Sakshi News home page

సొగసరి బైకర్స్

Published Sun, Jul 26 2015 2:12 AM

సొగసరి బైకర్స్ - Sakshi

బాలీవుడ్ బీట్
 ప్రేమ సన్నివేశాల్లో సిగ్గులొలకబోస్తారు. విషాద సన్నివేశాల్లో కన్నీళ్లు కుమ్మరిస్తారు. అంతేనా! కాదు. చాన్స్ ఇవ్వాలే కానీ హీరోయిన్లు హీరోయిజాన్ని కూడా ప్రదర్శిస్తారు. పెద్ద పెద్ద బైకులను సైతం ఈజీగా నడిపేసి హీరోలనే అవాక్కయ్యేలా చేస్తారు. ఇదిగో... ఈ బాలీవుడ్ భామలు ఆ పనే చేశారు!
 
 మొదట్లో కత్రినాని అందం కోసమే చూడాలనేవారు. అయితే రానురాను ఆమె యాక్షన్ సీన్లలో హీరోలతో పోటీ పడటం మొదలుపెట్టింది. ఓ సినిమాలో సల్మాన్‌తో కలసి ఫైట్లు చేసింది. ‘జిందగీ న మిలేగీ దొబారా’లో అయితే హృతిక్ రోషన్‌ని బైక్ మీద ఎక్కించుకుని ఓ రేసర్‌లాగా దూసుకుపోయింది. అది చూసి కత్రినా సామాన్యురాలు కాదు అనుకున్నారంతా!
 
 పరిణీతి ఎంత తుంటరిదో బాలీవుడ్‌లో ఎవర్ని అడిగినా చెప్తారు. ఎప్పుడూ అల్లరి చేస్తూ, అందరినీ ఆటపట్టిస్తూ కిలకిలా నవ్వుతుంటుందీ ముద్దుగుమ్మ. అలాంటి చిలిపి చిన్నదాన్ని బైక్ నడపమంటే ఎలా ఉంటుంది? తెలుసుకోవాలంటే ‘కిల్ దిల్’ చిత్రం చూడాలి. బైక్ మీద పరిణీతిని, పరిణీతిలో యాటిట్యూడ్‌ని చూసి ముచ్చటేయక మానదు.
 
 ఫ్యాషనబుల్ హీరోయిన్స్ లిస్టు చెప్పమంటే అందులో సోనమ్ పేరు తప్పకుండా ఉంటుంది. అయితే ఆమె ‘డాలీకీ డోలీ’ సినిమాతో స్టైలిష్ స్టార్‌గానే కాదు, డేరింగ్ డాల్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఓ పెద్ద బైక్‌ను నడిపి వారేవా అనిపించుకుంది. నిజానికి సోనమ్‌కి రియల్ లైఫ్‌లో కూడా బైక్ రైడింగ్ అంటే మహా ఇష్టం.
 
 క్యూట్‌గా, స్వీట్‌గా ఉండే శ్రద్ధలో రఫ్‌నెస్‌ని ఊహించడం కాస్త కష్టమే. కానీ ఆమె బైక్ నడిపే తీరును చూస్తే ఆడపిల్లా, అగ్గిపుల్లా అనిపిస్తుంది. ‘ఏక్ విలన్’లో ఝాం ఝాం అంటూ బైక్ మీద రైడ్ చేసి అందరినీ ఆశ్చర్యపరచింది శ్రద్ధ. అయితే నిజానికి శ్రద్ధకి బైక్ నడపడం కంటే, ఎవరైనా నడుపుతుంటే వెనుక కూర్చుని రైడ్‌ని ఎంజాయ్ చేయడం ఇష్టమట!
 

Advertisement
Advertisement