'ఎస్సీలను నేను ఏమీ అనలేదు' | Sakshi
Sakshi News home page

'ఎస్సీలను నేను ఏమీ అనలేదు'

Published Tue, Feb 9 2016 7:37 PM

'ఎస్సీలను నేను ఏమీ అనలేదు' - Sakshi

న్యూఢిల్లీ: ఎస్సీల గురించి తాను అన్న మాటలను వక్రీకరించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థించుకున్నారు. ఆయన మంగళవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్సీలు బాగా వెనుకబడి ఉన్నారని మాత్రమే చెప్పానని, ఎవ్వరూ పేదవాళ్లుగా ఉండాలనుకోరని, పేద కుటుంబంలో పుట్టాలనుకోరని మాత్రమే చెప్పానన్నారు.

అనంతరం ఢిల్లీ పర్యటన వివరాలను వివరించారు. ఏపీ రాజధాని అమరావతికి ఈ ఏడాది రూ.4వేల కోట్లు ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. అలాగే అమరావతి నిర్మాణంలో పూర్తిస్థాయి పన్ను రాయితీలు, పదేళ్లపాటు ఎక్సైజ్ డ్యూటీ, 100శాతం ఆదాయ పన్నురాయితీ ఐదేళ్లపాటు ఇవ్వాలని కోరామన్నారు. దీంతోపాటు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రాయితీ 15శాతం, పారిశ్రామిక ప్రగతికి ఇన్సెంటివ్లు కోరినట్లు చెప్పారు. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్కు ఇప్పటికి రూ.2,480కోట్లు ఖర్చు చేశామని వాటిని రీయింబర్స్ చేయాలని కోరినట్లు తెలిపారు.

రాబోయే బడ్జెట్లో పోలవరానికి రూ.4 వేల కోట్లు ఇవ్వాలని చెప్పామన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఉందని, దీనికి ప్రధాని హామీ ఇచ్చారని, నీతి ఆయోగ్ తో మాట్లాడుతానని చెప్పారన్నారు. 'రాయ్ చూర్ నుంచి విజయనగరం వరకు ఒక రైల్వే లైన్ కోరాం. విశాఖపట్నం రైల్వే జోన్ అంశాన్ని గుర్తు చేశాం. విశాఖపట్నం నుంచి తత వరకు మూడో లైన్ వేయాలని కోరాం. విశాక నుంచి హౌరా వరకు కూడా మరో రైల్వే లైన్ కోరాం. విశాఖ నుంచి చెన్నై వరకు స్పీడ్ ట్రైన్ ఇవ్వాలని కూడా ప్రధానిని కోరాం' అని చంద్రబాబు చెప్పారు. ఇక టీఆర్ఎస్ లో టీడీపీ నేతల చేరికలపై స్పందిస్తూ స్వార్థపరులు ఉంటే పోతారని అని అన్నారు.

Advertisement
Advertisement