Sakshi News home page

సినిమాకు టచ్‌లోనే ఉన్నా

Published Thu, Jul 28 2016 1:51 AM

సినిమాకు టచ్‌లోనే ఉన్నా - Sakshi

మధ్యలో ముఖానికి మేకప్ వేసుకుని ఉండకపోవచ్చుగానీ సినిమాకు తానుప్పుడూ దూరం కాలేదన్నారు నటి గౌతమి. ఈ సీనియర్ నటీమణి గురించి ఇప్పుడు ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు. మాతృభాష తెలుగు అయినా ఏ భాషలో నటిస్తే ఆ భాష నటిగా మారిపోయిన బహు భాషానటి గౌతమి.తమిళంలో విశ్వనటుడు కమలహాసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ తెలుగులో విక్టరీ వెంకటేశ్, మలయాళంలో మోహన్‌లాల్ ఇలా పలు భాషల్లో ప్రముఖ హీరోలతో హీరోయిన్‌గా కలిసి నటించిన నటి గౌతమి. మధ్యలో నటనకు కొంత గ్యాప్ ఇచ్చిన ఈమె ఇటీవల కమలహాసన్‌కు జంటగా పాపనాశం చిత్రంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు.
 
 రీ ఎంట్రీలో తొలి చిత్రంతోనే విజయాన్ని సొంతం చేసుకోవడ మే కాకుండా నటనాపరంగా విమర్శకుల ప్రశంసలను అం దుకున్నారు. దీంతో పలు అవకాశాలు గౌతమి తలుపుతడుతున్నాయి. అయితే చిత్రాల ఎంపికలో ఆచీతూచీ అడుగేస్తు న్న  గౌతమి తాజాగా ఒక చిత్రం చేశారు. విశేషం ఏమిటంటే ఈ ఒక్క చిత్రంతో ఒకే సారి తమిళం, తెలుగు, మలయాళ భాషా ప్రేక్షకులు అలరించడానికి సిద్ధమయ్యారు.
 
  ఆ చిత్రం పేరు తమిళంలో నమదు. మోహన్‌లాల్ కథానాయకుడు. ఏలేటి చంద్రశేఖర్ దర్శకుడు. నాన్‌ఈ చిత్రం ఫేమ్ సాయి కొర్రపాటి నిర్మించిన ఈ త్రిభాషా చిత్రం ఆగస్ట్ ఐదో తేదీన తెరపైకి రానంది. ఈ సందర్భంగా నమదు చిత్రంలో నాయకిగా నటించిన నటి గౌతమి బు దవారం ప త్రికల వారి తో ముచ్చటించారు. ఈ సందర్బంగా ఈ సీనియర్ నటీమణితో చిన్న భేటీ..

 
 ప: నమదు చిత్రంలో నటించడానికి ప్రధాన కారణం?         
 జ: ఒక రోజు టాలీవుడ్ దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్ వద్ద నుంచి ఫోన్ వచ్చింది. ఐతే అనే చిత్రంతో జాతీయ అవార్డును అందుకున్న దర్శకుడు.ఆయనంటే నాకు మంచి గౌరవం ఉంది.దర్శకుడు చెప్పిన కథ విన్న వెంటనే మరో మాట లేకుండా ఈ చిత్రంలో నేను నటిస్తున్నాను అని చెప్పాను.అంతగా ఆ కథ నన్ను ఆకట్టుకుంది.నేనే కాదు నటుడు మోహన్‌లాల్ ఇదే మాట అన్నారు.
 
 ప్ర: చిత్రంలో నటించిన అనుభవం గురించి?
 జ: దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్ వర్కింగ్ స్టైల్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది.అందరికి సమాన గౌరవం ఇస్తారాయన. దీంతో చిత్రం బాగా వస్తుందనే నమ్మకం కలిగింది. ఇందులో పాత్రకు నన్నే ఎందుకు ఎంచుకున్నారు. పాపనాశం చిత్రంలో నటించాననా? అని దర్శకుడిని అడిగితే నిజం చెప్పాలంటే నేనిప్పటి వరకూ పాపనాశం చిత్రం చూడలేదని, రెండేళ్లుగా తయారు చేసుకుంటున్న ఈ చిత్రంలో గాయత్రి పాత్రకు మీరే కరెక్ట్‌గా ఉంటారని భావించానని బదులిచ్చారాయనఇది యూనివర్సల్ కథా చిత్రం. ప్రతి వ్యక్తి ఈ చిత్రంలో తనను చూసుకుంటాడు. కుటుంబంలో నాలుగు తరాల వారు కలిసి చూడదగ్గ చిత్రం.
 
 ప్ర: మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో మూడోసారి నటించడం గురించి?
 జ: మోహన్‌లాల్‌తో కలిసి నటించడం మంచి అనుభవం. ఇంతకు ముందు హిజ్ హైనస్ అబ్దుల్లా అనే మలయాళ చిత్రంలోనూ తమిళ చిత్రం ఇరువర్‌లోనూ నటించాను. విశేషం ఏమిటంటే మేమిద్దరం పలు చిత్రాల్లో నటించినట్లు మాట్లాడుకుంటారు.ఇంతగా ఇంపాక్ట్ పడింది మా జంటపై. ఇక ఊర్వశీ హాస్యంతో ఆడుకున్నారీ చిత్రంలో. ముఖ్యంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి గురించి చెప్పాలి. ఒక ఈగ ప్రధాన పాత్రగా చిత్రాన్ని నిర్మించి సంచలన విజయం  సాధించిన నిర్మాత ఆయన. ఈ చిత్రాన్ని ఏకకాలంలో మూడు భాషల్లో నిర్మించడానికి చాలా గట్స్ అవసరం. అలాంటిది సాయి ఉత్తమ విలువలతో నమదు చిత్రాన్ని నిర్మించారు. తమిళం,తెలుగు భాషలలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. త్వరలో మలయాళంలోనూ చెప్పాలని ఆశిస్తున్నారు.
 
 ప్ర: ఇకపై వరుసగా నటిస్తారా?
 జ: తప్పకుండా. కొన్ని రోజులు ముఖానికి రంగేసుకోలేదు గానీ నేనెప్పుడూ సినిమాకు దూరం కాలేదు. నాకు తగ్గ పాత్రలు లభిస్తే నటిస్తాను.
 
 ప్ర: మీ అమ్మాయి సుబ్బులక్ష్మి సినిమా రంగానికి పరిచయం చేస్తారా?
 జ: పరిచయం చేస్తాను. అయితే ఏ శాఖలో అన్న నిర్ణయం తనకే వదిలేస్తాను. నేనిప్పటికి 120 చిత్రాలకు పైగా చేశాను. తొలి నుంచి నా నిర్ణయాలను నేనే తీసుకుంటాను. నా కూతురి విషయంలోనూ అంతే.
 
 ప్ర: కమలహాసన్ ఎలా ఉన్నారు?
 జ: వైద్యసేవలు అందుకుంటున్నారు.త్వరలోనే కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తారు.

 ప్ర: చివరి ప్రశ్న కమలహాసన్ కబాలి చిత్రం చూసినట్లు ప్రచారం జరుగుతోంది. నిజమేనా?
 జ: కమలహసన్ కాలు విరిగి ఆస్పత్రిలో ఉంటే కబాలి చిత్రం ఎలా చూస్తారు? అదంతా అసత్య ప్రచారమే.

Advertisement

తప్పక చదవండి

Advertisement