నేడు మార్కెట్ల గ్యాపప్‌ ఓపెనింగ్‌! | Sakshi
Sakshi News home page

నేడు మార్కెట్ల గ్యాపప్‌ ఓపెనింగ్‌!

Published Mon, Jul 6 2020 8:46 AM

SGX Nifty indicates Market may open with gapup - Sakshi

నేడు (6న) దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు హుషారుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 117 పాయింట్లు జంప్‌చేసి 10,685 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్‌ 10,568 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. వారాంతాన యూఎస్‌ మార్కెట్లకు సెలవుకాగా.. యూరోపియన్‌ మార్కెట్లు 0.6-1.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లన్నీ భారీ లాభాలతో కదులుతున్నాయి. చైనా 3.5 శాతం, హాంకాంగ్‌ 2.5 శాతం పురోగమించగా.. మిగిలిన మార్కెట్లు 1.4-0.6 శాతం మధ్య ఎగశాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు భారీ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తదుపరి కొంతమేర ఆటుపోట్లు చవిచూడవచ్చని భావిస్తున్నారు.

36,000కు సెన్సెక్స్‌
శుక్రవారం వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరు చూపాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో సెన్సెక్స్‌ 178 పాయింట్లు లాభపడి 36,021 వద్ద నిలిచింది. వెరసి మూడు రోజుల్లో సెన్సెక్స్‌ 1,106 పాయింట్లను జమ చేసుకుంది. తద్వారా 36,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఇక నిఫ్టీ సైతం 56 పాయింట్లు బలపడి 10,607 వద్ద ముగిసింది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  10,570 పాయింట్ల వద్ద, తదుపరి 10,532 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,638 పాయింట్ల వద్ద, ఆపై  10,669 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,704 పాయింట్ల వద్ద, తదుపరి 21,555 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,066 పాయింట్ల వద్ద, తదుపరి 22,279 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో  వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 857 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 332 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 557 కోట్ల అమ్మకాలు నిర్వహించగా.. డీఐఐలు రూ. 909 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

1/1

Advertisement
Advertisement