భారత్‌ ‘వృద్ధి’ జిగేల్‌..!

Q1 GDP growth rate zooms to 8.2%, highest in over two years - Sakshi

ఏప్రిల్‌–జూన్‌ మధ్య 8.2 శాతం వృద్ధి

రెండేళ్ల గరిష్ట స్థాయి ఇది..

శుభ సూచికంతో ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ప్రారంభం

తయారీ, వ్యవసాయ రంగాల దన్ను

7.2–7.6 శ్రేణి అంచనాలకు మించిన ఫలితాలు

జనవరి – మార్చి వృద్ధి 7.7 శాతం

గత ఏడాది తొలి త్రైమాసికంలో ఈ రేటు 5.6 శాతం

తాజా ‘ఘన’ ఫలితానికి తోడయిన ఈ తక్కువస్థాయి బేస్‌ ఎఫెక్ట్‌

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్‌– 2019 మార్చి) తొలి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, దూసుకుపోయింది. ఏకంగా 8.2 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ఇది తొమ్మిది త్రైమాసికాల గరిష్టస్థాయి. 

2016–17 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 8.1 శాతంగా నమోదయ్యింది.  అటు తర్వాత ఇంత స్థాయి వృద్ధి రేటును సాధించడం ఇదే తొలిసారి. అంతక్రితం 2014–15 జూలై– సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఈ రేటు 8.4 శాతం.   నిజానికి పలు ఆర్థిక విశ్లేషణా, రేటింగ్‌ సంస్థలు 2018–19 తొలి త్రైమాసికంలో 7.2 శాతం నుంచి 7.6 శాతం వృద్ధి రేటు అంచనాలను వేశాయి.

బేస్‌ ఎఫెక్ట్‌కు తయారీ, వ్యవసాయం తోడు?
గత ఏడాది (2017 ఏప్రిల్‌–జూన్‌) ఇదే త్రైమాసికంలో అతి తక్కువగా అంటే 5.6 శాతం వృద్ధి శాతం నమోదయ్యింది. ప్రస్తుత ఫలితానికి దీనిని బేస్‌గా చూస్తారు. దీనిని బేస్‌ ఎఫెక్ట్‌ అని కూడా అంటారు. బేస్‌ తక్కువగా ఉన్నప్పుడు పెరుగుదల ఏమాత్రం ఉన్నా, అది శాతాల్లో అధికంగా కనిపించడమే బేస్‌ ఎఫెక్ట్‌  మాయ. 

గత ఏడాది అతి తక్కువ బేస్‌ ఎఫెక్ట్‌కు తోడు తయారీ రంగం, అలాగే వ్యవసాయ రంగం నమోదు చేసుకున్న మంచి ఫలితాలు 2018 ఏప్రిల్‌–జూన్‌లో వృద్ధిని ‘లాంగ్‌ జంప్‌’ బాటన నిలిపింది. మొత్తం జీడీపీలో సేవల రంగం వాటా దాదాపు 60 శాతం ఉంటే, వ్యవసాయ, సేవల రంగాల వాటా దాదాపు 30 శాతంగా ఉన్నాయి. కాగా గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం జనవరి–మార్చిలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7.7 శాతంగా ఉంది.

వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ...
భారీ వృద్ధి రేటుతో ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతోంది. తరువాతి స్థానం చైనాది. ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 6.7 శాతమే కావడం గమనార్హం.

విలువ... రూ.33.74 లక్షల కోట్లు
కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2011–12 స్థిర ధరల వద్ద చూస్తే, మొదటి త్రైమాసికం  జీడీపీ మొత్తం విలువ రూ.33.74 లక్షల కోట్లు. 2017–18 ఇదే త్రైమాసికంలో ఈ విలువ రూ.31.18 లక్షల కోట్లు. అంటే వృద్ధి రేటు 8.2 శాతమన్నమాట.

స్థూల విలువ జోడింపు లెక్కలు ఇలా...
కాగా, 2011–12 స్థిర ధరల వద్ద– ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం వృద్ధి గణాంకాలు స్థూల విలువ జోడింపు (జీవీఏ) ప్రకారం  రూ.29.29 లక్షల కోట్ల నుంచి రూ.31.63 లక్షల కోట్లకు చేరింది. వృద్ధి రేటు 8 శాతం. గత ఏడాది ఇదే కాలంలో వృద్ధిరేటు 5.6 శాతం. ఒక దేశ ఆర్థిక వృద్ధిని లెక్కించడానికి జీడీపీతో పాటు జీవీఏ విధానాన్నీ వినియోగించడం జరుగుతుంది. ఒక దేశంలో ఉత్పత్తి అయిన ఉత్పత్తుల మొత్తం విలువే జీడీపీ. ప్రైవేటు వినియోగం, స్థూల పెట్టుబడులు, ప్రభుత్వ పెట్టుబడులు, వ్యయాలు ఇవన్నీ జీడీపీ పరిధిలోకి వస్తాయి.  అయితే ఒక ప్రొడక్ట్‌కు సంబంధించి సబ్సిడీలు, పన్నులు అన్నీ కలుపుకుని జీవీఏగా పరిగణించడం జరుగుతుంది.

రంగాల వారీగా...
తయారీ రంగం వృద్ధి రేటు 1.8% (2017–18 క్యూ1) నుంచి భారీగా 13.5 శాతానికి పెరిగింది.
వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల వృద్ధి రేటు 3% నుంచి 5.3%కి పెరిగింది.
విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల ఉత్పత్తి వృద్ధి రేటు 7.3%గా నమోదైంది.
♦  నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించి వృద్ధి 8.7 శాతంగా ఉంది.
 పెట్టుబడులకు సంబంధించిన క్యాపిటల్‌ ఫార్మేషన్‌ విభాగంలో 10%పెగా వృద్ధి నమోదైంది.
అయితే ట్రేడ్, హోటల్స్, రవాణా, కమ్యూనికేన్స్, బ్రాడ్‌కాస్టింగ్, ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్‌ సేవలు, మైనింగ్‌ అండ్‌ క్వారీయింగ్‌ ఉత్పత్తి విలువలు నెమ్మదించాయి.

మెరుగుపడిన ద్రవ్యలోటు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలైతో ముగిసిన నెలతో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు మెరుగుపడింది. బడ్జెట్‌ అంచనాల్లో 86.5 శాతంగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలతో ద్రవ్యలోటు బడ్జెట్‌ అంచనాల్లో 92.4 శాతంగా ఉంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఈ లోటు విలువలో రూ.6.24 లక్షల కోట్లుగా ఉండాలన్నది అంచనా. అయితే మొదటి నాలుగు నెలల్లో రూ.5.4 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం జీడీపీలో ద్రవ్యలోటు గత ఆర్థిక సంవత్సరం 3.53 శాతం అయితే, ఈ ఏడాది దీనిని 3.3 శాతానికి తగ్గించాలన్నది బడ్జెట్‌ లక్ష్యం.

భారత్‌ సామర్థ్యానికి నిదర్శనం...
భారత్‌ ఆర్థిక సామర్థ్యానికి తాజా నిదర్శనమిది. సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణ వృద్ధికి అన్ని విధాలా దోహదపడుతున్నాయి. వ్యయం చేసే మధ్య తరగతి ప్రజలు భారత్‌లో పెరుగుతున్నారు. – అరుణ్‌జైట్లీ, ఆర్థికమంత్రి

ఉన్నత స్థానం దిశగా అడుగులు...
పలు రంగాలు 7 శాతం పైగా వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌ వృద్ధి  ఉన్నత స్థానం దిశగా పయనిస్తోందనడానికి గణాంకాలు సంకేతం.
– సురేశ్‌ ప్రభు, వాణిజ్యశాఖ మంత్రి

అద్భుత ఫలితం...
ఇది అద్భుత ఫలితం. 8.2 శాతం వృద్ధి రేటు 9 త్రైమాసికాల గరిష్టస్థాయి. భారత్‌ వృద్ధి రేటు మరింత పెరుగుతుంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు తొలినాటి సమస్యలు తొలగిపోయాయి. – రాజీవ్‌ కుమార్, నీతి ఆయోగ్‌

చెప్పుకోదగిన వేగం...
గడచిన నాలుగు త్రైమాసికాలను చూస్తే, వృద్ధి వరుసగా 6.3, 7.0, 7.7, 8.2 శాతాలుగా నమోదయ్యింది. ఇది ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన రికవరీ.  వ్యవస్థాగత సంస్కరణలు ఫలితాన్ని ఇస్తున్నాయి. – హాస్‌ముఖ్‌ ఆదియా, ఫైనాన్స్‌ సెక్రటరీ

ఆశావహ ధోరణి
తాజా ఫలితం వృద్ధి ధోరణి పటిష్టం విషయంలో ఆశావహ పరిస్థితిని సృష్టిస్తోంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో అంచనాలు 7.5 శాతంకన్నా వృద్ధి పెరిగే అవకాశం కనిపిస్తోంది.
– ఎస్‌సీ గార్గ్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి

తయారీ రంగం హర్షణీయం
తయారీ రంగం వృద్ధి ఉపాధి కల్పనకు దోహదపడుతుంది. వృద్ధికి ఈ రంగం సహకారం అందించడం సానుకూల అంశం. ఇక్కడ నిర్మాణ రంగం వృద్ధి కూడా ప్రస్తావనార్హం.
– సందీప్‌ జజోడియా, అసోచామ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top