రహదారులు గోదారులు ఎన్నాళ్లీ అవస్థలు...? | Sakshi
Sakshi News home page

రహదారులు గోదారులు ఎన్నాళ్లీ అవస్థలు...?

Published Thu, Oct 24 2013 3:52 AM

Storage ennalli stranding roads ...?

సాక్షి,సిటీబ్యూరో: ప్రపంచ  చిత్రపటంలో మంచి గుర్తింపు..దేశంలోని పెద్ద నగరాల్లో 5వ స్థానం..ఏటా కోట్లాదిరూపాయల బడ్జెట్.. ఐటీ రాజధాని..ఇలా నగరం గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఇక్కడ వాస్తవ పరిస్థితి విరుద్ధం. నాలుగు చినుకులు పడితే చాలు నగరవాసికి మహానరకం. రోడ్డెక్కాలంటే భయం. ఇంటి నుంచి బయల్దేరిన వ్యక్తి తిరిగి ఇంటికొచ్చే వరకు అనుమానమే. ఇంత దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటూ చేతులు దులిపేసుకుంటున్నారు. నగరంలో మూడురోజులుగా కురుస్తున్న వర్షానికి జనం అతలాకుతలమవుతున్నారు. రోడ్లన్నీ చెరువులయ్యాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై జనానికి నిద్ర కూడా కరువైంది.
 
 ఆగని వాన.. : అల్పపీడన ప్రభావంతో బుధవారం నగరంలో మళ్లీ కుండపోత కురిసింది. వరుసగా మూడోరోజు కురిసిన భారీవర్షం నగరజీవనాన్ని స్తంభింపజేసింది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు స్వల్పవిరామంతో వర్షం కురవడంతో విద్యార్థులు,ఉద్యోగులు,మహిళలు,వృద్ధులు,చిన్నారులు, వాహనచోదకులు నానా ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం 6 గంటల వరకు జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం వద్ద 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రాజేంద్రనగర్‌లో 4 సెం.మీ వర్షం కురిసింది. రాగల 24 గంటల్లో గ్రేటర్ పరిధిలో మోస్తరు నుంచి భారీవర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.  
 
 వర్ష విలయం ఇదీ..
 ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణమంతా వర్షంనీటితో నిండిపోయి రోగుల సహాయకులు,రాకపోకలు సాగించే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
     
 శివరాంపల్లి డివిజన్ హసన్‌నగర్, మహమూద్‌నగర్, రషీద్‌కాలనీ, షోహెద్‌కాలనీ, అత్తాపూర్ డివిజన్  పాండురంగానగర్‌లోని ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించడంతో స్థానికులు ఇబ్బందిపడ్డారు.
     
 నదీంకాలనీ లోతట్టు ప్రాంతంలో నీరు చేరడంతో ఇళ్లల్లోని విలువైన గృహోపకరణాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
     
 టోలీచౌకీ- షేక్‌పేట నాలారోడ్డుపై భారీగా వరదనీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది.
     
 బర్కత్‌పుర డివిజన్ రత్నానగర్ బస్తీ,సత్యానగర్ బస్తీలకు ఆనుకొని హుస్సేన్‌సాగర్ నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో బస్తీవాసులు కంటిమీద కునుకు లేకుండా గడిపారు.
     
 ఛత్రినాక విద్యుత్ ఫీడర్ పరిధిలో భారీ వర్షానికి విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది.
     
 బహదూర్‌పురా చౌరస్తాలో ఓపెన్‌నాలా పొంగి ప్రవహించడంతో వాహనదారుల అవస్థలు అన్నీఇన్నీ కావు.
     
 చిక్కడపల్లి,గాంధీనగర్, అశోక్‌నగర్, బాగ్‌లింగంపల్లి, ముషీరాబాద్, దోమలగూడ, భోలక్‌పూర్, అడిక్‌మెట్, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్, మూసారంబాగ్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, సైదాబాద్, చంపాపేట, సంతోష్‌నగర్, సరూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు, బస్తీలు జలమయమయ్యాయి.  
     
 మన్సూరాబాద్ డివిజన్ సౌత్‌ఎండ్‌పార్కులో ప్రధానరహదారిపై ఉన్న చెట్టు కూలి ఎదుట ఉన్న ఇంటిపై పడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
 

Advertisement
Advertisement