ఒకే అవసరం... రెండు సందర్భాలు | Sakshi
Sakshi News home page

ఒకే అవసరం... రెండు సందర్భాలు

Published Mon, Apr 17 2017 2:27 AM

nagasoori venugopal article on literature

పొలం కబుర్లు అనే మాట కొన్ని దశాబ్దాలుగా ఆకాశవాణిలో వినబడుతూ ఉంది. ‘ఇల్లూ – వాకిలి’ ఇది ఆకాశవాణి హైదరాబాదు సాయంకాలం ఏడుంబావుకు వార్తలు తర్వాత ప్రసారం చేసే కార్యక్రమం పేరు. ‘ఫార్మ్‌ అండ్‌ హోమ్‌’ అనే ఇంగ్లిషు మాట దీనికి ఆధారమై ఉండాలి. గతంలో ఇంటిలో ధాన్యం, కోళ్ళూ, ఇంటి బయట పశువులు, వాటి మేతా, కాస్త ప్రక్కనే వ్యవసాయ సంబంధమైన సామగ్రీ, నీటి వసతి, పంట భూమి. ఇదీ అప్పటి దృశ్యం! బహుశా ఈ కారణంతోనే ఫామ్‌ అండ్‌ హోమ్‌ అనే మాటలకు ‘ఇల్లూ – వాకిలి’ అనే పదబంధాన్ని అనువాదంగా వాడి ఉంటారు. నాలుగున్నర దశాబ్దాల క్రితం నాటి నా జ్ఞాపకం నుంచి చెబుతున్నాను. ఉగాది, యాకాశి పండుగలొస్తే, మా ఊర్లో ఆడవాళ్ళ నోట నానేమాట: ‘ఇల్లూ – వాకిలి కడుక్కుంటివా?’. ఇది అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా సోమందేపల్లి మండలం కొనతట్టుపల్లిలో వినబడిన మాట.

విజయవాడలో ‘పాడి పంటలు’ అనే పేరు వ్యవసాయ సంబంధమైన కార్యక్రమానికి వాడుకలో ఉంది. ఈ మాటలో పశు సంబంధమైన, వ్యవసాయ సంబంధమైన పార్శా్వలుండి, సమగ్రంగా కనబడుతోంది. తర్వాత విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో ‘పసిడి పంటలు’ అనే పేరు ఉంది. కడప ఆకాశవాణి కేంద్రంలో ‘పంటసీమలు’ అనే మాట వాడుతున్నారు. ఇందులో రాయలసీమ ప్రాంతపు ఛాయలుండేట్టు ‘సీమలు’ అనే మాట ఇక్కడ వినియోగించడాన్ని గమనించాలి.

పదిహేనేళ్ళ క్రితం అనంతపురం జిల్లాలో ‘పొలం కబుర్లు’– రెండు మాటలు అక్కడ వాడుకలో లేవని గుర్తించి, ‘సేద్యపు సుద్దులు’ మాటను సృజించుకుని, అనంతపురం ఆకాశవాణిలో ఆ కార్యక్రమానికి పేరు మార్చాం. సుద్దులు అనగానే పల్లె సుద్దులు అనే కళారూపం గుర్తుకు రావడంలో సార్వత్రికత ఉంది. అనంతపురం జిల్లాలో ‘నా సుద్దికి రావద్దు’ (జోలికి, విషయానికి రావద్దు) అనే మాట తరచూ వినబడుతుంది. సరిహద్దు లోపల  కూడా వినిపించే కన్నడ భాషలో సుద్ది అంటే సమాచారం. సేద్యం అనే మాట బయటి ప్రాంతాల్లోనే కాదు, అక్కడ స్థానికంగా కూడా వినబడుతుంది.

పొలం కబుర్లు అనే దానికి చిత్తూరు జిల్లా ప్రాంతానికి అనువైన మాట ఏమిటనే ఆలోచన రెండు నెలలుగా సాగింది. జన జీవితం నుండి పల్లె బతుకుల నుంచి పదాలు ఏరుకోవాలనే ప్రయత్నం కారణంగా మనసూ, మెదడూ మ«థనపడింది. స్థానికంగా ఉండే మిత్రులను ఫోన్‌ ద్వారానూ, ముఖాముఖిగానూ చర్చించాను. పొలం, వ్యవసాయం, రైతు వంటి మాటలకు స్థానికంగా తారసపడే మాటల వైపు దృష్టిపెట్టాను. సేద్యం అనే మాటను చాలా హాయిగా, విరివిగా వాడుతున్నారు. అలాగే చేను అనే మాటనూ అంతే అలవోకగా వినియోగిస్తున్నారు. ఈ మథనం సాగుతుండగా, మాయింటిలోనే ఒక మాట వినబడింది. అది ‘కయ్య – కాలువ’. మాకు కయ్యుందా కాలువుందా(మాకు పొలముందా, నీటి వసతి ఉందా) అని చెంగమ్మ మాటల మధ్యలో  వాడింది. దీన్ని గమనించి చెప్పింది మా ఆవిడ హంస. అయితే ఈ మాటలు కేవలం వరి (మడి) అనే అర్థంలో ఉన్నాయి.

వర్షాధార పంటల గురించి ఇందులో ధ్వనించదు. అందువల్ల ‘కయ్య – కాలువ’ ఇక్కడ పూర్తిగా ఔచిత్యం కాదు. సేద్యం, చేను పదాల నుంచి నామకరణం చేయాలనిపించింది. చేను అనే మాటలో మెట్ల సేద్యం కూడా ధ్వనిస్తుంది. అంతకు మించిన ప్రత్యామ్నాయం కనబడలేదు. కనుక ‘చేనూ – సేద్యం’ అనే పద బంధం సరిౖయెనదని అనిపించింది. ‘పొలం కబుర్లు’కు చిత్తూరు ప్రాంతానికి తిరుపతి ఆకాశవాణి రూపొందించుకున్న శీర్షిక ‘చేనూ – సేద్యం’!

ఠి డా. నాగసూరి వేణుగోపాల్‌
ఆకాశవాణి, తిరుపతి
9440732382

Advertisement
Advertisement