అప్పుడేనా.. ఇంకొంతకాలం కానీ..! | Sakshi
Sakshi News home page

అప్పుడేనా.. ఇంకొంతకాలం కానీ..!

Published Thu, Oct 26 2017 12:39 PM

 Congress to delay Rahul Gandhi's elevation as president - Sakshi

యువరాజు.. రారాజు అయ్యేందుకు ఇంకా సిద్ధం‍గా లేరా? రారాజు అయ్యేందుకు మరి కొంత సమయం కావాలని రాహుల్‌ కోరుకుంటున్నారా? దీపవళి తరువాత పట్టాభిషేకం అన్న మాట మళ్లీ వాయిదానేనా? అంటే అవుననే చెబుతున్నాయి టెన్‌ జన్‌పథ్‌ వర్గాలు.

దశాబ్ద కాలంగా రాహుల్‌ గాంధీ.. కాంగ్రెస్‌ పార్టీ యువరాజుగా గుర్తింపు తెచ్చుకున్నారు. యువరాజు.. రారాజు ఎప్పుడవుతారా? అని పార్టీ శ్రేణులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీపావళి తరువాత రాహుల్‌కు పట్టాభిషేకం అనే ప్రకటన వెలువడింది.. యువరాజు.. రారాజు అవుతున్నారని కాం‍గ్రెస్‌ శ్రేణులు ఒక్కసారిగా ఆనందంతో పులకించాయి. అయితు రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు మరికొంత వ్యవధి కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల ఎన్నికల సర్వేలే వల్లే ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కించేలా చేశాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

పోల్‌ సర్వేల్లో కాంగ్రెస్‌ తడబాటు
ఇప్పటి వరకూ వచ్చిన అన్ని సర్వేల్లోనూ గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ ఘనవిజయం సాధిస్తాయని స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా ఆరోదఫా బీజేపీ గుజరాత్‌లో మళ్లీ అధికారంలోకి వస్తుందన్న సంకేతాలతో రాహుల్‌ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోం‍ది. ప్రస్తుతం రాహుల్‌ గాంధీ గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకువచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డి పోరాటం చేస్తున్నారు.

ఇండియా టుడే- యాక్సిస్‌ మై ఇండియా, టైమ్స్‌ నౌ - వీఎంఆర్‌ సర్వేలు రెండూ బీజేపీకి అనుకూలంగా ఫలితాలు ప్రకటించాయి. రెండు సర్వేల్లోనూ బీజేపీ గుజరాత్‌లో 115 నుంచి 120 సీట్లు సాధిస్తాయని స్పష్టం చేశాయి. ఇక కాంగ్రెస్‌ పార్టీ రమారమి 60 సీట్లు సాధిస్తుందని రెండు సర్వేలు తెలిపాయి.

అం‍దుకే ఇలా..!
రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందికర ఫలితాలు వస్తాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇటువంటి ఇబ్బందికర వాతావరణంలో రాహుల్‌ గాంధీని అధ్యక్షుడిగా ప్రమోట్‌ చేయడం మంచిది కాదన్న ఆలోచనలో కాంగ్రెస్‌ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్‌ గాంధీ తన భుజస్కంధాలపై మోస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటమి ఎదురైతే.. అది పూర్తిగా రాహుల్‌ ఖాతాలోకే వెళుతుంది. ఇది రాహుల్‌ గాంధీ రాజకీయ భవిష్యత్‌కు మంచిది కాదు అని కాంగ్రెస్‌ పెద్దలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
 

Advertisement
Advertisement