నవరత్నాలతో పేదలకు భరోసా | Sakshi
Sakshi News home page

నవరత్నాలతో పేదలకు భరోసా

Published Thu, Feb 22 2018 1:40 AM

Navaratnalu gives bharosa to poor people says Ys Jagan - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ‘నవరత్నాల గురించి మా అన్న చెప్పాడని అందరికీ చెప్పండి.. ఓ అవ్వా.. నా మనవడు చెప్పాడని అందరికీ చెప్పు... అమ్మా.. నా కొడుకు చెప్పాడని చెప్పండి.. దేవుడి ఆశీస్సులు, మీ అందరి సహకారంతో రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కచ్చితంగా నవరత్నాలను అమలు చేస్తామని చెప్పండి. పేదలందరినీ ఆదుకుంటామని కూడా చెప్పండి’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 94వ రోజు బుధవారం ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలోని చెరువుకొమ్ము పాలెం వద్ద తనను కలిసిన మహిళలతో ఆయన  మాట్లాడారు.

అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనల్నందరినీ మోసం చేశారని, ఇలాంటి నాయకుడిని ఇకపై నమ్మొద్దని చెప్పారు. రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేస్తామో మీరంతా తెలుసుకుని ఇళ్లకు వెళ్లి అందరకూ చెప్పాలని కోరారు. ‘మన చిట్టి పిల్లలను బడులకు పంపిస్తే.. ప్రతి తల్లికీ ఏటా రూ.15 వేలు ఇస్తాం. పెద్ద పెద్ద చదువులకు ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుంది. పైగా వారి హాస్టల్‌ ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు ఇస్తాం. అవ్వాతాతల పింఛన్‌ వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌ ఇచ్చి ఆదుకుంటాం. అర్హత వయసు తగ్గించడం వల్ల ఇంకా ఎక్కువ మందికి మేలు జరుగుతుంది.

పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి.. ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా చంద్రబాబు దారుణంగా మోసం చేశారు కదా.. (అవును.. అవును.. అని మహిళల స్పందన) మనందరి ప్రభుత్వం రాగానే ఎన్నికల నాటికి డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణం ఎంత ఉందో ఆ మొత్తాన్ని నాలుగు విడతలుగా వారి చేతికే నేరుగా అందిస్తాం. మీకు సున్నా వడ్డీకే రుణాలు కావాలా? వద్దా? (కావాలి.. కావాలి అంటూ మహిళల స్పందన) వాస్తవానికి గత ప్రభుత్వాల్లో సున్నా వడ్డీకే మహిళలు, రైతులకు రుణాలు లభించేవి. ఎలా వచ్చేవంటే వారు తీసుకునే రుణాలపై వడ్డీని ఆ ప్రభుత్వాలే బ్యాంకులకు చెల్లించేవి కనుక. కానీ చంద్రబాబు ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ మొత్తాన్ని కట్టడం మానేసింది. అందుకే బ్యాంకులు సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వడం లేదు. మనందరి ప్రభుత్వం రాగానే ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది. అప్పుడు బ్యాంకులు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది’ అని జగన్‌ చెప్పారు. ఈ విషయాలన్నింటినీ అందరికీ వివరించాలని కోరారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement