పార్టీఫండ్‌ పేరుతో బెదిరింపుల దందా | Sakshi
Sakshi News home page

పార్టీఫండ్‌ పేరుతో బెదిరింపుల దందా

Published Mon, Oct 8 2018 9:05 AM

uccri ml Activists Arrest In Party Fund Threats hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: పార్టీ ఫండ్‌ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న  యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ కమ్యూనిస్ట్‌ రివల్యూషనరీస్‌ ఆఫ్‌ ఇండియా (యూసీసీఆర్‌ఐఎంఎల్‌) పార్టీ కార్యకర్తలు ఇద్దరిని మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు సైదాబాద్‌ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను టార్గెట్‌ చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం వెల్లడించారు. గుంటూరుకు చెందిన కె.వెంకటేశ్వరరావు కొన్నేళ్ల క్రితం సిటీకి వలసవచ్చి చైతన్యపురిలోని మారుతీనగర్‌లో నివసిస్తున్నాడు. మలక్‌పేట కేంద్రంగా పని చేస్తున్న యూసీసీఆర్‌ఐఎంఎల్‌ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. నల్లగొండకు చెందిన టి.నవీన్‌రెడ్డి దిల్‌శుఖ్‌నగర్‌లో ఉంటూ బీటెక్‌ చదువుతున్నాడు. ఇతడికి వెంకటేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. ఇటీవల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు వాటి నుంచి బయటపడటానికి మార్గాలు అన్వేషించారు. ఇందులో భాగంగా తాము పని చేస్తున్న పార్టీకి ఫండ్‌ పేరుతో వసూళ్లు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఆ కంపెనీల డైరెక్టర్లు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, మేనేజర్ల వంటి హోదాల్లో ఉన్న దాదాపు 100 మందికి సంబంధించిన ఫోన్‌ నెంబర్లు, చిరునామాలు సేకరించారు.

తొలి టార్గెట్‌గా సైదాబాద్‌ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, బిల్డర్‌ ఆదిత్య రెడ్డిని ఎంచుకున్నారు. శుక్రవారం బైక్‌పై ఇతడి ఇంటికి వెళ్లిన వీరు ఆయన తండ్రిని కలిసి, తాము యూసీసీఆర్‌ఐఎంఎల్‌ కార్యకర్తలమని, తమను మీ కుమారుడు గుర్తుపడతారని చెప్పారు. పార్టీ ఫండ్‌గా కొంత మొత్తం ఇవ్వాలని, దీనికోసం అతడిని కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు. తన కుమారుడు హైటెక్‌ సిటీ ప్రాంతంలో ఉంటాడని  చెప్పడంతో... తమ దగ్గర ఉన్నప్పటికీ ఫోన్‌ నెంబర్‌ అడిగారు. ఆయన లేదనటంతో తమకు కలవాలని చెప్పాలంటూ తిరిగి వచ్చేసిన ఇద్దరూ కేవలం 15 నిమిషాల్లోనే ఆదిత్యకు ఫోన్‌ చేశారు. తాము యూసీసీఆర్‌ఐఎంఎల్‌ కార్యకర్తలమని, ఫండ్‌ ఇవ్వకుంటే తీవ్ర పరిణామాల ఉంటాయని హెచ్చరించారు. అప్పటికే మీ తండ్రికి కలిశామని, నువ్వు వచ్చి తమను కలిస్తే ఎంత మొత్తమో చెప్తామని డిమాండ్‌ చేశారు. దీంతో ఆదిత్య తన తండ్రికి ఫోన్‌ చేయగా ఇద్దరు వచ్చివెళ్లినట్లు తెలిపాడు. దీంతో ఆదిత్య శనివారం సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వీరి కదలికలపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు బి.కాంతరెడ్డి, జి.తిమ్మప్ప వలపన్ని 24 గంటల్లో నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఫోన్లు, యూసీసీఆర్‌ఐఎంఎల్‌ రసీదు పుస్తకాలు, ఇతర బుక్స్‌ స్వాధీనం చేసుకుని కేసును సైదాబాద్‌ పోలీసులకు అప్పగించారు. 

Advertisement
Advertisement