పరకాయ ప్రవేశం | Sakshi
Sakshi News home page

పరకాయ ప్రవేశం

Published Sun, Jan 26 2020 3:22 AM

Special Story By Nethi Suryanarayana Sharma On 26/01/2020 In Funday - Sakshi

అతడు మాహిష్మతీ పాలకుడైన అమరుకుడు. ఆవేళ ససైన్యంగానే అడవికి వేటకు వచ్చాడు. అనుకోకుండా సైన్యం నుంచి వేరుపడి, పులిబారిన పడ్డాడు. ఆదమరుపుగా ఉన్నవేళ పొదల చాటునుంచి నక్కివచ్చి అదాటున మీద పడిందా పులి. మొదట దానిని తేలికగానే తీసుకున్నాడు అమరుకుడు. కఱకు రాళ్లను సైతం తుత్తునియలు చేసే తన ఖడ్గాన్ని అలవోకగా ఝళిపించాడు. 
గాలిలో తిప్పిన కత్తికి నెత్తురు బొట్లేమీ అంటుకోవు. అమరుకుని ఖడ్గచాలనమూ అంతే ఫలితాన్నిచ్చింది. తాను జంతువుతో పోరాడుతున్నాడో, లేక దాని నీడతో పోరాడుతున్నాడో తెలియక మొదట తబ్బిబ్బు పడ్డాడతడు. కళ్లముందు కనిపిస్తుంది నిజమో కలో అర్థం కాలేదు. చూస్తుండగానే ఆ పులి అమరుకుణ్ణి తొలిదెబ్బ కొట్టింది. అతడి పొట్ట అడ్డంగా చీరుకు పోయింది. నెత్తురు స్రవిస్తోంది. అది మామూలు పులి కాదు, మాయావి అన్న సంగతి అర్థమైంది. దాంతో అతనిలో నిస్తేజం ఆవరించింది. పోరాడడం మానేశాడు.
వేట చేతికి చిక్కాక దానిని పూర్తిగా చంపకుండా విడిచిపెట్టడమూ, వెనువెంటనే తినేయడమూ రెండూ పులి నైజాలు కావు. అమరుకుడు దెబ్బను ఓర్చుకుంటూ రొప్పు తున్నాడు. పులి అతని చుట్టూ తిరుగుతూ, గుర్రుగా చూస్తూ పంజా మాత్రం విసరకుండా ఎందుకో తాత్సారం చేస్తోంది. అత్యంత సమీపంలో మృత్యువు దర్శనమిస్తే ఎంతటి వీరుడికైనా గుండె నీరైపోతుంది.  అంతలో ఆ పులి మరోసారి పంజా విసిరింది. ఈసారి పెద్ద దెబ్బ తగల్లేదు.   కొద్దిగా బుగ్గS చీరుకు పోయిందంతే. అమరుకునికి మాత్రం ఆ క్షణంలో తన ప్రాణం పోయిందనిపించింది. ‘అమ్మా’ అని చావుకేక పెట్టాడు.
అతడు చేసిన ఆర్తనాదం అక్కడికి కొద్ది దూరంలోనే విడిది చేసివున్న ఆచార్య శంకరుని కర్ణపుటాలకు సోకింది. చప్పున కన్నులు తెరిచి, ‘‘పద్మపాదా! త్వరపడు’’ అన్నాడు. 
ఆచార్యుని ఆదేశం అందుకోగానే పద్మపాదుడు లేచి నిలబడి దండధారి అయ్యాడు. ఆ క్షణంలోనే అక్కడ పులి ఆట కట్టుబడి పోయింది. ఘోరంగా గాండ్రిస్తూ అమరుకుని చుట్టూ పిచ్చెత్తినట్లు తిరుగుతోంది. అమరుకునికి పాపం స్పృహ తప్పుతున్నట్లున్నది. 
పద్మపాదుడు ఆఘమేఘాల మీద వచ్చాడు. వేరే మనిషి అలికిడి కావడంతో పులి తొందర పడ్డది.  అమరుకుణ్ణి వెనువెంటనే అక్కడినుంచి ఈడ్చుకుపోవాలని ప్రయత్నించింది. కానీ దాని మాయా శక్తులన్నీ నశించాయి. ఇందాక అమరుకుని ఖడ్గం గాలిలో తిరిగినట్లు ఇప్పుడు పులిపంజా అమరుకుని ఒంటిమీద గాలిలో లాగా కదులుతోంది. క్రమంగా దానిలో పంజా విసిరే శక్తి కూడా క్షీణించింది. తోకవాల్చి సాధుజీవిలా మారిపోయింది. పద్మపాదుణ్ణి చూడడంతోనే బానిసలా మోకరిల్లింది. యజమాని వెంట నడుస్తున్న పెంపుడు జంతువులా çపద్మపాదుని వెంట అక్కడినుంచి వెళ్లింది. .
ఆ వెనువెంటనే అమరుకుని వద్దకు ఆచార్య శంకరుడు, హస్తామలకుడు, విష్ణుశర్మ, ఇతర శిష్యులు వచ్చారు. అమరుకునికి సంధి ప్రేలాపనలు వస్తున్నాయి. అతడికి తన కుటుంబం గుర్తుకు వస్తోంది. రాజ్యభోగాలు గుర్తుకు వస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా వారసుడికి యౌవరాజ్య పట్టాభిషేకం చేయకుండానే తాను అర్ధంతరంగా కన్నుమూస్తున్నందుకు ఏడుపు ముంచుకొస్తోంది. అంతబాధలోనూ ‘హా పుత్రా!’ అంటూ కలవరిస్తున్నాడు. అతడికి శంకరుడు స్వయంగా ప్రథమ చికిత్స చేశాడు. 
‘‘విష్ణూ! ఇతడు మాహిష్మతీ ప్రభువు. పులిదెబ్బకు భీతిల్లినట్లున్నాడు. రాజధాని వరకూ నువ్వే దగ్గరుండి తీసుకువెళ్లు. వేరెవ్వరికీ కాకుండా అంతఃపురంలోని రాణులకు మాత్రమే ఇతణ్ణి అప్పగించిరా’’ చివరి మాటలను ఒత్తి పలుకుతూ ఆదేశించాడు శంకరుడు.  విష్ణుశర్మకు ఇతర శిష్యులు సహకరించారు. హస్తామలకుడు ఒక్కడే గురువు వద్ద∙నిలిచిపోయాడు. 
అడవి దాటుతుండగానే విష్ణుశర్మకు అమరుకుని సైన్యం ఎదురు పడింది. అంతఃపురం వరకూ తనను రాజుకు తోడువెళ్లమన్న గురువు ఆజ్ఞను వారితో చెప్పాడు విష్ణుశర్మ. తమ ప్రభువును ఎవరో యతిశేఖరుడు కాపాడే ప్రయత్నం చేశాడన్న గౌరవంతో వారూ ఎదురు మాట్లాడలేదు. సైన్యం రాజును హుటాహుటిన రాజధానికి తరలించింది. అంతఃపురంలోని నిజశయ్యపై అమరుకుణ్ణి పడుకోబెట్టారు. 
వైద్యులు సిద్ధంగా ఉన్నారు. అత్యవసర సేవలు అందిస్తున్నారు. ఒకరి తరువాత ఒకరుగా అమరుకుని రాణులు వస్తున్నారు. కొందరు భోరుమంటూ విలపిస్తున్నారు. మరికొందరు వారికి ధైర్యవచనాలు చెబుతున్నారు. చిట్టచివరిగా పట్టపురాణి శతరూపాదేవి వచ్చింది. ఆమె చేతిలో వెన్నగిన్నె కాబోలు ఉంది. ఇతర రాణులందరూ పట్టపురాణికి గౌరవ సూచనగా పక్కకు జరగగా, ఆమె భర్తకు ఉపచారాలు చేస్తోంది. 
అక్కడితో విష్ణుశర్మ బాధ్యత తీరింది. గురువాక్యాన్ని తుచ తప్పకుండా పాటించినట్లయింది. ఇక అక్కడినుంచి వెనుదిరిగే ప్రయత్నంలో తొలి అడుగు వేశాడు. అంతలో ఆ గది గవాక్షానికి చేరువలో వేలాడుతున్న పంజరంలోని చిలుక ఒకటి కమ్మగా పాడడం మొదలుపెట్టింది.
జ్యాకృష్టిబద్ధ ఖటకాముఖ పాణి çపృష్ఠ
ప్రేంఖన్నఖాంశుచయ సంవలితో అంబికాయాః
త్వాం పాతు మంజరిత పల్లవ కర్ణపూర
లోభ భ్రమద్భ్రమర విభ్రమభృత్కటాక్షః
– ఒకకాలు వెనక్కు ఉంచి, చెఱకు వింటిని ఎక్కుపెట్టిన లాస్యాంగ భంగిమలో నిలబడి ఉన్నదామె. వింటిని పట్టుకున్న ఎడమ పిడికిట వెనక్కు తిరిగిన చేతి గోళ్లపై ఆమె చూపులు పడి, ఆ కాంతి కిందికి పరావర్తనం చెంది మట్టపై పడుతోంది. నారిసారించిన వైపు దృష్టి తిప్పినప్పుడు ఆమె కనుకొలకులు కర్ణాలను పూరిస్తున్నాయి. ఆమె నేత్రాల నుంచి వచ్చిపడుతున్న కాంతి వెల్లువ రేఖ... చిగురు చేతులపై మొలిచిన గోరువంటి పువ్వులపై వాలుతున్న తుమ్మెదల పంక్తిలా ఉంది. అది తుమ్మెదనాదమా... ధనుష్ఠంకారమా అన్న భ్రమలో ఉండగానే ఆమె కటాక్షమూ ఉదయించింది... అన్నది చిలుక.  
విష్ణుశర్మను ఆ కవిత్వం ముగ్ధుణ్ణి చేసింది. బయటకు వస్తూ ఎవరినో విచారించాడు. ‘‘మీ రాజుగారు కవిగారు కూడానా?’’
‘‘అలాంటిదేమీ లేదండీ’’ బదులిచ్చారు వారు.
‘‘పోనీ మీ రాజుగారి కొలువులో కవులెవరైనా ఉన్నారా?’’
‘‘అయ్యా! మీకుగానీ మతిపోయిందా? కవులంటే రుషులు కదా! వారు భృత్యుల వలె రాజాశ్రయాల్లో ఉండడం ఇప్పటివరకూ భరతఖండ చరిత్రలో ఎక్కడైనా జరిగిందా?’’
‘‘ఎందుకు లేదు. కాళిదాసు ఉన్నాడు కదా! ప్రత్యక్ష తార్కాణంగా.’’
‘‘ఆయన ఎక్కడివాడో, ఎప్పటివాడో, ఎప్పుడెవరి కొలువులో ఉంటాడో ఎవరూ చెప్పలేరు. మౌర్య చక్రవర్తులు బలహీనులైనప్పుడు, శుంగవంశానికి అధికారం కట్టపెట్టడానికి ఉద్యమించిన పతంజలి మహర్షి ముఖ్యశిష్యులలో ఆయన ఒకడట. ఆ తరువాత శుంగవంశ రెండో చక్రవర్తిపై మాళవికాగ్ని మిత్రం రచించాడు. ఇప్పుడు శుంగవంశమే అధికారంలో లేదు కదా! విక్రమార్కుని పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టింది కాళిదాసేనంటారు. అతగాడే వెయ్యేళ్లకు పైబడి ఉజ్జయినిని పాలిస్తున్నప్పుడు కాళిదాసు ఏనాటివాడని చెప్పగలం? ఎప్పుడైనా ఎవరి కొలువులోనైనా ఏదో ఒక కారణానికి ఆయన ఉంటే ఉన్నాడేమో! ఇతరులతో ఆయనకు పోలికేమిటి?’’ అన్నాడా పౌరుడు. 
‘‘అసలే మతిపోయి ఏడుస్తున్నాను. నువ్వింకా నన్ను గందరగోళం చెయ్యకు’’ అని విసుక్కుంటూ విష్ణుశర్మ అక్కడినుంచి కదిలాడు. ఎక్కడా ఆగకుండా మళ్లీ గురువు సన్నిధిలో వాలిపోవాలని విష్ణుశర్మకు తహతహగా ఉంది. కానీ రాత్రివేళ ప్రయాణం మంచిది కాదని, మిగతావారు అతడిని ఆపివేశారు. మరునాటి అరుణోదయ వేళ దాకా ఎక్కడో తలదాచుకుని, మధ్యాహ్నం లోపుగానే తామున్న తావుకు వచ్చారు వారంతా.
ముందుగా గురుదర్శనం చేయాలని వెతుక్కుంటూ వెళ్లిన విష్ణుశర్మను అక్కడి గుహలో కనిపించిన దృశ్యం నిశ్చేష్టుణ్ణి చేసింది. ఓ మూలగా శంకరుడు వెల్లకిలా పడుకుని ఉన్నాడు. ఆయన మేనువాల్చి నిదురించగా విష్ణుశర్మ చూడడం అదే ప్రథమం. ఇన్నేళ్లుగా ఆయనకు ఎప్పుడూ నిద్ర అవసరమే కలగలేదు. 
‘‘ఇప్పుడెందుకిలా... ఏమైంది?’’ తనలో తానే గొణుక్కుంటున్నట్లుగా అన్నాడు విష్ణుశర్మ.
‘‘తెలియదు. నిన్న అమరుకుని వద్దనుంచి వస్తూనే ఆయనకు కన్నులు మూతపడడం మొదలుపెట్టాయి. నన్ను దగ్గరకు పిలిచి, ‘సుదీర్ఘకాలం తరువాత నిద్రాదేవత నన్ను అనుగ్రహిస్తోంది. ఆమె కటాక్షం ఎంతకాలం ఉంటుందో చెప్పలేను. నా అంతట నేనుగా మేల్కొనే వరకు నన్నెవ్వరూ తాకవద్దు’ అని శాసించారు’’ చెప్పాడు హస్తామలకుడు.
విష్ణుశర్మకు ఏం మాట్లాడడానికీ పాలుపోవడం లేదు. హస్తామలకుని వంక, శంకరుని వంక మార్చిమార్చి చూస్తూ తనలో తానే తర్కించుకుంటున్నాడు. 
నిన్న మధ్యాహ్నం వారికంటే ముందుగా వెళ్లిన పద్మపాదుడు అప్పుడే గుహకు తిరిగి వచ్చాడు. ‘‘పద్మపాదాచార్యా! ఏం జరిగింది? ఆ పులిని ఏం చేశారు?’’ ఆదుర్దాగా అడిగాడు విష్ణుశర్మ.
‘‘కాళిదాసు చెప్పిన మాయావి వాడే. పులిదేహాన్ని ఆశ్రయించి వచ్చి, ఈ రాజు దేహంలోకి మారాలని ప్రయత్నించాడు. వాడి ఎత్తుగడ పారలేదు. ఇప్పుడు నేను చేసిన పనితో వాడు.... ఆ పులిదేహం పురుగులు పడి నశించేవరకూ దానిలో నుంచి కదలలేడు’’ చెప్పాడు పద్మపాదుడు.
అతడు చెప్పిన సంగతి విని ఇద్దరూ సంతోషించారు. కానీ అంతలోనే, ‘‘ఆచార్యా! ఆ కాముకుడు వెళ్లదల్చుకున్న రాజుగారి శరీరాన్ని, మన గురువుగారు కైవసం చేసుకున్నారేమో అని నా అనుమానం’’ అన్నాడు విష్ణుశర్మ.
పద్మపాదుడు ఆ మాటతో వెరగు పడ్డాడు. శయనించి ఉన్న శంకరుని వంక పరీక్షగా చూశాడు. మణిపూర అనాహతాల మధ్య వాయుసంచారం సమానగతిలో సాగుతోంది. గుండె కొట్టుకుంటూనే ఉందని తెలుస్తూనే ఉంది. 
‘‘మధ్యమధ్య కన్నులు విప్పి చూడడం, అటూ ఇటూ కదలడం ఉందా?’’ ప్రశ్నించాడు పద్మపాదుడు. లేదన్నట్లు హస్తామలకుడు తల అడ్డంగా ఊపాడు. ‘‘కలవరింతల్లా కానీ, మరేదైనా గానీ ఏమైనా మాట్లాడారా?’’ అడిగాడు పద్మపాదుడు. 
ఆ ప్రశ్నకు హస్తామలకుడు ఇలా చెప్పాడు. ‘‘నిన్నరాత్రి బాగా పొద్దుపోయిన తరువాత ఆయన కంఠం నుంచి ఒక శ్లోకం వెలువడింది.... 
క్షిప్తో హస్తావలగ్నః ప్రసభమభిహతో అప్యాదదానో అంశుకాంతం
గృహ్ణన్‌ కేశేష్వపాస్త శ్చరణ నిపతితో నేక్షితః సంభ్రమేణ
ఆలింగన్యో అవధూత స్తిప్రుర యువతిభిః సాశ్రునేత్రోత్పలాభిః
కామీవా ఆర్ద్రాపరాధః స దహతు దురితం శాంభవో వః శరాగ్నిః
– దిట్టతనము కలిగిన నాయకుడు ఇష్టం లేకపోయినా చేయి పట్టుకునేసరికి త్రిపుర యువతి వాడికి లాగిపెట్టి ఒక్కటిచ్చిందట. అంతటితో వెనుదిరగకుండా అతడామె కొంగు పట్టిలాగాడట. ఒళ్లుమండి ఆమె జుట్టు పట్టుకుంది. వెంటనే అతగాడు కాళ్లమీద పడ్డాడు. ఏమిటీ పిచ్చిపని అని ఆమె సంభ్రమంతో చూస్తుండగానే చటుక్కున ఆలింగనం చేసుకున్నాడు. అప్పటివరకూ తాను పడ్డ కష్టానికి కాబోలు అతగాడి కళ్లు చెమరుస్తున్నాయి. సరిగ్గా కామి అయిన ఆ పురుషుని కంటిలో సుళ్లు తిరుగుతున్న కన్నీళ్లలా కాముడైన మన్మథుడు కూడా సజల నేత్రుడై నిలిచి ఉన్నాడు. పంచశరాలతో శివుని వేధించిన అతగాడు ఆ స్వామి రెండుకన్నులూ విచ్చి చూడగానే కంగారు పడిపోయాడు. అటువంటి సమయంలో విప్పారిన హరుని ఫాలనేత్రం కాముని దహించినట్లు... హరనేత్రాగ్ని మా పాపాలను దహించివేయు గాక!... ఇది మినహా ఆయనేమీ మాట్లాడలేదు.
‘‘ఇంక అనుమానం ఏముంది? ఈయన ఆ రాజుగారి దేహంలోకి వెళ్లనే వెళ్లాడు’’ అన్నాడు ఆదుర్దాగా విష్ణుశర్మ.
‘‘ష్‌... గట్టిగా చెప్పకు’’ అన్నాడు హస్తామలకుడు నోటిమీద వేలుంచుకుంటూ.
‘‘ఇకమీదట గురువుగారి దేహాన్ని రక్షించే పూచీ నాది. గతరాత్రి మీ ఆనుపానులు తెలుసుకున్న వారెవరైనా అసలు సంగతి పసి గడితే మనకు ఏదైనా ప్రమాదం కలగవచ్చు. మీరందరూ ఈచోటు ఖాళీ చేసి వెళ్లిపోండి. మళ్లీ మాకుగా మేము వచ్చేవరకూ మీరు మమ్మల్ని కలుసుకోవద్దు’’ అన్నాడు పద్మపాదుడు.
అతడి సూచనను అమలు పరచడానికి హస్తామలకుడు తక్షణం అంగీకరించాడు. విష్ణుశర్మకు మాత్రం మనసొప్పలేదు. ‘‘నిన్న సాయంత్రం చిలుక నోట శ్లోకం చెప్పినప్పుడే అనుకున్నాను ఈయనే అయివుంటాడని. మళ్లీ గతరాత్రి ఒకటి చెప్పారట. ఈ స్థితిలోనే ఉండి ఇంకా ఎన్ని చెబుతారో తెలియదు. విన్నది విన్నట్లు రాస్తూ పోతే తప్ప నాకు తృప్తి లేదయ్యా పద్మపాదా! దయచేసి నన్ను నీతో ఉండనివ్వు’’ అభ్యర్ధించాడు విష్ణుశర్మ.
సరేనంటూ అంగీకరించాడు కానీ పద్మపాదుడు, ‘‘కానీ మళ్లీ ఆయన మేలుకునే వరకూ కలవరింతలే ఉండవు. కనుక ఆ శృంగార శతకంలో తదుపరి శ్లోకాలేవో నీకు తెలియడం కష్టం’’ అన్నాడు.
ఆ మాటతో విష్ణుశర్మలో పంతం పెరిగింది. – సశేషం

Advertisement
Advertisement