అందని ఈ పంచాయతీ సేవలు | Sakshi
Sakshi News home page

అందని ఈ పంచాయతీ సేవలు

Published Mon, Feb 19 2018 8:35 AM

negligence on E panchayat services - Sakshi

దోమకొండ: గ్రామ పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం ఈ పంచాయితీలను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలందరికీ అక్కడే పలురకాల సేవలను అందించడానికి శ్రీకారం చుట్టింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2, 2016లో దోమకొండ ఉమ్మడి మండలంలోని బీబీపేటలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. పల్లె సమగ్ర సేవా పథకం ద్వారా అన్ని రకాల కార్యక్రమాలు ఒకే వేదికపైకి తేవాలనేది ప్రభుత్వ ఉద్దేశం. కానీ అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది కొరత, ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోవడం.. తదితర కారణాలతో ఈ–పంచాయతీల్లో ప్రజలకు సేవలు అందడం లేదు. కంప్యూటర్లు వృథాగా పడి ఉంటున్నాయి. 

జిల్లాలో 253 క్లస్టర్‌ల ఏర్పాటు..
జిల్లాలో ఈ పంచాయితీ సేవలకుగాను 253 క్లస్టర్‌ గ్రామ పంచాయతీలను గుర్తించారు. ఎంపికైన గ్రామాలకు ఒక్కో పంచాయతీకి రూ.50 వేలతో కంప్యూటర్లను సమకూర్చారు. దీని కోసం ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌లకు ఇంటర్నెట్‌ కేబుల్‌ వైర్లు వేసే బాధ్యతను అప్పగించారు. కానీ జిల్లాలో ఎంపిక చేసిన అన్ని పంచాయతీలకు కేబుల్‌ పనులు పూర్తిస్థాయిలో అందలేదు. కంçప్యూటర్లకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేక వృథాగా ఉంటున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు, పంచాయతీ సిబ్బంది మ«ధ్య సమన్వయ లోపం వల్ల కూడా క్షేత్రస్థాయిలో పనుల్లో జాప్యం అవుతోంది. పనులు వేగంగా పూర్తి చేసి పంచాయతీ సేవలు అందించాల్సిన భాద్యత అధికారులపై ఉందని పలువురు అంటున్నారు.

సిబ్బంది కొరత..
గ్రామ పంచాయతీల్లో ఈ సేవలకు సంబంధించి సిబ్బంది కొరత కూడా ఉంది. 253 క్లస్టర్‌లకు గాను కేవలం 52 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. కొత్తగా నియామకాలు చేపట్టి, సమగ్ర పల్లె సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేయడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ప్రజలకు అందించాల్సిన సేవలివే..
గ్రామాల్లో ప్రజలకు ఈ పంచాయతీల ద్వారా జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇంటి ఆస్తి ధ్రువపత్రాలు, ఇంటి పన్నుల ఆన్‌లైన్‌.. తదితర సేవలు అందించాలి. గ్రామజ్యోతిలో భాగంగా గ్రామ పంచాయతీ స్థూల వివరాలు, సంవత్సర కాలంలో చేపట్టాల్సిన ప్రణాళికలు రూపొందించాలి. గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆదాయ వ్యయాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. నేష్‌నల్‌ పంచాయతీ పోర్టల్‌ (ఎన్‌పీడీ)లో పంచాయతీ సాధారణ నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు,ఆదాయ వ్యయాలు, సమావేశాలు, పంచాయతీ తీర్మాణాలు, పంచాయతీ స్థిర, చర ఆస్తులు నమోదు చేయాలి. ప్రస్తుతం జిల్లాలోని మండల కేంద్రాలతో పాటు మేజర్‌ గ్రామ పంచాయతీల్లోనే ఈ సేవలు అందుతున్నాయి. 

కంప్యూటర్‌ పట్టుకెళ్లారు..
ఈ ఫొటోలో వృథాగా కనిపిస్తున్న ప్రింటర్‌ దోమకొండ మండలం అంచనూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలోనిది. ఈ గ్రామం ఈ పంచాయతీకి ఎంపికైంది. ప్రభుత్వం రూ.50వేలు వెచ్చింది పంచాయతీకి ప్రత్యేకంగా కంప్యూటర్, ప్రింటర్, స్కానర్‌లను అందించింది. అయితే ఇటీవల మండల పరిషత్‌ కార్యాలయానికి కంప్యూటర్లు కావాలని చెప్పి గ్రామ పంచాయతీ నుంచి కంప్యూటర్‌ను అధికారులు తీసుకువెళ్లారు. దీంతో ఈ పంచాయతీ సేవలు ఆన్‌లైన్‌లో కాకుండా మ్యానువల్‌గా ప్రజలకు అందిస్తున్నారు.

ఇంటర్నెట్‌ కోసం ఫోన్‌లను వాడుతున్నాం..
దోమకొండ మండలం ముత్యంపేట పంచాయతీ కార్యాలయంలో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. బీఎస్‌ఎన్‌ఎల్‌ వారు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇచ్చారు. కానీ ఇంటర్నెట్‌ పనిచేయడం లేదు. దీంతో ప్రజలకు సేవలందించడానికి ఫోన్‌లను ఉపయోగించుకుంటున్నాం. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – సాయికుమార్, ఈపంచాయతీ ఆపరేటర్, ముత్యంపేట

Advertisement

తప్పక చదవండి

Advertisement