ప్రాణాలకు తెగించి రేప్ అడ్డుకున్నాడు | Sakshi
Sakshi News home page

ప్రాణాలకు తెగించి రేప్ అడ్డుకున్నాడు

Published Mon, Jul 25 2016 7:08 PM

ప్రాణాలకు తెగించి రేప్ అడ్డుకున్నాడు - Sakshi

చెన్నై: వసంత్ పౌల్ అనే చెన్నైకి చెందిన ఫొటో గ్రాఫర్, మోడల్కు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోతుంది. అతడు చేసిన పనికి యువతరం జేజేలు పలుకుతోంది. ఇంతకీ అతడు ఏం చేశాడని అనుకుంటున్నారా.. ఓ యువతి నిండు ప్రాణం నిలబెట్టాడు. ఓ యువతిని పాశవిక లైంగిక దాడి నుంచి రక్షించాడు. ఈ క్రమంలో ప్రాణాలకు తెగించాడు. దాడికి పాల్పడినవారు అతడిని పలుచోట్ల గాయపరిచారు కూడా. పూర్తి వివరాల్లోకి వెళితే.. వసంత్ పౌల్ అనే చెన్నై మోడల్.. సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన కబాలీ చిత్రానికి వెళ్లొస్తున్నాడు.

తన స్నేహితులతో తిరిగొస్తూ రోడ్డు బాగా లేదని, తాను వేరే రూట్ ద్వారా వస్తానని చెప్పి షార్ట్ కర్ట్ ద్వారా వస్తున్నాడు. అదే సమయంలో అతడికి కొన్ని చెట్ల పొదల నుంచి అరుపులు వినిపించాయి. అయితే, తొలుత అతడు జంతువులేమో అనుకున్నాడు. మరో రెండు అడుగులు వేశాక అలాంటి కేకలే వినిపించాయి. దీంతో సిగరెట్ ముట్టించుకునేందుకని ఆగి ఒక్కసారిగా ఆ పొదవైపు పరుగెత్తాడు. ముగ్గురు డ్రగ్స్ మత్తులో ఉన్న యువకులు ఓ యువతిపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమెను వివస్త్రను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో అతడు ఏ మాత్రం ఆలోచించకుండా వెళ్లి వారితో తలపడ్డాడు.

ఆ యువతి కూడా డ్రగ్స్ మత్తులో పడి ఉన్నట్లు గుర్తించాడు. ముగ్గురు వ్యక్తులు కావడంతో వసంత్ పై కూడా వారు పిడిగుద్దులు కురిపించారు. మెడకు ఓ తాడును బిగించారు. అయితే, ఏదో ఒకలా ఆ తాడును తెంపుకున్న వసంత్ ఆ వెంటనే అటునుంచి వెళుతున్న ఆటోవాలా వచ్చేలా సంకేతాలు ఇచ్చాడు. అలా వారంతా రావడంతో ఆ ముగ్గురు పారిపోయారు. వసంత్.. ఆ యువతి సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనను వర్ణిస్తూ మెడపై తనకు అయిన గాయాన్ని చూపిస్తూ అతడు ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా అందరు అతడి సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. ఒక పరిస్థితిని ఎదుర్కొనే క్రమంలో ఏ మాత్రం భయపడొద్దని, కారణం సరైనదే అయితే ప్రపంచం మన తోడవుతుందని అతడు పేర్కొన్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement