ఎస్సీ, ఎస్టీల భూములకు చట్ట భద్రత | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీల భూములకు చట్ట భద్రత

Published Tue, Jan 23 2018 1:11 AM

Legal protection for SC / ST farm lands - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్ని ఎవ రూ చౌకగా కాజేయడానికి వీలు లేకుండా సమగ్ర చట్టం తీసుకువస్తానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుత చట్టంలోని అంశాల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్‌తో పాటు ఆ వర్గాలకు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు రద్దు చేస్తామన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 68వ రోజు సోమవారం చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం పల్లమాలలో జరిగిన ఎస్సీల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్‌ జగన్‌ ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్‌ భూముల్ని చంద్రబాబు తన అత్తగారి సొమ్ములాగా లాగేసుకుంటున్నాడని మండిపడ్డారు. మనందరి ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీ కాలనీల నుంచే భూమి పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. ఆ తర్వాత బీసీలు, మైనారిటీలకూ ఇస్తానని భరోసా ఇచ్చారు. ఈ సమ్మేళనంలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

దళితుల బతుకులు మారాయా? 
ఇవాళ దళితులు, పేదల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచించండి. చంద్రబాబు మంత్రివర్గంలో ఓ మంత్రి ఉన్నాడు. ఆయన పేరు ఆదినారాయణ రెడ్డి అంట. ఆ మంత్రి అంటాడు.. దళితులు స్నానం చేయరంట, చదువుకోరంట. ఇంకో మంత్రి అచ్చెన్నాయుడని ఉన్నాడు.. ఆర్‌ అండ్‌ బీలో పని చేసే ఓ ఎస్సీ మహిళా ఉద్యోగినిని అందరూ చూస్తుండగానే కాలుతో తన్నాడు. ఆమె నా దగ్గరకు వచ్చి.. అన్నా, ఒక ఎస్సీ అధికారినైన నన్ను కాలుతో తంతున్నా ఈ ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉందన్నా అంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే.. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని మాట్లాడారు.

ముఖ్యమంత్రే ఇలా మాట్లాడితే.. ఇక ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయన దగ్గర పనిచేస్తున్న అధికారులు ఎలా ఉంటారు?  ఎక్కడైనా అసైన్డ్‌ భూములు కనిపిస్తే ఎవరైనా వాటిని పేదవాడికి ఇవ్వాలనుకుంటారు. ఆ ప్రియతమ నేత రాజశేఖరరెడ్డి పాలనను గుర్తు చేసుకోండి. ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాల 3 నెలల కాలంలో అక్షరాల 32 లక్షల ఎకరాలు పేదలకు పంచారు. 22 లక్షల మందికి పట్టాలు అందజేశారు. ఈవేళ చంద్రబాబు పాలనలో ఏం జరుగుతోంది? ఎక్కడైనా అసైన్డ్‌ భూములు కనిపిస్తే చాలు వాళ్ల అత్తగారి సొత్తన్నట్టు లాక్కుంటున్నారు. చివరకు చంద్రబాబు కార్యకర్తలు మేయడానికి ఉపాధి హామీ నిధులనూ వదల్లేదు. నీరు– చెట్టు కార్యక్రమం అంటాడు. దానికి ఉపాధి హామీ నిధులంటాడు. సిమెంట్‌ రోడ్ల కోసం ఉపాధి హామీ నిధులు తీసుకోవడం ఎంత వరకు ధర్మం?   

మనందరి ప్రభుత్వం వస్తే..  
మనందరి ప్రభుత్వం వస్తే..  ఎస్సీ, ఎస్టీ కాలనీలు కరెంట్‌ బిల్లులు కట్టాల్సిన పనే లేదు. నాలుగు బల్బులు, రెండు ఫ్యాన్లు, ఒక టీవీ, సెల్‌ఫోన్‌ ఛార్జర్లు... ఇంతకన్నా ఎక్కువ ఉండవని నమ్ముతున్నా. ఇవన్నీ లెక్కేసినా నెలకు 150 యూనిట్లు కావు. అందుకే 200 యూనిట్లు కాల్చినా ఏ కరెంటోళ్లు మీ దగ్గరకు రారని చెబుతున్నా.  మన ప్రభుత్వంలో పేదవాడికి భూపంపిణీ కార్యక్రమం ఎస్సీ, ఎస్టీ కాలనీల నుంచే మొదలు పెడతాం. ఆ తర్వాత బీసీలు, మైనార్టీల దాకా తీసుకెళ్తాం. ఐదేళ్ల కాలంలో లక్షల ఎకరాలు ఇచ్చేలా చూస్తాం.  

- అటవీ హక్కుల భూములను తీసేస్తే నాన్నగారి హయాంలో దాదాపుగా 12 లక్షల ఎకరాలు పేదవాడికి భూ పంపిణీ జరిగింది. మన ప్రభుత్వంలో అంత కంటే లక్ష ఎకరాలైనా ఎక్కువ పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తా. ఉచితంగా బోర్లు కూడా వేయిస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

స్థానికులకు 75 శాతం ఉద్యోగాలివ్వాలి: జగన్‌
పరిశ్రమలకు మనం భూములివ్వాలి. కరెంటు తక్కువ రేటుకు ఇవ్వాలి. నీళ్లు ఇవ్వాలి. అన్నీ మనమిచ్చిన తర్వాత.. ఉద్యోగాలివ్వాల్సి వచ్చే సరికి గుజరాతో, పంజాబో, రాజస్థాన్‌ వాళ్ల్లకు ఇస్తామంటే ఎవరు ఒప్పుకుంటారు?  అందుకే మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిస్థితిని మారుస్తాం. ఎవరైనా రాష్ట్రంలో పరిశ్రమ పెట్టేందుకు ముందుకొస్తే వాటికే కాదు, ఇప్పుడున్న పరిశ్రమలకు ఉన్న నిబంధనలు మారుస్తాం. ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం తెస్తాం.

ఈ మేరకు పరిశ్రమలన్నింటికీ నోటీసులు పంపుతాం. శ్రీసిటీలో ఉద్యోగాలు రాకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఉద్యోగాలు వచ్చేట్టు చేస్తానని హామీ ఇస్తున్నా. వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో ఎస్సీ కమిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పర్యటిస్తుంది. వారికి ఇంకా ఏరకంగా ఎక్కువ మేలు చేయగలుగుతామనే కోణంలో అధ్యయనం చేస్తుంది. ఆ కమిటీకి సలహాలు, సూచనలు ఇవ్వండి. పాదయాత్ర తర్వాత ఎస్సీ, ఎస్టీ గర్జన ఏర్పాటు చేసి, వారికి ఏం చేయబోతున్నామనేది గర్వంగా ప్రకటించుకుందాం.

Advertisement
Advertisement