మరుగుదొడ్ల వ్యవహారంలో భారీ అవినీతి | Sakshi
Sakshi News home page

మరుగుదొడ్ల వ్యవహారంలో భారీ అవినీతి

Published Tue, Oct 9 2018 1:52 PM

YS Avinash Reddy Campaign On Navarathnalu In YSR Kadapa - Sakshi

వైఎస్‌ఆర్‌ జిల్లా, చక్రాయపేట : చక్రాయపేట మండలంలోని కుప్పం తాండాలో మరుగుదొడ్ల వ్యవహారంలో భారీ అవినీతి చోటు చేసుకుందని.. జిల్లా అధికారులు వెంటనే విచారణ జరిపితే భారీ కుంభ కోణం బయటపడుతుందని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం చక్రాయపేట మండలంలోని కుప్పం తాండ, అద్దాలమర్రి గ్రామాలలో‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ నవ రత్నాలను వివరించారు. ఈ సందర్భంగా కుప్పం తాండలో ఉన్న పలువురు మహిళలు వచ్చి కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి మరుగు దొడ్ల వ్యవహారంలో చోటుచేసుకున్న అవినీతిని వివరించారు. మరుగుదొడ్లు నిర్మించకుండా నిర్మించినట్లు.. అరకొరగా నిర్మాణాలు చేపట్టి వదిలేసి బిల్లులు చేసుకుని వెళ్లారని.. ఇలాగైతే తాము ఎలా మరుగదొడ్లను వినియోగించుకోవాలంటూ వైఎస్‌ అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఆయన తీవ్రంగా స్పందించారు.

మరుగుదొడ్లలో జరిగిన అవినీతిపై విచారణ చేస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని.. వెంటనే జిల్లా ఉన్నతాధికారులు చక్రాయపేట మండలంలో మరుగుదొడ్ల కుంభ కోణంపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మరుగుదొడ్లకు సంబంధించి గుంతల స్థాయిలోనే థర్డ్‌ పార్టీ కాంట్రాక్టర్‌గా అవతారమెత్తి ఫీల్డ్‌ అసిస్టెంటు బిల్లులు మార్చుకుని తిన్నారని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి వారు మొర పెట్టుకున్నారు. ఇందుకు ఆయన స్పందిస్తూ ఎవరికి వారు ఇష్టానుసారంగా కట్టకుండానే కట్టినట్లు చూపించి తమ జేబులలోకి మళ్లించుకున్నారని.. ఇది సరైంది కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరగాలంటే ఒక్కసారి గ్రామంలో విచారణ జరపాలన్నారు.

Advertisement
Advertisement