హైదరాబాద్‌లో ప్లీనరీ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ప్లీనరీ

Published Wed, Mar 22 2017 2:39 AM

హైదరాబాద్‌లో ప్లీనరీ - Sakshi

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయం
సభ ఏర్పాట్లపై జిల్లా  నేతలకు ఆదేశం
హన్మకొండలోని  ప్రకాష్‌రెడ్డిపేటలో నిర్వహించే అవకాశం


వరంగల్‌: వరంగల్‌ వేదికగా టీఆర్‌ఎస్‌ మరోసారి ప్రతిష్టాత్మక సభ నిర్వహించనుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగసభ వరంగల్‌లోనే జరగనుంది. అధినేత కేసీఆర్‌ ఈ మేరకు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటైన ఏప్రిల్‌ 27న బహిరంగ సభ, పార్టీ కీలక నేతలతో ప్లీనరీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత ఏడాదిలో వరంగల్‌లోనే ప్లీనరీ, బహిరంగసభ నిర్వహించాలని వరంగల్‌ ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు  కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై సీఎం కేసీఆర్‌ స్పష్టత ఇచ్చారు.

ప్రస్తుత ఏడాదిలో బహిరంగ సభను వరంగల్‌లో, ప్లీనరీని హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. 10 లక్షల మందితో  బహిరంగసభ నిర్వహించాలని, దీనికి కోసం ఏర్పాట్లు చేయాలనిముఖ్య నేతలను కేసీఆర్‌ ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ నాయకత్వం 2010 డిసెంబరు 16న దాదాపు 20 లక్షల మందితో వరంగల్‌ నగరంలోని ప్రకాశ్‌రెడ్డిపేటలో భారీ బహిరంగసభ నిర్వహించింది. ప్రస్తుత ఏడాదిలోనూ అక్కడే నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆవిర్భావం నుంచి....
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి వరంగల్‌లోనే ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. పార్టీకి సంబంధించిన కీలకమైన కార్యక్రమాలు ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. పలు బహిరంగ సభలు జరిగాయి. టీఆర్‌ఎస్‌ గతంలోనూ రెండుసార్లు వరంగల్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వరంగల్‌లోనే నిర్వహించింది. 2003 ఏప్రిల్‌ 27న ‘వరంగల్‌ జైత్రయాత్ర’ పేరిట ఆవిర్భావ దినోత్సవ బహిరంగసభ నిర్వహించింది. మాజీ ప్రధాన మంత్రి హెచ్‌.డి.దేవెగౌడ, జాతీయ నేత అజిత్‌సింగ్‌ హాజరయ్యారు. అనంతరం 2007 ఏప్రిల్‌ 27న ‘తెలంగాణ విశ్వరూప మహాసభ’ పేరిట వరంగల్‌లో బహిరంగసభను జరిపింది. మరోసారి వరంగల్‌ వేదికగా ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహించబోతోంది.
 

Advertisement
Advertisement