తొలి పీఠం ఎవరిదో? | Sakshi
Sakshi News home page

తొలి పీఠం ఎవరిదో?

Published Sat, May 4 2019 12:07 PM

Telangana ZPTC And MPTC Elections Campaign Closed - Sakshi

జిల్లాల పునర్విభజన అనంతరం తొలిసారిగా జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. మెతుకుసీమలో జిల్లా పరిషత్‌ పీఠం తొలిసారి ఎవరిని వరిస్తోందోననే అంశం అన్ని రాజకీయపార్టీలతోపాటు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. షెడ్యూల్‌ ప్రకారం మూడు విడతల నామినేషన్ల ఘట్టం ముగియడంతో అందరి కన్ను జెడ్పీ పీఠంపై పడింది. జిల్లాపరిషత్‌ చైర్మన్‌ పదవి బీసీ మహిళకే రిజర్వ్‌ అయినప్పటికీ ఎవరిని వరిస్తుందనే దానిపై ప్రధానంగా పోటీలో ఉన్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. దీనిపై గోప్యత పాటిస్తుండడంతో ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారుగా అంచనాలు వేసుకుంటున్నారు.

సాక్షి, మెదక్‌ : ముగియడంతో జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.  చివరి వరకు గోప్యత టీఆర్‌ఎస్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు భారీగా పోటీ నెలకొనడంతో మెదక్, నర్సాపూర్‌ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి చివరి వరకు బీఫాంల అందజేతలో గోప్యత పాటించారు. మొదటి నుంచి మలి విడత నామినేషన్ల ఘట్టం వరకు బీఫాంల కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు వేచి చూడాల్సి వచ్చింది. కాంగ్రెస్‌లో పోటీ లేకున్నా.. ‘మేము పార్టీ మారమంటూ’ బాండ్‌ రాసిస్తేనే బీ ఫాం ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం పెట్టిన నిబంధన అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జెడ్పీచైర్మన్‌ పీఠంపై ఇరు పార్టీల్లోనూ ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది.

మనోహరాబాద్‌కే.. 
నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో జెడ్పీ చైర్‌పర్సన్‌ రేసులో ఎవరెవరు ఉన్నారనే అంశం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. జిల్లా పరిషత్‌ పీఠం బీసీ మహిళకు రిజర్వ్‌ కాగా.. జిల్లాలో జెడ్పీటీసీ అభ్యర్థులుగా అవకాశం దక్కిన వారిలో ఆ కేటగిరీలో ఎవరెవరు ఉన్నారు.. పీఠం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఎవరిని వరించే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. జిల్లాలోని కొల్చారం, తూప్రాన్‌ జెడ్పీటీసీ స్థానాలు బీసీ మహిళకు రిజర్వ్‌ చేశారు.

మెదక్, హవేళిఘణపూర్, పెద్దశంకరంపేట, చిన్న శంకరంపేట, అల్లాదుర్గం జెడ్పీటీసీ స్థానాలు అన్‌రిజర్వ్‌డ్‌ మహిళకు కేటాయించారు. జనరల్‌ స్థానం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న బీసీ మహిళకు తొలిసారి జెడ్పీచైర్మన్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మనోహరాబాద్‌ జెడ్పీటీసీ స్థానం జనరల్‌కు రిజర్వ్‌ కాగా.. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున బీసీ మహిళ హేమలతా శేఖర్‌గౌడ్‌ బరిలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన ఆమె కావడంతో హేమలతాశేఖర్‌గౌడ్‌కే జెడ్పీ పీఠం దక్కనుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

నేటితో ముగియనున్న తొలి విడత ప్రచారం  
తొలివిడతలో ఆరు మండలాల్లో (హవేళిఘనపూర్, పెద్దశంకరంపేట, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడు) ప్రాదేశిక ఎన్నికలు ఈ నెల 6న జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు పోలింగ్‌ కోసం ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియనుంది. ఈ విడతలో ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 18 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 65 ఎంపీటీసీ స్థానాలకు 190 మంది బరిలో ఉన్నారు. ఇందులో పెద్దశంకరంపేట మండల పరిధిలోని జూపల్లి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైంది.

Advertisement
Advertisement