ఇన్ఫీకి మరో సీనియర్‌ గుడ్‌బై | Sakshi
Sakshi News home page

ఇన్ఫీకి మరో సీనియర్‌ గుడ్‌బై

Published Mon, Sep 18 2017 11:10 AM

ఇన్ఫీకి మరో సీనియర్‌ గుడ్‌బై

సాక్షి, బెంగళూరు : టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ రాజగోపాలన్‌ కంపెనీకి గుడ్‌బై చెప్పారు. ఇన్ఫోసిస్‌ సీఈవోగా, ఎండీగా విశాల్‌ సిక్కా రాజీనామా చేసిన నెల అనంతరం రాజగోపాలన్‌ కూడా కంపెనీ నుంచి వైదొలిగారు. ఆయన లింక్‌డిన్‌ ప్రొఫైల్‌లో రాజగోపాలన్‌ తనను తాను స్వేచ్ఛా వ్యక్తిగా అభివర్ణించుకున్నారు. అంతేకాక 2014 ఆగస్టు నుంచి 2017 సెప్టెంబర్‌ వరకు తాను ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుడిని అని పేర్కొన్నారు. విశాల్‌ సిక్కా రాజీనామా అనంతరం రాజగోపాలన్‌ కూడా కంపెనీ నుంచి వైదొలుగుతారని అంచనాలు వెలువడ్డాయి. 
 
సిక్కా తీసుకొచ్చిన తన మాజీ ఎస్‌ఏపీ కొలిగ్స్‌లో రాజగోపాలన్‌ కూడా ఒకరు. కొత్త కార్యక్రమాలను అమలు చేయడానికి ఎస్‌ఏపీలోని తన తోటి ఉద్యోగులను సిక్కా ఇన్ఫోసిస్‌లో చేర్చుకున్నారు. డిజైన్‌ థింకింగ్‌, క్రియేటివ్‌, సమస్య పరిష్కారానికి వినియోగదారు కేంద్రీకృత విధానం వంటి వాటికి రాజగోపాలన్‌ అధినేతగా ఉండేవారు. మైసూర్‌, ఇతర అభివృద్ధి సెంటర్లలో ఇన్ఫోసిస్‌ ఉద్యోగులందరికీ లార్జ్‌ స్కేల్‌ డిజైన్‌ థింకింగ్‌కు ట్రైనింగ్‌ సెషన్లు కూడా నిర్వర్తించారు. అయితే ఈ రాజీనామాలపై కంపెనీ ఎలాంటి కామెంట్‌ చేయలేదు.
 
జూలైలో ఇన్నోవేషన్‌ ఫండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ యూసఫ్‌ బషీర్‌ కూడా కంపెనీ నుంచి బయటకి వచ్చేశారు. ఈయన కూడా ఎస్‌ఏపీలో ఉన్నప్పుడు విశాల్‌ సిక్కాకు తోటి ఉద్యోగుడు. కంపెనీ వ్యవస్థాపకులతో పొంతన కుదరకపోవడంతో, ఇన్ఫీ సీఈవోగా విశాల్‌ సిక్కా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇన్ఫీ నుంచి వైదొలిగిన అనంతరం వ్యవస్థాపకులపై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. 

Advertisement
Advertisement