చంద్రబాబుది 420 దీక్ష | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది 420 దీక్ష

Published Fri, Apr 20 2018 7:23 AM

Chandrababu Naidu 420 Is For The Special Status Of The Ap - Sakshi

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబునాయుడు 420 దీక్ష చేస్తున్నారని  వైఎస్సార్‌సీపీ కర్నూలు  పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు జీవితమే 420 వ్యవహారమన్నారు. ఏప్రిల్‌ అంటే 4వ నెల..20వ తేదీ కలిపి రాస్తే 420 గా వస్తుందని, ఐపీసీ సెక్షన్ల ప్రకారం 420 అంటే ఛీటర్‌ అని తెలియజేస్తున్న నేపథ్యంలో ఎన్ని దీక్షలు చేసినా ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబునాయుడుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలిపి టీడీపీ ఎంపీలతోనూ రాజీనామా చేయించాల్సి ఉండేదన్నారు. దానిని మరచి ఇప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు వస్తోందని తెలుసుకొని దీక్షకు దిగుతున్నారన్నారు.   ఒకప్పుడు ప్రత్యేక హోదా వద్దని చెప్పిన చంద్రబాబు మళ్లీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ దీక్షకు దిగడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఇటీవల ఎంపీల దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రిలే దీక్షలు చేపట్టిందని గుర్తు చేశారు.

ఏపీ బంద్‌కు పిలుపునిస్తే దీక్షలు, బంద్‌లతో ఏమి సా«ధిస్తారని, ప్రభుత్వానికి నష్టం వస్తోందని చంద్రబాబు విమర్శించారన్నారు. ఇప్పుడు ఆయన ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీక్షలపై అవహేళనగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. దీక్షలంటే పొట్టి శ్రీరాములు మాదిరిగా చనిపోయే వరకు చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలపై సెటైర్‌ వేసిన  టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి .. ఇప్పుడు అదే సలహాను సీఎంకు ఇవ్వాలని సూచించారు.  గుంటూరులో  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షను భగ్నం చేసిన సీఎం.. ఈ రోజు ఏ ముఖంపెట్టుకొని దీక్ష చేస్తారని ఘాటుగా విమర్శించారు.   సీఎం  ఒక్కరోజు దీక్షకు రూ.20 కోట్ల ప్రభుత్వ ధనాన్ని వృథా చేయడం దారుణమన్నారు.

దీక్షకు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే ముఖం చాటేయంతో అధికారాన్ని వినియోగించుకొని  డ్వాక్రా మహిళలు, స్కూలు పిల్లలను  రప్పించుకుంటున్నారని ఆరోపించారు. త్వరలోనే ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండో విడత పోరాటాలకు శ్రీకారం చుడుతుందని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ మద్దయ్య, సీనియర్‌ మహిళా నాయకురాలు మదారపు రేణుకమ్మ, లీగల్‌ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పర్ల శ్రీధర్‌రెడ్డి, కర్నూలు పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకరరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement