ద్రవ్యలోటు లక్ష్యాన్ని సడలించాలి

Fiscal deficit hits 96.1% but Modi govt confident of meeting target

న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి మందగమనానికి అడ్డుకట్టవేసి.. మళ్లీ పరుగులు తీయించాలంటే ప్రభుత్వం ద్రవ్యలోటు లక్ష్యాన్ని సడలించాల్సిందేనని పారిశ్రామిక మండలి అసోచామ్‌ కేంద్రానికి విన్నవించింది. ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలు పెరిగితేనే వృద్ధి పుంజుకుంటుందని పేర్కొంది. పెద్దనోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌), వస్తు–సేవల పన్ను(జీఎస్‌టీ)అమలు నేపథ్యంలో జీడీపీ వృద్ధి క్రమంగా తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది తొలి త్రైమాసికం(2017–18 ఏప్రిల్‌–జూన్‌)లో వృద్ధి రేటు ఏకంగా మూడేళ్ల కనిష్టానికి(5.7 శాతం)పడిపోవడంతో ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. ‘డీమోనిటైజేషన్‌ ప్రభావంతోపాటు జీఎస్‌టీ అమలు కారణంగా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఇబ్బందులు వృద్ధిరేటును దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అసాధారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని అసోచామ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

 ఈ ఆర్థిక సంవత్సరం, వచ్చే ఏడాది కూడా ద్రవ్యలోటు లక్ష్యాన్ని అర శాతం మేర సడలించాలని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ డీఎస్‌ రావత్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలపై కఠిన పర్యవేక్షణ ఉండాలని.. ముఖ్యంగా ఈ నిధులను రోడ్లు, విద్యుత్, రైల్వేలు, పోర్టులు వంటి మౌలిక రంగాలపై వెచ్చించడం ద్వారా పెట్టుబడులకు పునరుత్తేజం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని చూస్తుంటే తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం నెలకొందని చెప్పారు. ఈ ఏడాది ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం 3.2 శాతంగా నిర్ధేశించిన సంగతి తెలిసిందే. మందగమనం నేపథ్యంలో పారిశ్రామిక రంగానికి ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చే అవకాశం ఉందని.. దీనివల్ల ద్రవ్యలోటు పెరిగేందుకు దారితీయొచ్చన్న వార్తలు ఇటీవల చక్కర్లు కొడుతున్నాయి. అయితే, లక్ష్యాన్ని తగ్గించే అవకాశం లేదని తాజాగా ఆర్థిక శాఖ తేల్చిచెప్పడం గమనార్హం.

పావు శాతం వడ్డీరేటు తగ్గించాలి...
పడిపోతున్న వృద్ధికి తక్షణం చికిత్స అవసరమని.. దీనికోసం ఆర్‌బీఐ పాలసీ సమీక్షలో(ఈ నెల 4న) వడ్డీరేటును(రెపో) పావు శాతం తగ్గించాల్సిందేనని అసోచామ్‌ పేర్కొంది. ఈమేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు లేఖ కూడా రాసింది.

Back to Top