విషాదం మిగిల్చిన క్షణికావేశం | Sakshi
Sakshi News home page

విషాదం మిగిల్చిన క్షణికావేశం

Published Sat, Nov 4 2017 10:53 AM

couples commit to suiciede - Sakshi

ఏడడుగుల అనుబంధం మృత్యువులోనూ ఒకటైంది.. పెద్దలను ఎదురించి, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కళ్ల ముందు విగతజీవిగా పడిఉండటం తట్టుకోలేని భర్త తాను కూడా తనువు చాలించాడు. చదవుల తల్లి కరుణించినా ఉద్యోగం రాలేదన్న భాధతో మహిళ ఉసురు తీసుకోగా భార్యలేని జీవితం తనకూ వద్దని భర్త కనుమూశాడు. పాపం ఎవరిదైనా వారి ఇద్దరు పిల్లలు మాత్రం ఇప్పుడు అనాథలుగా మిగిలారు. అభంశుభం తెలియని ఆ చిన్నారులు తల్లిదండ్రులు కనిపించడం లేదని గుక్కపట్టి ఏడుస్తున్నారు.

గుంటూరుఈస్ట్‌: గుంటూరు రత్నగిరి కాలనీ సమీపంలో గురువారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన దంపతులు మల్లంపాటి ధనలక్ష్మి, శివకృష్ణ మృతదేహాలకు శుక్రవారం వైద్యులు జీజీహెచ్‌లో శవపంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మృతురాలి తండ్రి వెంకటేశ్వరరావు తన కుమార్తె మానసిక సమస్యలతోనే ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్లపాడు ఎస్సై షేక్‌ అమీర్‌ శవ పంచానామా చేశారు.

ప్రాణం తీసిన మానసిక సమస్యలు..
పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురంకు చెందిన ధనలక్ష్మి గుంటూరు రత్నగిరికాలనీ 4వ లైనుకు చెందిన  మల్లంపాటి శివకృష్ణ నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలు వీరి పెళ్లికి అంగీకారం తెలపలేదు. దీంతో రత్నగిరికాలనీలో విడిగా కాపురం పెట్టారు. శివకృష్ణ బస్సు డ్రైవర్‌గా పని చేయడం మొదలుపెట్టారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఒక పాపకు 8 నెలలు. మరోపాపకు రెండేళ్లు. ధనలక్ష్మి ఎంటెక్‌ చేసి ఉండటంతో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. అయితే..ఎక్కడా అవకాశం రాలేదు.

ఇటు తల్లిదండ్రుల తోడులేక అరకొర ఆదాయంతో జీవితం గడుపుతున్న ధనలక్ష్మిని మానసిక సమస్యలు చుట్టుముట్టాయి. మానసికంగా కుంగిపోయింది. గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మృతిని జీర్ణించుకోలేని శివకృష్ణ తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. క్షణికావేశాల్లో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయానికి ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. మొన్నటి దాకా ఆప్యాయంగా లాలించిన అమ్మానాన్నలు ఇప్పుడు దూరంగా కాగా అమ్మనాన్న కోసం చిన్నారులు వేదశ్రీ, హిమశ్రీ ఏడుస్తూ వెతకడం  చూపరులను కంటతడి పెట్టించిది.

Advertisement
Advertisement