సెన్సెక్స్‌ 260 పాయింట్లు డౌన్‌ | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌ 260 పాయింట్లు డౌన్‌

Published Wed, Aug 9 2017 8:09 AM

సెన్సెక్స్‌ 260 పాయింట్లు డౌన్‌

10,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ
 అనుమానాస్పద షెల్‌ కంపెనీలపై
సెబీ ఆదేశాల ప్రభావం


ముంబై: స్టాక్‌ ఎక్స్చేంజీల్లో లిస్టయిన 331 షెల్‌ కంపెనీల్లో ట్రేడింగ్‌ను నిలుపుచేసేందుకు మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ ఆదేశాలు జారీచేయడంతో మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 260 పాయింట్లు పతనమయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలక 10,000 పాయింట్ల స్థాయి దిగువన ముగిసింది. అనుమానాస్పద షెల్‌ కంపెనీలపై చర్యలు చేపట్టాలంటూ గత రాత్రి స్టాక్‌ ఎక్స్చేంజీలను సెబీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ట్రెండ్‌ సానుకూలంగా వుండటంతో 32,341 పాయింట్ల గరిష్టస్థాయి వద్ద సెన్సెక్స్‌ ప్రారంభమైనప్పటికీ, వెనువెంటనే అమ్మకాలు వెల్లువెత్తడంతో 32,000 పాయింట్ల స్థాయి లోపునకు పడిపోయింది. 31,915 పాయింట్ల కనిష్ట స్థాయి వరకూ తగ్గిన సెన్సెక్స్, ముగింపులో కాస్త కోలుకుని 32,014 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. క్రితం ముగింపుతో పోలిస్తే చివరకు 260 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ 10,083 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 9,947 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమయ్యింది. చివరకు 79 పాయింట్ల నష్టంతో 9,979 పాయింట్ల వద్ద ముగిసింది.

డాక్టర్‌ రెడ్డీస్‌ భారీ క్షీణత...
కొద్దిరోజులుగా పడిపోతూ వస్తున్న ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌లాబ్‌ తాజాగా మరో 5 శాతం పతనమయ్యి రూ. 2,095 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌–30లో అత్యధికంగా తగ్గిన షేరు ఇదే. ఎస్‌బీఐ ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, యాక్సిస్‌ బ్యాంక్, ఓఎన్‌జీసీ, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, సన్‌ఫార్మా, కొటక్‌ బ్యాంక్, లుపిన్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఎల్‌ అండ్‌ టీ షేర్లు తగ్గాయి. ప్రపంచ ట్రెండ్‌కు అనుగుణంగా మెటల్‌ షేర్లు మాత్రం మెరుపులు మెరిపించాయి. టాటా స్టీల్, హిందాల్కో, వేదాంత, నాల్కో, సెయిల్, ఎన్‌ఎండీసీలు 1–4 శాతం మధ్య ర్యాలీ జరిపాయి.  

రూ.1.43 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి...
తాజా స్టాక్‌ మార్కెట్‌ క్షీణతతో రూ. 1.43 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్‌ విలువ రూ. 1,43,635 కోట్లు తగ్గి రూ. 1,31,84,912 కోట్లకు దిగింది.

Advertisement
Advertisement