బంగారు వ్యాపారి కోసం గాలింపు | Sakshi
Sakshi News home page

బంగారు వ్యాపారి కోసం గాలింపు

Published Wed, Oct 26 2016 2:03 AM

Search for gold merchant

ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు పట్టణంలోని హోల్‌సేల్‌ దుకాణదారుల నుంచి బంగారంతో ఉడాయించిన వ్యాపారి ఆచూకీ ఇంత వరకూ లభ్యం కాలేదు. సుదర్శన్‌రెడ్డి అనే వ్యాపారి నాలుగు కిలోల బంగారంతో ఈ నెల 7న ఉడాయించిన విషయం విదితమే. తన దుకాణానికి ఆసాములు వచ్చారని అతను హోల్‌సేల్‌ దుకాణ దారులైన దౌలా వద్ద నుంచి 1 కిలో, హనీఫ్‌ షాపులో నుంచి 3కిలోల బంగారు ఆభరణాలను తీసుకొని వెళ్లాడు. సాధారణంగా అయితే ఎవరైనా బంగారు ఆభరణాలు తీసుకొని వెళ్తే రెండు, మూడు గంటల్లో తిరిగి వారి వారి దుకాణాలకు పంపిస్తారు. అయితే ఇతను మాత్రం సాయంత్రమైనా తిరిగి తీసుకొని రాకపోవడంతో అనుమానం వచ్చిన హోల్‌సేల్‌ వ్యాపారులు సుదర్శన్‌రెడ్డి షాపు వద్దకు వెళ్లగా మూసి ఉంది. ఫోన్‌ చేసినప్పటికీ అతని సెల్‌ ఆఫ్‌లో ఉంది. దీంతో వ్యాపారులిద్దరూ అదే రోజు రాత్రి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
లబోదిబో మంటున్న ప్రజలు..
 ఈ నాలుగు కిలోల బంగారు ఆభరణాలే గాక చాలా మంది ప్రజలు, బంగారు వ్యాపారులు కూడా అతనికి  వస్తువులు తయారు చేయమని బంగారు ఇచ్చినట్లు చెబుతున్నారు. అతను ఉడాయించడంతో వారు లబోదిబో మంటున్నారు. చాలా మంది సుదర్శన్‌రెడ్డి దుకాణం చుట్టూ తిరుగుతున్నారు. ఒకరిద్దరు ఇలా మోసాలకు పాల్పడటం వల్ల అందరికీ  ఇబ్బందులు తలెత్తుతున్నాయని చిన్న చిన్న దుకాణదారులు వాపోతున్నారు.  
పోలీసుల గాలింపు
బంగారంతో ఉడాయించిన సుదర్శన్‌రెడ్డి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇప్పటికే అతనికి సంబంధించిన ఫొటోలను ఇతర జిల్లాల పోలీస్‌ స్టేషన్‌లకు పంపించారు. అతనికి బంగారు ఇచ్చిన బాధితులు నిత్యం పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నారు. కాగా అతను దేశం విడిచి పోయినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే బంగారు వ్యాపారులు మాత్రం అతను ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లేదని చెబుతున్నారు. అతని వద్ద సుమారు 5 కిలోల బంగారు దాకా ఉందని, అంత బంగారంతో అతను ఎక్కడికీ వెళ్లలేడని అంటున్నారు. ఇతర జిల్లా, లేక ఇతర రాష్ట్రాల్లో తలదాచుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు విచారించినప్పటికీ ఫలితం లేదు. అతనితో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తులను కూడా పోలీసులు విచారించారు. రోజులు గడిచే కొద్దీ  ఏమవుతుందోనని బంగారు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అతని వద్ద అంత బంగారం ఉందని తెలిస్తే అతని ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కూడా పోలీసులు, బంగారు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై డీఎస్పీ పూజితా నీలంను వివరణ కోరగా సుదర్శన్‌రెడ్డి కోసం గాలిస్తున్నామని చెప్పారు. 

Advertisement
Advertisement