ఆఖరి వరకు అప్రమత్తం  | Sakshi
Sakshi News home page

ఆఖరి వరకు అప్రమత్తం 

Published Sun, Dec 9 2018 3:00 AM

KCR mandate for TRS candidates on votes counting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు అప్రమత్తంగా ఉండాలని టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆ పార్టీ అభ్యర్థులను ఆదేశించారు. ఓటింగ్‌ రూపంలో టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో భారీ స్పందన వ్యక్తమైందని, అయితే, ఫలితాల నిర్వహణ విషయంలో జాగ్రత్తగా ఉండా లని సూచించారు. కేసీఆర్‌ శనివారం పలువురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో ఫోన్‌లో మాట్లాడారు. ఓట్ల లెక్కింపుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

‘ఏజెంట్ల ఎంపిక పక్కాగా ఉండాలి. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అవగాహన ఉన్నవారిని ఏజెంట్లుగా ఎంపిక చేసుకోవాలి. వారందరికీ మరోసారి ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి వివరించాలి. మొదటి ఈవీఎం నుంచి ఆఖరి ఈవీఎం వరకు ప్రతి ఓటు లెక్కింపును జాగ్రత్తగా పరిశీలించాలి. ఓపికతో ఉండేవారిని ఏజెంట్లుగా నియమించుకోవాలి. టీఆర్‌ఎస్‌ భారీ ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఎక్కువ మంది అభ్యర్థులకు భారీ మెజారిటీలు వస్తాయి. అయినా సరే ఎక్కడా అలసత్వం ఉండొద్దు. చివరిఓటు వరకు అక్కడే ఉండి లెక్కింపు పూర్తి ప్రక్రియను పరిశీలించాలి. అధికారిక, సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేసుకున్న తర్వాతే అక్కడి నుంచి రావాలి. వ్యక్తిగతంగా దగ్గరి వారిని ఏజెంట్లుగా పెట్టుకోవాలి. ఏవైనా సందేహాలు ఉంటే టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయంలోని వారిని సంప్రదించాలి’ అని సూచించారు.  

పెరిగిన ఓటింగ్‌ అనుకూలమనే ధీమా 
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదైందని, ఈ పరిణామం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం రికార్డుస్థాయిలో ఉందని... ప్రభుత్వ పాలనకు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఎన్నికల సరళిపై అన్ని జిల్లాల నుంచి వచ్చిన సమాచారాన్ని ఈ సందర్భంగా వివరించారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, గ్రేటర్‌ హైదరాబాద్‌ తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన తీర్పు రానుందని వివరించారు. పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక నిర్వహించిన వివిధ సర్వేల్లోనూ టీఆర్‌ఎస్‌కు భారీగా ఆధిక్యం నమోదైందని చెప్పారు. ఓట్ల లెక్కింపు తర్వాత ప్రత్యర్థి పార్టీల పరిస్థితి దయనీయంగా ఉంటుందని అన్నారు.   

Advertisement
Advertisement