మీ అక్రమాలకు ప్రజలు రక్షణగా ఉండాలా? | Sakshi
Sakshi News home page

మీ అక్రమాలకు ప్రజలు రక్షణగా ఉండాలా?

Published Thu, Apr 26 2018 4:39 AM

Ambati Rambabu comments on CM Chandrababu - Sakshi

వినుకొండ/ఎస్‌వీఎన్‌ కాలనీ (గుంటూరు): తన అవినీతిపై కేంద్రం నిఘా పెట్టిందన్న విషయం తెలుసుకునే, ప్రజలే తనకు రక్షణగా ఉండాలని సీఎం అంటున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. మీ అవినీతి, అక్రమాలకు ప్రజలు రక్షణగా ఉండాలా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. బుధవారం గుంటూరు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై సీఎం పిల్లిమొగ్గలు వేస్తున్నారని, ఇంకా ఎన్నిసార్లు యూటర్న్‌ తీసుకుంటారని ఎద్దేవా చేశారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్రను చూస్తే ప్రజలు ఎవరి పాలన కోరుకుంటున్నారో అర్థమవుతుందన్నారు. టీడీపీ దుష్టపాలనకు అంతం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సంప్రదాయాలకు విరుద్ధంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని స్పీకర్‌ హుందాతనాన్ని పోగొడుతున్న కోడెల శివప్రసాదరావు ఆ పదవికి అనర్హుడన్నారు. సత్తెనపల్లి, నరసరావుపేటల్లో డబ్బులు ముట్టజెప్పినవారికే పనులు చేస్తూ, ప్రశ్నించిన వారిపై పోలీసులను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. 

104 సిబ్బంది డిమాండ్లు పరిష్కరించాలి 
చంద్రన్న సంచార చికిత్స(104) సిబ్బంది న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అంబటి డిమాండ్‌ చేశారు. పని భద్రత తదితర డిమాండ్ల పరిష్కారం కోరుతూ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట 104 సిబ్బంది చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి.ఈ సందర్భంగా బుధవారం దీక్షా శిబిరాన్ని అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సందర్శించి తమ మద్దతు ప్రకటించారు.  

Advertisement
Advertisement