సీఎం జగన్‌ ప్రజలకిచ్చిన వాగ్దానాలు చట్టబద్దం చేశారు.. | Sakshi
Sakshi News home page

‘బలహీన వర్గాలకు రాజకీయ గుర్తింపు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం’

Published Wed, Jul 31 2019 1:23 PM

Minister Mopidevi venkataramana Comments On Government Schemes - Sakshi

సాక్షి, అమరావతి : చరిత్రలో ఎక్కడా లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజకీయ గుర్తింపు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. అసెంబ్లీ ఆవరణలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. రాష్టంలోని విద్యా సంస్థల్లో జరుగుతున్న ఫీజుల దోపిడిని అరికట్టేలా చట్టాలను రూపొందించామని స్పష్టం చేశారు. ఎన్నడూ లేని విధంగా చట్టసభలో బిల్లులపై చర్చ జరిగిందని, సీఎం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను చట్టబద్దం చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న చట్టాలు అంబేద్కర్‌, పూలే ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయన్నాయన్నారు. సమసమాజ స్థాపనకు సీఎం చేస్తున్న చట్టాలను ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ప్రజలకిచ్చిన ప్రతి మాటను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారన్నారు.

గతంలో పలుకుబడి ఉన్న వాళ్లకే పదవులు వచ్చేవని, ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ఎస్టీలందరికీ పదవులు దక్కుతాయని మంత్రి మోపిదేవి తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం కేటాయించడం, మహిళల​కు 50 శాతం ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయమని ఉద్ఘాటించారు. యువతకు ఉపాధి కల్పించే దిశగా 75 శాతం స్థానికులకు అవకాశం కల్పించడం వల్ల గ్రామ సచివాలయం, వాలంటీర్ల ఉద్యోగాలతో పెద్ద ఎత్తున యువతకు ఉపాధి లభిస్తోందన్నారు. రైతులు నష్టపోకుండా ధరల స్థిరీకరణకు 3 వేల కోట్లు కేటాయించామని, సుబాబు రైతులను సైతం ఆదుకుంటామని స్పష్టం చేశారు. కౌలు రైతులకు అందిస్తున్నప్రభుత్వ రాయితీలు దేశంలో ఎక్కడా లేవని, కౌలు రైతులకు చట్టబద్దత కల్పించిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్సీపీ అని పునరుద్ఘాటించారు. మద్యపాన నిషేధంపై చట్టం తీసుకురావడంపై మహిళల్లో హర్షం వ్యక్తమవుతోందన్నారు.

Advertisement
Advertisement