టూర్‌దర్శన్‌ | Sakshi
Sakshi News home page

టూర్‌దర్శన్‌

Published Sun, Apr 9 2017 12:36 AM

టూర్‌దర్శన్‌

అరుదైన ఆలయం... నెడుంగుణం యోగరామాలయం
అరుదైన, అందమైన ఆలయాలకు ఆలవాలమైన తమిళనాట రాముడు చేతిలో దనుర్బాణాలు లేకుండా యోగభంగిమలో దర్శనమిచ్చే అతిపురాతనమైన, పెద్దదైన ఆలయం నెడుంగుణమ్‌. రాముడిలా యోగభంగిమలో అగుపించే ఆలయాలు ఈ ప్రాంతంలో మూడున్నాయి. వాటిలో నెడుంగుణంలోని రామాలయమే పెద్దది, ప్రఖ్యాతి పొందినదీ.

పల్లవుల కాలంనాటి ఈ ఆలయం గోడలు ఎంతో పెద్దవి, అతి ఎల్తైనవి. ఐదు అంతస్థుల రాజగోపురం రామభక్తులను ఆలయంలోనికి రమ్మని స్వాగతం పలుకుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ రాజగోపురం గోడలపై రామాయణ ఘట్టాలను చిత్రించే శిల్పాలు చూపుతిప్పుకోనివ్వనంత రమణీయంగా ఉంటాయి. ప్రాకారం దాటి లోనికి అడుగుపెట్టగానే కిలిగోపురమనే మరో ప్రాకారం కనిపిస్తుంది.

 ఈ ప్రాకారంలోనికి ప్రవేశించగానే ఎల్తైన, అందమైన ద్వారపాలక విగ్రహాలు కనువిందు చేస్తాయి. జీవకళ ఉట్టిపడుతూ, నల్లటి విగ్రహాలతో, నూత్న వస్త్రాలతో నిజంగానే ఎవరో దివ్యపురుషులు వచ్చి నిలబడి ఉన్నారేమో అనుకునేంత అద్భుతమైన శిల్పసౌందర్యం చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది.

ఎదురుగా గర్భాలయంలో రామచంద్రమూర్తి తన సోదరుడు లక్ష్మణుడు, ధర్మపత్ని సీతా మహాసాధ్వితో యోగభంగిమలో అభయముద్రతో దర్శనమిస్తాడు. ఆయన పాదాల చెంత హనుమంతుడు కూర్చుని ఉంటాడు. లక్ష్మణుడు మామూలుగానే ధనుర్బాణాలతో కనిపిస్తాడు కానీ, ఎల్లప్పుడూ కోదండంతో కనిపించే రాముడు ఈ విధంగా యోగముద్రలో కనిపించడం వెనుక ఒక కథ ఉంది. అదేమిటో చూద్దాం..

స్థలపురాణం: రావణ సంహారానంతరం రాముడు లంకానగరానికి విభీషణుడిని రాజుగా చేసి, సీత, లక్ష్మణుడు, ఇతర పరివారంతో కలసి అయోధ్యకు తిరిగి వెళుతున్నాడు. అప్పుడే ఆయనకు తన కోసం ఎంతోకాలంగా కలియానది నది ఒడ్డున శుకమహర్షి తపస్సు చేస్తున్నట్లు తెలిసింది. నిర్ణీత సమయంలోగా అయోధ్యానగరానికి చేరుకోకపోతే భరతుడు ప్రాయోపవేశం చేసే ప్రమాదం ఉంది. అయినప్పటికీ భక్తసులభుడైన రాముడు, శుకుడికోసం తన ప్రయాణాన్ని ఆపుకుని మరీ శుకాశ్రమానికి వెళ్ళాడు.

తన దర్శన భాగ్యంతో ఆయనను అనుగ్రహించి, ఆతిథ్యం స్వీకరించి, కొద్దిసేపు విశ్రమించి, మునికి ఆనందం చేకూర్చి, ఆయన అనుమతి తీసుకుని ఆనకనే అయోధ్యకు వెళ్లాడు. నేదుం అంటే వినయము లేదా సౌశీల్యం. గుణం అంటే లక్షణం అని అర్థం. అందుకే ఈ ప్రాంతానికి నేదుంగుణం అనీ, ఇక్కడి రాముడికి నేడుంగుణ రాముడనీ పేరు స్థిరపడింది. ధీరకాచలం కొండలలో పుట్టిన కలియా నది అక్కడి నుంచి చెంగల్పట్టులోగల మధురాంతక సరస్సు వరకు ప్రవహించి అంతటితో అంతమవుతుంది.

ఈ ఆలయం చెంత శుకమహర్షి ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో శుకబ్రహ్మ ఆసీనుడై ఉండగా, హనుమంతుడు ధర్మశాస్త్రాలను చదివి, రామలక్ష్మణులకు, శుకునికి వినిపిస్తూ ఉన్నట్లుగా ఉన్న అరుదైన విగ్రహాలను చూడవచ్చు. సాధారణంగా రాముడి పాదాల వద్ద వినయవిధేయతలతో కూర్చుని కనిపించే హనుమంతుని చూస్తాము కానీ, ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా హనుమంతుడు ఏదో చదివి వినిపిస్తుండగా, రాముడు ఎంతో శ్రద్ధగా, సావధానంగా ఆయా శాస్త్రవిషయాలను ఆలకిస్తున్నట్లుగా ఉన్న ఈ అరుదైన దృశ్యం మనస్సును హత్తుకుంటుంది.

ఆలయానికి అనుసంధానంగా శుకతీర్థమనే కోనేరుంది. ఈ కోనేటిలోని నీటినే పూజాకార్యక్రమాలకు ఉపయోగిస్తారు.ఇక్కడ ఎంతోకాలంగా ఉన్న ఉత్సవ మూర్తుల విగ్రహాలు అపహరణకు గురి కావడంతో భక్తులు తామే స్వయంగా విగ్రహాలను ఏర్పాటు చేశాక, తిరిగి వెనకటి ఉత్సవ విగ్రహాలు యథావిధిగా కనిపించడంతో రెండు రకాల ఉత్సవ విగ్రహాలను ఆలయంలో అగుపిస్తాయి.  

ఈ ఆలయంలోనే ఆళ్వార్, శ్రీ కృష్ణుడు, సుదర్శనుడు, యోగనరసింహమూర్తి సన్నిధులు కూడా కనిపిస్తాయి. అంతేకాదు, కలియుగదైవం వేంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. వైఖానస ఆగమానికి రూపకర్త అయిన విఖనస మహర్షి, ఆయన శిష్యగణంతో కూర్చుని కనిపిస్తాడు. ఇక్కడ మరో వింత ఏమిటంటే, ఆలయం కొలువై ఉన్న ధీరకాచలం కొండ అచ్చం శుకబ్రహ్మలా కనిపిస్తుంది. అంటే శుకమహర్షే తన స్వామికి సేవ చేసుకునేందుకు ధీరకాచలం కొండలా మారిపోయాడన్నమాట. మామూలు సమయాలలో ¿¶ క్తుల రద్దీ అంతగా లేకున్నా పునర్వసు నక్షత్రం, శ్రీరామ నవమి నవరాత్రులలో కిక్కిరిసిపోయి కనిపిస్తుంది.

ఎలా వెళ్లాలంటే...
చెన్నైలోని అడయార్‌ నుంచి వండవాసికి దగ్గరలో ఆలయం ఉంది. వండవాసి నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాలు ఉన్నాయి.

– డి.వి.ఆర్‌. భాస్కర్‌
 

Advertisement
Advertisement