ఇక హైవేల్లో నో రైల్వే క్రాసింగ్స్.. | Sakshi
Sakshi News home page

ఇక హైవేల్లో నో రైల్వే క్రాసింగ్స్..

Published Sat, Mar 5 2016 4:21 AM

ఇక హైవేల్లో నో రైల్వే క్రాసింగ్స్.. - Sakshi

సేతు భారతం’ ప్రారంభోత్సవంలో ప్రధాని
న్యూఢిల్లీ: భారత మౌలిక వసతుల రంగంలో భారీ మార్పులకు రంగం సిద్ధమైందని ప్రధాని మోదీ తెలిపారు. రోడ్డు రవాణా, ఐవేలు (ఇన్ఫర్మేషన్ వేస్), రైల్వేల్లో అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 2019 కల్లా జాతీయ రహదారులకు రైల్వే క్రాసింగ్స్‌లేని విధంగా మార్చేందుకు చేపట్టిన రూ.50,800 కోట్ల ఖర్చుతో కూడిన ‘సేతు భారతం’ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు. ఈ పథకంలో బ్రిటీష్ కాలంనాటి 1500 బ్రిడ్జిలకూ రిపేర్లు చేయనున్నారు. ‘శరీరంలో మంచిరక్తం ప్రసరించేందుకు ధమనులు ఎంత అవసరమో.. దేశాభివృద్ధికి ఇలాంటి మౌలిక వసతులు చాలా అవసరం’ అని మోదీ అన్నారు.

దేశంలో నిర్మించాల్సి ఉన్న 208 ఆర్వోబీల్లో ఏపీలో 33 ఉన్నాయి. ప్రకృతికి పేదరికమే పెద్ద సవాల్
 దేశంలో పర్యావరణ సమస్యను అధిగమించేందుకు పేదరికమే పెద్ద సమస్యగా మారిందన్నారు. భారతదేశంలో స్థిరమైన అభివృద్ధి అంశంపై ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధాని మాట్లాడారు. పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పాల్గొన్నారు.
 
రైతుల నిరసనలతో మారిన ప్రధాని పర్యటన వేదిక
హజీపూర్: మోదీ పర్యటన  సమావేశం ప్రాంగణం కోసం కోతకు ముందే పంటలను తొలగించాలని రైతులపై తెచ్చిన ఒత్తిడిపై ప్రభుత్వం వెనక్కి మళ్లింది. తమ పంటలను  తొలగించబోమని రైతులు చెప్పడంతో.. సుల్తాన్‌పూర్ నుంచి చోకియా గ్రామానికి వేదికను మార్చారు. 12న రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించేందుకు మోదీ బిహార్‌లోని సుల్తాన్‌పూర్‌కి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కార్యక్రమ వేదిక కోసం అక్కడ సుమారు 60 ఎకరాల్లో గోధుమ పంటలను తొలగించాలని రైతులపై అధికారులు ఒత్తిడి తెచ్చారు.

Advertisement
Advertisement