తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యం | Sakshi
Sakshi News home page

తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యం

Published Fri, Nov 22 2013 3:51 AM

with KCR It is possible Telangana reconstruction

భూత్పూర్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణం జరిగి, శరవేగంగా అభివృద్ధి చెందాలంటే తమ అధినేత కేసీఆర్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. గురువారం భూత్పూర్ లోని మునిరంగస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మండలస్థాయి కార్యకర్తల శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణకు సీఎం కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, సీమాంధ్ర పార్టీల నేతలు అడ్డుపడటం సిగ్గుచేటన్నారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
 
 తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లాను జూరాల ద్వారా 100 టీఎంసీల నీటితో సస్యశ్యామలం చేస్తామన్నారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న ప్రతిపాదనను సీమాంధ్ర నే తలు విరమించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే పది జిల్లాలను 24 జిల్లాలుగా విభజిస్తామని,  ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల సాగునీరు అందిస్తామన్నారు. అరవై ఏళ్లుగా సీమాంధ్రులు తెలంగాణ ప్రజలను అన్ని రంగాల్లో అణగదొక్కారని, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో టీఆర్‌ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు.
 
 జిల్లా కన్వీనర్ విఠల్‌రావు ఆర్యా మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం టీఆర్‌ఎస్ అలుపెరుగని పోరాటం చేసిందని,  ఇప్పుడు టీకాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తామే సాధించామని యాత్రలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ దేవరకద్ర నియోజకవర్గ ఇన్‌చార్జి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు నర్సింహ్మరెడ్డి, నారాయణగౌడ్, కదిరె శేఖర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, భూషణ్‌కుమార్, బస్వరాజుగౌడ్, గొడుగు ఆంజనేయులు, ఆర్.చంద్రమౌళి, రామేశ్వర్‌రావు, కాట్రావత్ శంకర్‌నాయక్ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement