మాంసం విక్రయాలపై పర్యవేక్షణేది..?

మాంసం విక్రయాలపై పర్యవేక్షణేది..?

  • బల్దియాలో నిబంధనలు గాలికి

  • డాక్టర్‌ ధ్రువీకరణ లేకుండా ‘కోత’

  • వ్యాధుల బారిన పడినా అంతే

  • నిరుపయోగంగా రూ.43 లక్షల కొత్త స్లాటర్‌హౌజ్‌

  • కోల్‌సిటీ: రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మాంసం విక్రయదారులు, బల్దియా అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు. ప్రాణాంతక వ్యాధులు సోకిన మేకలు, గొర్రెలతోపాటు మరణించిన వాటిని సైతం కోసి ప్రజలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పశువైద్యాధికారి పర్యవేక్షణ లేకుండా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాయని వెటర్నరీ డాక్టర్‌ ధ్రువీకరించకుండానే మేకలు, గొర్రెలను కోస్తూ ప్రజలకు ప్రాణాంతక వ్యాధులను అంటగడుతున్నారు. 

     

    విచ్చలవిడిగా అక్రమ స్లాటర్‌హౌస్‌లు

    కార్పొరేషన్‌ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ స్లాటర్‌హౌస్‌లను నిర్వహిస్తున్నారు. మున్సిపల్‌ కూరగాయల మార్కెట్‌లోని స్లాటర్‌హౌస్‌ మాత్రమే ప్రస్తుతం అధికారికంగా వినియోగిస్తున్నారు. నగరంలోని కళ్యాణ్‌నగర్‌లో, ఫైవింక్లయిన్‌ చౌరస్తా, ఎన్టీపీసీ, రామగుండం, ౖయెటింక్లయిన్‌కాలనీలలో విచ్చలవిడిగా అనధికారికంగా స్లాటర్‌హౌస్‌లను నిర్వహిస్తున్నారు. ఇవి కూడా అపరిశుభ్రంగా ఉంటున్నాయి. 

     

    డాక్టర్‌ ధ్రువీకరించకుండానే..

    పశువైద్యాధికారికి కోయాల్సిన మేకలు, గొర్రెలను చూపించాలి. వాటిని పరిశీలించి సమ్మతించాలి. ఆ తర్వాతే కోసి ప్రజలకు మాంసంను విక్రయించాల్సి ఉంటుంది. కానీ నగరంలో ఒక్కరోజు కూడా పశువైద్యశాఖ డాక్టర్‌ ధ్రువీకరించిన దాఖాలు లేవు. దీంతో చనిపోయిన, ప్రాణాంతకమైన వ్యాధులు సోకిన వాటిని కోసి విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 

     

    స్టాంపింగ్‌ వేస్తున్న బల్దియా సిబ్బంది

    మేకలు, గొర్రెలను పశువైద్యశాల డాక్టర్‌ తనిఖీలు చేసి ధ్రువీకరించాక మాత్రమే మున్సిపల్‌ శానిటేషన్‌ సిబ్బంది మాంసంపై స్టాంపింగ్‌(ముద్ర) వేయాల్సి ఉంటుంది. కానీ పశువైద్యాధికారి పర్యవేక్షణ లేకపోవడంతో గత్యంరం లేక స్లాటర్‌హౌస్‌లోని సిబ్బంది కోసిన ప్రతి మేక, గొర్రెల మాంసంపై స్టాంపింగ్‌ చేస్తున్నారు. స్టాపింగ్‌ చేసి ఉన్న మాంసం ఏది నాణ్యతమైనదో... ఏది నాణ్యతలేనిదో ప్రజలు తెలుసుకోలేక పోతున్నారు.

     

    స్లాటర్‌హౌస్‌ నిరుపయోగం

    కార్పొరేషన్‌ పరిధి మల్కాపూర్‌ శివారులోని శ్రీనగర్‌కాలనీ ప్రధాన రోడ్డు ప్రాంతంలో 2009 అక్టోబర్‌లో 12వ ఆర్థిక సంఘం నిధులు రూ.43 లక్షలతో అన్ని వసతులతో విశాలమైన స్లాటర్‌హౌస్‌ను నిర్మించారు. దీనిని ఇప్పటి వరకు పాలకులు, అధికారులు వినియోగంలోకి తీసుకురాలేకపోయారు. 

     

    అధికారుల మౌనంపై అనుమానాలు...

    బహిరంగంగానే అనధికార స్లాటర్‌హౌస్‌లను నిర్వహిస్తున్న వ్యాపారులపై బల్దియా పాలకవర్గం, అధికారులు చర్యలు తీసుకోకుండా మౌనం దాల్చడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డాక్టర్‌ పర్యవేక్షణ లేకుండా అనారోగ్యకరమైన మేకలు, గొర్రెలను కోస్తున్న తీరుపై అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు బలం చేరుకుతోంది. అవినీతికి ఆశపడే చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top