గణాంకాలు తెచ్చిన నష్టాలు | Sakshi
Sakshi News home page

గణాంకాలు తెచ్చిన నష్టాలు

Published Thu, Dec 14 2017 1:17 AM

Sensex falls over 200 points, Nifty trades around 10200 - Sakshi

ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాలు నిరాశకు గురిచేయడంతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. ఆర్థిక వృద్ధి అంచనాలను ఏడీబీ తగ్గించడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపు అంచనాల(భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 12.30 నిమిషాలకి ఈ నిర్ణయం వెలువడనుంది) నేపథ్యంలో అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం వంటి అంశాలు స్టాక్‌ సూచీలు వరుసగా రెండో రోజూ పతనమవడానికి దారితీశాయి.  ఆద్యంతం తీవ్రమైన ఒడిదుడుకులకు గురైన బుధవారం నాటి ట్రేడిం గ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 175 పాయింట్లు నష్టపోయి 33,053 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 47 పాయింట్లు పతనమై 10,170 పాయింట్ల వద్ద ముగిశాయి. గుజరాత్‌ రెండో దశ ఎన్నికల పోలింగ్, ఎగ్జిట్‌ ఫలితాలు నేడు(గురువారం) వెలువడుతుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

415 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌..
ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 32,988–33,404 పాయింట్ల కనిష్ట, గరిష్ట స్థాయిలను తాకింది. అంటే సెన్సెక్స్‌ దాదాపు 415 పాయింట్ల రేంజ్‌లో కదిలింది.

సిమెంట్‌ షేర్ల జోరు..: ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతుండటంతో సిమెంట్‌ కంపెనీల పెట్‌కోక్‌ వినియోగాన్ని గతంలో సుప్రీంకోర్ట్‌ నిషేధించింది. సిమెంట్‌ కంపెనీలు పెట్‌కోక్‌ను వినియోగించుకోవచ్చని సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులతో సిమెంట్‌ కంపెనీలు లాభపడ్డాయి.
సిప్లా 2 శాతం డౌన్‌: సిప్లా 2.1 శాతం నష్టపోయింది. సెన్సెక్స్‌లో అధిక భాగం నష్టపోయిన షేర్‌ ఇదే. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఎల్‌ అండ్‌ టీ, టాటా స్టీల్, పవర్‌ గ్రిడ్‌లు నష్టపోగా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ హిందుస్తాన్‌ యూనిలీవర్‌ షేర్లు లాభపడ్డాయి. 

Advertisement
Advertisement