ఎన్నికల ఏర్పాట్లపై ఈసీఐ సంతృప్తి | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 23 2018 9:03 PM

ECI Satisfied Telangana Assembly Election Preparations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (ఈసీఐ) సంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలన జరిపేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ ఓం ప్రకాశ్‌ రావత్‌ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు సునీల్‌ అరోరా, అశోక్‌ లవాస బృందం రెండు రోజుల పర్యటన ముగిసింది. తొలి రోజు గుర్తింపు పొందిన 9 రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమై అభిప్రాయాలు సేకరించిన ఈసీఐ రెండో రోజు  రాష్ట్రంలోని ఎన్నికల అధికారులతో సమావేశమైంది.

రాష్ట్రానికి కావాల్సిన అదనపు కేంద్ర బలగాలను పంపిస్తామని, అందరూ న్యాయంగా, నిజాయితీగా పనిచేయాలని అధికారులకు సూచించింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, వికారాబాద్‌ జిల్లాలకు ఎక్కువ బలగాలు కావాలని ఆయా జిల్లా అధికారులు విజ్ఞప్తి చేశారు. వీవీ ప్యాట్‌ల్లోని లోపాలపై అధికారులు కమిషన్‌ బృందం దృష్టికి తీసుకొచ్చారు. బూత్‌లు, పోలీంగ్‌ కేంద్రాల వారిగా వివరాలను ఈసీఐ బృందం ఆరా తీసింది. ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు రాకుండా పరిష్కారించాలని పేర్కొంది. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాలు పెరగడంపై ఎన్నికల కమిషనర్‌ రావత్‌ అసహనం వ్యక్తం చేశారు. త్వరలో మళ్లీ రాష్ట్రానికి వస్తామని తెలిపారు.

Advertisement
Advertisement