సీఆర్పీఎఫ్‌ బైక్‌ అంబులెన్స్‌ | Sakshi
Sakshi News home page

మావో ప్రభావిత ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్‌ బైక్‌ అంబులెన్స్‌

Published Mon, Feb 26 2018 2:48 AM

Bike Ambulance Service By CRPF - Sakshi

రాయిపూర్‌(ఛత్తీస్‌గఢ్‌): ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సౌకర్యం కల్పించేందుకుగాను సీఆర్పీఎఫ్‌ బైక్‌ అంబులెన్స్‌ను ప్రారంభించింది. బస్తర్‌ ఏరియా మారుమూల అటవీ ప్రాంతంలో ఈ సేవలను అందిస్తుంది. మోటారు సైకిళ్లపై సాయుధ భద్రతా సిబ్బంది రక్షణ మధ్య వైద్య బృందాలు అవసరమైన చోటుకు చేరుకుని అనారోగ్యం బారిన పడిన లేదా గాయపడిన వారికి వైద్యం అందించనున్నాయి.

మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న బిజాపూర్‌–దంతేవాడ జిల్లాలకు చెందిన దాదాపు 70 గ్రామాల ప్రజలకు ఈ సేవలు ఉపయోగపడుతాయని 85వ సీఆర్పీఎఫ్‌ బెటాలియన్‌ కమాండర్‌ సుధీర్‌ కుమార్‌ తెలిపారు. ‘జీపులు, ట్రక్కులు మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లలేవు, దీంతోపాటు అవి మావోయిస్టుల దాడికి గురయ్యే ప్రమాదాలు ఎక్కువ. అందుకే ద్విచక్రవాహనాలను ఎంచుకున్నాం’అని ఆయన అన్నారు.

ఒక్కో వైద్య బృందం సేవల పరిధి 32 కిలోమీటర్ల మేర ఉంటుందన్నారు. వైద్య బృందాల సంచారంతో గ్రామీణ ప్రాంత ప్రజలతో సంబంధాలు మెరుగుపడతాయనీ, కూంబింగ్‌ వంటి సందర్భాల్లో ఇది ఎంతో సహాయకారిగా ఉంటుందనీ ఆయన వివరించారు. మావోయిస్టు ప్రభావిత ఇతర ప్రాంతా ల్లో ఈ సేవలను ప్రారంభించటంతోపాటు గ్రామీణ ప్రజల్లో అక్షరాస్యతకు, ప్రభుత్వ పధకాలను వివరించేందుకు కూడా ఈ సేవలను విస్తరించాలని యోచిస్తున్నామన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement