పారిశుద్ద్య కార్మికులకు సలాం..! | Sakshi
Sakshi News home page

పారిశుద్ద్య కార్మికులకు సలాం..!

Published Wed, Apr 8 2020 7:58 AM

People Worshipped to Cleaning Workers in Tamil nadu - Sakshi

సాక్షి, చెన్నై : పారిశుద్ధ్య కార్మికులకు ప్రజలు జే..జేలు పలుకుతున్నారు. రేయింబవళ్లు శ్రమిస్తున్న  కార్మికులకు అండగా నిలబడాలని పిలుపు నిస్తున్నారు. అలాగే, వీరికి తలా రూ. పది లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు అయ్యింది.

రాష్ట్రంలో నగర, పురపాలక, పట్టణ, గ్రామ పంచాయతీల్లో కాంట్రాక్టు, ఒప్పంద, పర్మినెంట్‌ అంటూ పారిశుద్ద్య కార్మికులు లక్షలాది మంది పనిచేస్తున్నారు. వీరికి గౌరవాన్ని కల్పించే విధంగా గత ఏడాది సీఎం పళని స్వామి నిర్ణయం తీసుకున్నారు. వీరి సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి, పిల్లల చదవులు కోసం ప్రత్యేకంగా నిధుల్ని కేటాయించడమే కాదు, ఇక, మీదట పారిశుద్ద్య కార్మికులను క్లీనింగ్‌ వర్కర్స్‌గా పిలవాలని ప్రకటించారు. క్లీనింగ్‌ వర్కర్క్‌గా తమకు నామకర ణం చేయడానికి  సిబ్బంది ఆహ్వానించారు. అభినందనలు తెలియజేశారు. ఇదే, వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపి ఉన్నదని చెప్పవచ్చు. రాష్ట్రంలో కరోనా తాండవం వేళ ఈ సిబ్బంది సేవలు అజరామరం. రేయింబవళ్లు ఈ సిబ్బంది అవి శ్రాంతంగా శ్రమిస్తున్నారు.

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో, కరోనా కేసులు మరీ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అయితే,  ఇళ్లకు సైతం వెళ్లడం మానేసి కార్యాలయాల్లోనే నిద్రిస్తూ, పిలుపు రాగానే పరుగులు తీస్తున్నారు. చెత్తా చెదారా లను తొలగించడమే కాదు, పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు, క్రిమిసంహారక మందుల్ని చల్లడం వంటి పనుల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో  ప్రత్యేకంగా మార్కె ట్లు ఏర్పాటు చేయడం, అక్కడ శుభ్రత పనులు చేపట్టడం వంటి కార్యక్రమాలను అధికారులు విస్తృతం చేస్తున్నారు. దీంతో రేయింబవళ్లు ఆ ప్రాంతాల్లో సిబ్బంది తమ విధుల్ని నిర్వరిస్తున్నారు. చాలీచాలని జీతాలతో బతకు లాగుతున్న ఈ వర్కర్స్‌ అందిస్తున్న సేవలను ఆయా ప్రాంతాల్లోని ప్రజలు సర్వత్రా అభినందిస్తున్నారు. వీరికి జేజేలు సైతం కొడుతున్నారు. అంతే కాదు, కొందరు తమ తమప్రాంతాలకు వచ్చే క్లీనింగ్‌ సిబ్బందికి తమ వంతుగా సాయం, వస్తువుల్ని అందిస్తుండటం విశేషం. మరి కొందరు అయితే, క్లీనింగ్‌ వర్కర్స్‌ను దేవుళ్లతో సమానంగా భావిస్తుండటం విశేషం.

పాదపూజ చేసిన మహిళ..
క్లీనింగ్‌ వర్కర్స్‌కు సాయం అందించడమే కాదు, తమ ప్రాంతాల్లోకి వచ్చే వారిని అభినందిస్తూ కరతాళ ధ్వనుల్ని మర్మోగించే నగర్, కాలనీలు, బహుళ అంతస్తుల్లోని కుటుంబాలు ఎక్కువే. ఆదిశగా తిరుప్పూర్‌ జిల్లా పల్లడం గణపతి నగర్‌ పుష్పా అనే మహిళ ఏకంగా ఓ సిబ్బందికి పాద పూజ చేశారు. తమ ప్రాంతానికి రోజూ వచ్చి వెళ్తున్న క్లీనింగ్‌ వర్కర్‌ వసంత(48)ని సత్కరించుకున్నారు. తన కుమార్తెతో కలిసి వసంతకు పుష్పా పాదపూజ చేశారు. ఆమె పాదాల్ని కడిగి, పసుపు కుంకుమలు ఉంచి ,ఆ నీళ్లను నెత్తిన చల్లుకున్నారు. అలాగే, ఆమెకు పువ్వులు, అక్కడక్కడ నోట్లతో ఉన్న మాల వేశారు. అలాగే, పట్టు చీరను అందజేశారు. ఇక, సేలం శీలనాయకం పట్టిలో కన్నన్‌ అనే సామాజిక కార్యకర్త తన కుమార్తె సీమాంతాన్ని ఘనంగా నిర్వహించేందుకు కొంత మొత్తాన్ని సిద్ధం చేసి ఉంచుకున్నాడు. అయితే, కుమార్తెకు సీమాంతం చేయడం కన్నా, ఈ వర్కర్స్‌కు చేయూత నివ్వాలన్న కాంక్షతో, ఆ నగదును ఖర్చు పెట్టేయడం విశేషం.

ఈ నగదుతో వంద మంది వర్కర్స్‌కు అన్ని రకాల వస్తువులు కోనుగోలు చేసి ఇచ్చాడు. ఇదే తరహాలో అందరూ ముందుకు రావాలని, రేయింబవళ్లు శ్రమిస్తున్న ఈ వర్కర్స్‌కు చేయూత నివ్వాలని కన్నన్‌ పిలుపు నిచ్చాడు. కాగా, ఈ సిబ్బందికి సరైన రక్షణ లేని దృష్ట్యా, వీరి భద్రతకు భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు అయింది. సూర్యప్రకాశం అనే న్యాయవాది ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. నర్సులు, వైద్యులతో సామానంగా క్లీనింగ్‌ వర్కర్స్‌ అన్ని చోట్ల తమ సేవల్ని అందిస్తున్నారని వివరించారు. నర్సులు, వైద్యులకు భద్రత కల్పించినట్టుగా, క్లీనింగ్‌ వర్కర్స్‌ జీవితాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని, వీరికి తలా రూ. పది లక్షలు చొప్పున జీవిత బీమా వర్తింప చేయడానికి తగ్గట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు.

Advertisement
Advertisement