'ఫ్యాన్‌' సునామీ | Sakshi
Sakshi News home page

'ఫ్యాన్‌' సునామీ

Published Sat, Mar 23 2019 7:23 AM

Praveen Rai Review on Lok Sabha Election - Sakshi

దేశంలో ప్రాంతీయ పార్టీలు కొత్తేమీ కాదు.. స్వాతంత్య్రానికి పూర్వం కూడా ఉన్నాయి. అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఊపందుకున్న ఈ పార్టీలు.. ఓబీసీ కోటా అమలుతో మరింత బలం పుంజుకుని కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలో శాసించే స్థాయికి చేరాయి. గత ఎన్నికల్లో మాదిరిగా ఈసారి కూడా మోదీ హవా నడిచి బీజేపీ మెజార్టీ స్థానాలు సాధిస్తే మాత్రం ప్రాంతీయ పార్టీల ప్రభావం క్షీణించడం మొదలైనట్లే! ఈ సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ పార్టీలు.. ప్రాంతీయ పార్టీల నుంచి సవాలు ఎదుర్కొనే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా ఉన్నాయి.

2014.. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన సంవత్సరం ఇది. విభజన తేదీ దగ్గరపడుతున్న తరుణంలో అటు లోక్‌సభకు, ఇటు అసెంబ్లీకి ఉమ్మడిగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ఒక్కటే ఒకవైపు ఉండగా.. నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, పవన్‌ కల్యాణ్‌ మరోవైపు నిలిచారు. తెలుగుదేశం పార్టీ  మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో 15 గెలుచుకోగలిగింది. ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ ఎనిమిది స్థానాల్లో విజేతగా నిలవగా టీడీపీ భాగస్వామిగా ఉన్న బీజేపీకి రెండు స్థానాలే దక్కాయి. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య ఓట్ల తేడా అత్యల్పం కావడం గమనార్హం. నాలుగు శాతం ఓట్లు దక్కించుకున్నా కాంగ్రెస్‌కు ఒక్క స్థానమూ దక్కలేదు. దశాబ్దాలుగా అండగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం వైఎస్సార్‌సీపీకి మళ్లడం.. కాపుల్లో అధికులు పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా టీడీపీకి ఓటేయడం కాంగ్రెస్‌ దుస్థితికి కారణమైంది.

బాబుకు కష్టకాలమే..
ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి కూడా ముక్కోణపు పోటీ నెలకొనగా.. టీడీపీ, వైఎస్సార్‌సీపీతోపాటు పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ పోటీ నామమాత్రం కానుంది. అయితే నాలుగేళ్ల పాటు బీజేపీతో అంటకాగి.. కేంద్రంలో మంత్రి పదవులు కూడా అనుభవించిన తరువాత ఎన్నికలకు కొన్ని నెలలు సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఎన్డీయే నుంచి బయటకు రావడం తెలుగుదేశానికి రాజకీయంగా ప్రతికూల ఫలితాలిచ్చే అవకాశముంది. ఇంకోవైపు జనసేన విడిగా పోటీ చేస్తుండటంతో పది శాతం వరకూ ఉన్న కాపు ఓట్లు చీలిపోయి తెలుగుదేశానికి మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా విషయంలో పూటకో మాట మాట్లాడిన చంద్రబాబు తీరా ఎన్నికల సమయానికి బీజేపీని తప్పు పట్టినప్పటికీ ప్రజలు ఈ వాదనను అంగీకరించే అవకాశాలు లేవు.

మరోవైపు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా టీడీపీ అధినేత చంద్రబాబు బోలెడంత ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని నిర్మిస్తానన్న బాబు మాటలు నెరవేరకపోవడం, పోలవరం నిర్మాణం, కడపకు ఉక్కు ఫ్యాక్టరీ వంటి అనేక అంశాలు హామీలకే పరిమితమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టుకట్టి భంగపడ్డ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రయోగానికి స్వస్తి చెప్పడమే కాకుండా చివరి క్షణాల్లో ఓటర్లకు బోలెడన్ని తాయిలాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. డ్వాక్రా గ్రూపు మహిళలకు రూ.పదివేలు, ‘పసుపు కుంకుమ’, రైతులకు పెట్టుబడి సాయం కోసమంటూ ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో పథకాలు ప్రవేశపెట్టడం ఇందులో భాగమే. ఎన్నికలకు మూడు నెలలు మాత్రమే ఉన్న తరుణంలో నిరుద్యోగ భృతితోపాటు వివిధ వర్గాలకు ఇచ్చే పింఛన్లను రూ.రెండు వేలకు పెంచడం కూడా రాజకీయంగా ప్రయోజనం చేకూర్చడం కష్టం.

రంగులు మారిన తమిళ రాజకీయం
గత ఐదేళ్లలో తమిళనాడు రాజకీయం ఎన్నో మలుపులు తిరిగింది. ప్రాంతీయ పార్టీలు ఏకంగా మూడుసార్లు భాగస్వాములను మార్చడంతో ఒకింత గందరగోళం నెలకొంది. తమిళ సంస్కృతి, ద్రావిడ ఆత్మగౌరవ నినాదాలపై నిలబడ్డ తమిళనాడు పార్టీలు.. చాలా సులువుగా కూటములను మార్చేస్తున్నాయి. 2014లో ఏఐఏడీఎంకే ఒకవైపు.. ఐయూఎంఎల్‌తో కలిసి డీఎంకే ఇంకోవైపు బరిలోకి దిగాయి. బీజేపీ డీఎండీకే, పీఎంకే, ఐజేకే, పీఎన్‌కే వంటి అనేక పార్టీలతో జట్టుకట్టింది. కాంగ్రెస్‌ లెఫ్ట్‌ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. జయలలిత హవా

ఫలితంగా ఏఐఏడీఎంకే మొత్తం 44 శాతం
ఓట్లతో 37 స్థానాలను కైవసం చేసుకుంది. మిగిలిన రెండు స్థానాలను బీజేపీ, పీఎంకే పంచుకున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందు వేరుపడ్డ డీఎంకే, కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలయ్యాయి. రెండేళ్ల తరువాత అంటే.. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ ఏర్పడింది. డీఎంకే కాంగ్రెస్, ఐయూఎంఎల్‌తో పొత్తు కుదుర్చుకోగా, ఏఐఏడీఎంకే ఐదు చిన్న పార్టీలతో చేతులు కలిపింది. బీజేపీ ఐజేకే కూటమి ఇంకోవైపు.. ఎండీఎంకే, డీఎండీకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, టీఎంసీ మరోవైపు నిలిచాయి. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో 135 స్థానాలను గెలుచుకుని ఏఐఏడీఎంకే విజేతగా నిలిచింది. డీఎంకే కూటమి 97 స్థానాలకు పరిమితం కాగా.. డీఎంకే ఓట్లశాతం కొంత మెరుగైంది. మిగిలిన రెండు కూటములు ఒక్క సీటూ గెలవలేదు. డీఎంకే అధినేత కరుణానిధి, ఏఐఏడీఎంకే సుప్రీమో జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయ క్షేత్రంలో శూన్యం ఏర్పడింది. వీరి మరణం రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణకు కారణమైంది కూడా. ఈ నేపథ్యంలో జరుగుతున్న తాజా సార్వత్రిక ఎన్నికలను డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య ప్రత్యక్ష పోరుగానే చూడాల్సి ఉంటుంది. డీఎంకే పక్షాన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే, ఐజేకే, కేఎండీకే, వీసీకే, ఐయూఎంఎల్‌ నిలవగా.. ఏఐఏడీఎంకే బీజేపీతో జట్టు కట్టింది. డీఎండీకే, పీఎంకే, టీఎంసీ, పీటీ, పీఎన్‌కే పార్టీలు బీజేపీ కూటమిలో సభ్యులన్న విషయం తెలిసిందే!

దేశంలో ప్రాంతాలకు, మతాలకు, భావజాలాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకోవడం బ్రిటిష్‌ కాలం నుంచే ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తరువాత ఈ ధోరణి మరింత పెరిగింది. 1950లలో అధికార భాషగా హిందీని ప్రవేశపెట్టాలన్న కాంగ్రెస్‌ నిర్ణయంపై ఎన్నో రాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తం కాగా.. తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఏర్పాటుకు తద్వారా ప్రాంతీయ ఆత్మగౌరవం ప్రాతిపదికన మరిన్ని పార్టీలు పుట్టుకొచ్చేందుకు కారణమైంది. విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పుట్టుక కూడా తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంలోనే ఉందన్న విషయం గమనార్హం. ఈ దశ వరకూ పార్టీల ఏర్పాటు ప్రాంతాల ప్రాతిపదికన జరిగితే.. 1991లో ఓబీసీలకు 27 శాతం కోటా అమల్లోకి రావడంతో ఉత్తరప్రదేశ్, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో కులం ఆధారిత పార్టీల ఆవిర్భావానికి దారితీసింది. జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ తిరోగమనం మొదలై ప్రాంతీయ పార్టీల సాయంతో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటు మొదలైందీ ఇక్కడే.

విజేత జగనే...
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఈసారి వైఎస్సార్‌సీపీ గణనీయమైన సంఖ్యలో లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడమే కాకుండా అసెంబ్లీలోనూ విజయఢంకా మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 2009, 2014లో కాంగ్రెస్‌ నుంచి ఎదురైన సవాళ్లను దీటుగా ఎదుర్కొన్న జగన్‌మోహన్‌రెడ్డి గత ఎన్నికల్లో గెలుపునకు కొద్దిదూరంలోనే నిలవడం ప్రస్తావనార్హం. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ వైఎస్సార్‌ ఆశయసాధన కోసం జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం పోరాడుతున్నారు. కేంద్ర స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ సమదూరంలో ఉండాలన్న వైఎస్సార్‌సీపీ నిర్ణయం తెలివైందే కాదు.. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు సమయంలో కీలకమైందిగానూ మారనుంది. అధికారం చేపట్టేందుకు ఏ జాతీయ పార్టీ/కూటమికి తగినంత సంఖ్యాబలం దక్కని పరిస్థితుల్లో ఈ నిర్ణయం జగన్‌మోహన్‌రెడ్డిని కింగ్‌మేకర్‌గా మార్చనుంది.

‘కారు’ మరోసారి రయ్‌.. రయ్‌...

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ఈసారి ఎన్నికల్లో ఘన విజయం సాధించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో తెరాస 16 స్థానాల్లో పోటీ చేస్తుండగా, మిగిలిన ఒక్క స్థానంలో ఆలిండియా మజ్లిస్‌–ఎ– ఇత్తేహదుల్‌ ముస్లమీన్‌ (ఏఐఎంఐఎం) పోటీ చేస్తోంది. ఇరు పార్టీల మధ్య అధికారికంగా పొత్తు లేకున్నా పరస్పర సహకారానికి ఒక అవగాహన మాత్రం ఉంది. ఈ వ్యూహాత్మక ఏర్పాటు కారణంగా రాష్ట్రంలోని 13 శాతం ముస్లిం ఓటర్లు టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న భారీ సాగునీటి ప్రాజెక్టు ‘కాళేశ్వరం’, రైతులకు పెట్టుబడి సాయం అందించే ‘రైతుబంధు’ కూడా అధికార పార్టీ విజయానికి దోహదపడేవే. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ‘కారు’.. మరోసారి లోక్‌సభ ఎన్నికల రోడ్డుపై దూసుకెళ్లనుంది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో ఏర్పాటైన టీఆర్‌ఎస్‌ 2014లో రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం తెలిసిందే. ఆపై జరిగిన ఎన్నికల్లో రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా 11 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు ఎంపీలు టీఆర్‌ఎస్‌ వైపు మళ్లడంతో తరువాత బలం 14కు పెరిగింది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలు ఉందనగా అసెంబ్లీని రద్దు చేసి మరీ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం కేసీఆర్‌ రాజకీయ చతురతకు అద్దం పట్టగా అందులోనూ 119 స్థానాల్లో 88 గెలుచుకోవడం ఇటీవలి పరిణామమే.

‘ఢిల్లీ’కి ప్రాంతీయ పార్టీల చెక్‌
1991 – 2009 మధ్యకాలంలో కాంగ్రెస్‌ మూడు సార్లు ప్రాంతీయ పార్టీలతో కూటములు ఏర్పాటు చేయగా భారతీయ జనతా పార్టీ 1997–2004 మధ్యలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కొన్ని చిన్న పార్టీల మద్దతు తీసుకుంది. ఈ పరిణామంతో అప్పటివరకూ ఆయా రాష్ట్రాలకు, ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పార్టీలు కాస్తా జాతీయ రాజకీయాల్లోనూ ప్రభావం చూపడం మొదలుపెట్టాయి. ఈ పరిణామంతో దేశానికి కొంత మేలు జరిగినా నష్టమూ లేకపోలేదు. జాతీయ రాజకీయాల్లో మరింత ప్రజాస్వామ్య పోకడలు వ్యక్తంకాగా.. యూపీఏ ప్రభుత్వం చేపట్టిన అనేక ఆర్థిక సంస్కరణల వేగానికి అడ్డుగా నిలిచింది కూడా ఈ ప్రాంతీయ పార్టీలే.

Advertisement
Advertisement