ఉక్కు పరిశ్రమ సాధిస్తా: కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

ఉక్కు పరిశ్రమ సాధిస్తా: కేటీఆర్‌

Published Sun, Mar 31 2019 12:31 PM

TRS Party Working President KTR Election Campaign In Warangal - Sakshi

నర్సంపేట: తెలంగాణలో 16 మంది ఎంపీలను గెలిపించుకొని కేంద్రం మెడలు వంచైనా బయ్యా రం ఉక్కు పరిశ్రమ సాధిస్తామని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాలోతు కవితను గెలిపించాలని కోరుతూ శనివారం వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలో కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా జనం తరలిరావడంతో పట్టణం గులాబీ మయంగా మారింది. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ ఉద్యమ నేత సుదర్శన్‌రెడ్డిని గెలిపించిన ప్రజలు అదే జోష్‌తో కవితను పార్లమెంట్‌కు భారీ మెజార్టీతో పంపించాలని కోరారు.

కాంగ్రెస్‌ ఎంపీలు గెలిíస్తే రాహుల్‌ గాంధీకి, బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి లాభమని, అదే టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు ప్రయోజనం చేకూరుతుందని, కేంద్ర నిధులతో పరిశ్రమలు, ప్రాజెక్టుల ఏర్పాటుకు దోహదపడుతుందని చెప్పారు. అభివృద్ధి కోసం మన ఎంపీలు పేగులు తెగేదాకా కొట్లాడుతారని, ప్రతి కార్యకర్త భారీ మెజార్జీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీకి అవకాశమిస్తే దేశం అధోగతి పాలవుతుందని అన్నారు. ఆంధ్రాలో ప్రజలను మోసం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు ఆడుతున్న చంద్రబాబు ఓడిపోయి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ  మాలోతు కవితకు లక్ష మెజార్టీతో తిరుగులేని గెలుపును ఇద్దామని అన్నారు.

ప్రజల్లో చైతన్యం వచ్చింది..
సాక్షి, వరంగల్‌ రూరల్‌:  దేశ ప్రజల్లో చైతన్యం వచ్చింది.. మంచి రోజులు రావాలంటే ప్రధాని మోదీని దించాలి.. కాంగ్రెస్‌ మెడలు వంచాలనే ఆలోచనతో దేశం మొత్తం ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు గెలిస్తే రాహుల్‌కు, బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోదీకి లాభం జరుగుతుంది. అదే టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభమని కేటీఆర్‌ అన్నారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్‌.. 16 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం నిధులతోనే బయ్యారం ఉక్కు పరిశ్రమ నిర్మాణం జరగుతుందని చెప్పారు.  పెద్ద నోట్లు రద్దుతో నల్లధనం బయటకు వస్తుంది.. ప్రతి పేదవాడి అకౌంట్లో రూ.15లక్షలు జమ చేస్తానని చెప్పి మాటాతప్పారని ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం, దేవాదుల, పాలమూరు ఎత్తి పోతల పథకం ప్రాజెక్టులకు అరపైసా కూడా కేటాయించలేదని అన్నారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్‌ యాదవ్, మాయావతి, ఒడిషాలో నవీన్‌ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి ఇలా చాలామంది ఉన్నారని, ఈ రకంగా 150 సీట్లు వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎంపీ ప్రొఫెసర్‌ సీతారాంనాయక్, భీరెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ నాగెల్లి వెంకటనారాయణ, రాయిడి రవీందర్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడ్డి,  రాణాప్రతాప్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, రుద్ర ఓంప్రకాశ్, గటిక అజయ్‌కుమార్, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్,  భీరం సంజీవరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

అభివృద్ధికి దోహదం..
కవితను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడుతుందని, ఇంటింటికీ కార్యకర్తలు తిరిగి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఈ గెలుపు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. నర్సంపేట ప్రజల సత్తా చాటి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపును తెచ్చి కేసీఆర్‌ ఆశయ సాధనకు తోడ్పాటునివ్వాలని పిలుపునిచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ అభ్యర్థి కవిత మాట్లాడుతూ భారీ మెజార్టీ వచ్చే విధంగా ఉద్యమ స్ఫూర్తితో 10 రోజులు ప్రతి కార్యకర్త కష్టపడాలని కోరారు.

Advertisement
Advertisement