రిటైర్ కావాలనుకున్నా! | Sakshi
Sakshi News home page

రిటైర్ కావాలనుకున్నా!

Published Tue, Aug 25 2015 12:38 AM

రిటైర్ కావాలనుకున్నా!

అభిమాన తారల నోట ‘రిటైర్‌మెంట్’ అనే పదాన్ని వినడానికి అభిమానులు అస్సలు ఇష్టపడరు. పైగా, సమంత లాంటి అందాల తారలు ఆ మాట అంటే గుండెపోటు వచ్చినంతగా ఫీలవుతారు కానీ, వరుసగా రొటీన్ సినిమాలు చేస్తూ పోతే విరక్తి పుట్టడం ఖాయమని సమంత అనుకుంటున్నారు. అందుకే ఇక రిటైర్ అయిపోవాలని నిర్ణయించుకున్నారు. ఏంటీ షాకింగ్‌గా ఉందా? అయితే ఈ నిర్ణయం సమంత ఇప్పుడు తీసుకున్నది కాదు. గత ఏడాది చివర్లో తీసుకున్నారు. ఒకవేళ వచ్చే ఏడాది కూడా రొటీన్ క్యారెక్టర్స్‌కే అవకాశం వస్తే, ఇక సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేయాలనుకున్నారు. మరి.. ఆమె అభిమానుల అదృష్టమో ఏమో కానీ, ఆ ప్రమాదం జరగలేదు.

ఎందుకంటే, ఆ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజులకు సమంతకు వచ్చిన అవకాశాలన్నీ వినూత్నంగా ఉన్నవేనట. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కలిసి ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. వాటిలో ఒకే ఒక్కటి తెలుగు సినిమా కాగా, మిగతావి తమిళ చిత్రాలే. ‘10 ఎణ్రదకుళ్ల’, ‘24’, ధనుష్ సరసన ఇంకా పేరు ఖరారు కాని చిత్రం ఉన్నాయి. నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే పాత్రలను ఈ చిత్రాల్లో చేస్తున్నాననీ, 2015 తన కెరీర్‌లో బెస్ట్ ఇయర్ అనీ సమంత పేర్కొన్నారు.
 
 

Advertisement
Advertisement