకులు చనిపోయినా ఎవ్వరిపైనా కేసులుండవు? ఎవ్వరిపైనా చర్యలు ఉండవు. ఇదే మరెక్కడైనా అయితే జైలుకు పంపి ఉండేవారు. ఎర్రచందనం స్మగ్లర్ల పేరిట పొట్టకూటి కోసం వచ్చిన 21 మంది కూలీలను పిట్టల్ని కాల్చినట్టు కాల్చి వేసినా ఎవ్వరిపైనా చర్యలుండవు, కేసులుండవు? ఇంతటి దారుణాలు ఎక్కడా జరిగి ఉండవేమో’’ అని జగన్‌ అన్నారు. 

900 కిలోమీటర్లు దాటిన పాదయాత్ర 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాళహస్తి మండలం చెర్లోపల్లి హరిజనవాడ సమీపంలో అశేష జన సందోహం నడుమ 900 కిలోమీటర్లు దాటింది. వైఎస్‌ జగన్‌ ప్రజల కోరిక మేరకు రావి మొక్కను నాటారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement