సెన్సెక్స్‌ 361 పాయింట్లు అప్‌  | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌ 361 పాయింట్లు అప్‌ 

Published Sat, Dec 8 2018 2:00 AM

Sensex Closes 361 Points Higher, Nifty Settles At 10693 - Sakshi

మూడు రోజుల నష్టాలకు శుక్రవారం బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటానికి తోడు రూపాయి రికవరీ జత కావడంతో స్టాక్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడి కానున్న నేపథ్యంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 361 పాయింట్లు లాభపడి 35,673 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో 10,694 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆర్థిక రంగ, వాహన, వినియోగ షేర్లు లాభపడ్డాయి. ఇక వారం పరంగా చూస్తే, స్టాక్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 521 పాయింట్లు, నిఫ్టీ 183 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.  

ప్రపంచ మార్కెట్ల జోరు... 
రేట్ల పెంపు గతంలోలాగా జోరుగా ఉండదని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమి పావెల్‌ సంకేతాలివ్వడం ప్రపంచ మార్కెట్లలో జోరును పెంచింది. మరోవైపు సమీప భవిష్యత్తులో అమెరికాలో ఆర్థిక వృద్ధి తగ్గే అవకాశాల్లేవని ఐఎమ్‌ఎఫ్‌ చీఫ్‌ క్రిస్టినా లగార్డే వ్యాఖ్యానించడం కూడా కలసివచ్చింది. డాలర్‌తో రూపాయి మారకం 24 పైసలు బలపడి 70.66కు ఎగియడం(ఇంట్రాడేలో) ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. లాభాల్లోనే ఆరంభమైన సెన్సెక్స్‌ రోజంతా అదే జోరు చూపించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 418 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల వరకూ లాభపడ్డాయి.  మార్కెట్‌లో అప్రమత్తత: ఈ వారంలో స్టాక్‌మార్కెట్లో అప్రమత్త వాతావరణం కనిపించిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ నాయర్‌ పేర్కొన్నారు. రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకుందని వివరించారు. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గగలవనే అంచనాలు, ముడి చమురు ఉత్పత్తి కోత విషయంలో నిర్ణయాన్ని ఒపెక్‌ జాగు చేయడం కూడా కలసిరావడంతో ప్రపంచ మార్కెట్లు రివకరీ అయ్యాయని తెలిపారు. ఈ ప్రభావంతో మన మార్కెట్‌ కూడా లాభపడిందని వివరించారు.  

కోటక్‌ బ్యాంక్‌పై బఫెట్‌ కన్ను? 
అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్‌ హతావే, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో 10 శాతం వరకూ వాటా కొనుగోలు చేయనున్నదన్న వార్తల కారణంగా కోటక్‌ మహీంద్రా  బ్యాంక్‌ జోరుగా పెరిగింది. ఇంట్రాడేలో 10 శాతానికి పైగా పెరిగి, రూ.1,345ను తాకిన  ఈ షేర్‌ చివరకు 8.5 శాతం లాభంతో రూ.1,282 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ మొత్తం 361 పాయింట్ల లాభంలో ఈ షేర్‌ వాటా 119 పాయింట్లుగా ఉంది. కోటక్‌ బ్యాంక్‌లో హతావే సంస్థ 400 కోట్ల డాలర్ల నుంచి 600 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నదన్న వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే ఈ వార్తలను కోటక్‌ బ్యాంక్‌ ఖండించింది.  
ఐబీఎమ్‌ కంపెనీకి చెందిన రూ.12,700 కోట్ల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అంతా నగదులోనే ఉండటంతో ఈ షేర్‌ 5 శాతం నష్టంతో రూ.962 వద్ద ముగిసింది.   కోల్‌ ఇండియా, సెయిల్, భెల్, ఆయిల్‌ ఇండియా, టాటా మోటార్స్, రిలయన్స్‌ క్యాపిటల్, బాలకృష్ణ ఇండస్ట్రీస్,  తదితర షేర్లు ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి.    

Advertisement
Advertisement